గ్రేట్‌ జర్నీ స్టీరింగ్‌ ఉమన్‌

20 Jul, 2021 01:10 IST|Sakshi
మాయా రాథోడ్‌

ఆమె ఆటో రిక్షా నడుపుతుంటే ఆ పట్టణంలోని పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు... ఇలా కూడా ఉంటుందా? అన్నంత విచిత్రంగా చూస్తారు. నిజమే... వాహనం స్టీరింగ్‌ ఆడవాళ్ల చేతిలో ఉండడం అంటే వాళ్లకు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూడడమే. నడివయసు మగవాళ్లైతే ఆ దృశ్యాన్ని కళ్లెర్రచేసి చూస్తారు. ఆమె తల్లిదండ్రులను, భర్తను తలుచుకుని ఆడపిల్లను ఎలా పెంచాలో, స్త్రీ పట్ల ఎంతటి కట్టుబాట్లు పాటించాలో తెలియని మూర్ఖులు అన్నట్లు ఓ చూపు చూసి, తమ ఇంటి ఆడవాళ్లను గూంగట్‌ చాటున దాచిన తమ ఘనతను తలుచుకుని మీసం మీద చెయ్యేసుకుంటారిప్పటికీ. ఈ సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది నలభై ఏళ్ల మాయా రాథోడ్‌.

ఒక్క సంప్రదాయ సంకెళ్లను మాత్రమే కాదు, పోలియో బారిన పడిన అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోదని, సంకల్పం, పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే బతుకుపథంలో అడుగులు చక్కగా వేయవచ్చని కూడా నిరూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం కూడా ప్రముఖం గా గుర్తించాల్సిందే ఉంది. కాలుష్య రహిత సమాజ స్థాపనలో భాగంగా కాలుష్యాన్ని విడుదల చేసే ఆటోరిక్షాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టినప్పుడు మగవాళ్లు ఎలక్ట్రానిక్‌ స్టీరింగ్‌ పట్టుకోవడానికి సాహసించలేదు. అలాంటప్పుడు మాయా రాథోడ్‌ వేసిన ఓ ముందడుగు ఇప్పుడు రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో పలువురికి స్ఫూర్తినిస్తోంది. అక్కడి మహిళలకు మాయా రాథోడ్‌ ఓ రోల్‌ మోడల్‌ అయింది.

బహుముఖ పోరాటం
మాయా రాథోడ్‌ ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడింది. అసలే ఆడపిల్లలు బతికి బట్టకట్టడం కష్టమైన రాజస్థాన్‌ రాష్ట్రం. ఆడపిల్లలను బడికి పంపించమని ప్రభుత్వాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట మాయా రాథోడ్‌ బతుకు పోరాటం చేసింది. ఏకకాలం లో పోలియోతోనూ సమాజంతోనూ పోరాడింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ జీతంతో బతుకు కుదుట పడడం కుదిరే పని కాదని కూడా త్వరలోనే అర్థమైందామెకు. భర్త సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే తప్ప పిల్లల భవిష్యత్తుకు మంచి దారి వేయలేమని కూడా అనుకుంది.

అదే సమయంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ ఆటో రిక్షాలను సబ్సిడీ ధరలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్షణంలో మాయా రాథోడ్‌ తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బ్యాంకు లోన్‌ తీసుకుని ఎలక్ట్రానిక్‌ ఆటో రిక్షా తీసుకున్నది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆ క్షణం నుంచి ఆమెను సంప్రదాయ సమాజం విమర్శన దృక్కులతో వేధించింది. అభివృద్ధి పథం లో నడవాలనుకున్న సమాజం ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఆమె మాత్రం... ‘మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్న రోజులివి. ఆటో రిక్షా నడపడాన్ని కూడా ఆక్షేపించే రోజులు కావివి. ఆటో నడపడం నాకు వచ్చో రాదో అనే సందేహాలు వద్దు. నా ఆటోలో ప్రయాణించి చూడండి’ అని సవాల్‌ విసురుతోంది.

ఈ మూడేళ్లలో బిల్వారాలో మంచి మార్పే వచ్చింది. చిల్లర దొంగతనాలు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో రాత్రిళ్లు మగవాళ్ల ఆటోలో ప్రయాణించడం కంటే మాయ ఆటోలో ప్రయాణించడానికి ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా ఇష్టపడుతున్నారు.

మరిన్ని వార్తలు