వరదసాయంలో శానిటరీ ప్యాడ్స్‌ ఎక్కడ?!

3 Sep, 2020 08:04 IST|Sakshi
అస్సాంలో వరద బాధితులు

ప్రశ్నించడంలోనే ప్రగతి ఉంది. ప్రశ్నిస్తేనే పరిష్కారం ఉందని నమ్ముతుంది మయూరి భట్టాచార్జీ. అస్సాంలోని లక్షాలాది మహిళల తరపున తన గళం విప్పుతోంది. విషయం ఏంటంటే.. అస్సాంలో ప్రతీ యేటా వరద తాకిడి ఉదృతంగా ఉంటుంది. ఎన్నో ప్రాంతాలు జలమయం అవుతూనే ఉంటాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే వరద సాయంలో నిత్యావసరాలు ప్రజలకు అందుతుంటాయి. అయితే, ఆ జాబితాలో లక్షలాది మంది మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యకు శానిటరీ ప్యాడ్స్‌ ఉండితీరాల్సిందే అని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది మయూరి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ‘ఛేంజ్‌’(change.org)వెబ్‌సైట్‌ ద్వారా అస్సాం మహిళల తరపున పిటిషన్‌ దాఖలు చేసింది. దీనికి ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది మయూరి భట్టాచార్జీకి సపోర్టర్స్‌గా చేరారు.

మయూరి భట్టాచార్జీ
ప్యాడ్స్‌ లేకపోవడం సమస్య కాదా..!
అస్సాంలోని తేజ్‌పూర్‌కు చెందిన భట్టాచార్జీ విపత్తు సమయంలో ఆదుకునేవారికి జాబితాలో శానిటరీ ప్యాడ్‌లను చేర్చాలని విదేశాంగ మంత్రి హేమంత్‌ బిస్వా శర్మను కోరారు. మహిళలకు సహాయ శిబిరాలలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం ఉండటం లేదు. దీని వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆగస్టు 21 న ప్రచురించిన రోజువారీ వరద నివేదిక ప్రకారం, అస్సాంలో వరదలు 30 జిల్లాల్లో 56.9 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేశాయి. 

ఒక్క వస్త్రమూ శుభ్రంగా ఉండదు..
కార్యకర్త మయూరి భట్టాచార్జీ రిలీఫ్‌ కిట్లలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని ఛేంజ్‌ ద్వారా పిటిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మయూరి మాట్లాడుతూ –‘ప్రతి యేటా అస్సాంలో వరదలతో బాధపడుతున్న లక్షలాది మంది బాలికలు, మహిళల తరపును నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇక్కడ వరద నీరు వచ్చినప్పుడు, ఇంట్లో ఒక్క వస్త్రం కూడా శుభ్రంగా, పొడిగా ఉండదు. ఈ మహిళలకు సహాయ శిబిరంలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం లేదు. అలాగే టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా ఉండదు. ఇలాంటప్పుడు ఎంత వ్యధ.. ఈ సమస్యను అర్ధం చేసుకోరేంటి. ఈ వరదలతో మహిళలు అన్ని సమస్యలతో పాటు, శానిటరీ ప్యాడ్లు లేకపోవడం అనే ప్రధాన సమస్యనూ ఎదుర్కొంటున్నారు. ఇది ఎందుకు సమస్యగా ప్రభుత్వాలకు పట్టడం లేదు.

వరదల కారణంగా కాలాలు ఆగవు. శానిటరీ ప్యాడ్లను రిలీఫ్‌ మెటీరియల్‌ జాబితాలో చేర్చడానికి మనం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?!’ అని ప్రశ్నిస్తోంది మయూరి భట్టాచార్జీ. ఈ విషయమ్మీద నిరంతరం రాష్ట్ర మంత్రికి ఇ–మెయిల్‌ చేస్తూనే ఉంది. కానీ స్పందన రావడంలేదు. దీంతో మయూరి ఈ పిటిషన్‌ను ప్రారంభించింది. త్వరలోనే దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. విపత్తుల సమయాల్లో మహిళల నెలసరి సమస్యనూ పరిగణనలోకి తీసుకోవాలి అని మయూరి భట్టాచార్జీ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేస్తుంది.

మరిన్ని వార్తలు