ఊపిరి అందట్లేదు..!

8 Sep, 2020 08:47 IST|Sakshi

సుశాంత్‌ పెట్టి వెళ్లిన అగ్నిపరీక్ష.. రియాకా.. మీడియాకా..?!

విచారణ సంస్థలు ‘చెప్పిస్తాయి’!... మీడియా చెప్పుకోనిస్తుంది..! అవునా కాదా అన్నది.. చెప్పించడం..! అసలేమైందన్నది.. చెప్పుకోనివ్వడం. మీడియా ఎప్పుడూ ఉన్నట్లే.. రియా విషయంలోనూ ఉంది. అయితే ఎప్పుడూ లేనంతగా..  విమర్శలను ఎదుర్కొంటోంది!  సుశాంత్‌ పెట్టి వెళ్లిన అగ్నిపరీక్ష.. రియాకా.. మీడియాకా..?!
ఊపిరి అందనిది ఎవరికి?

 జూలై 1 రియా చక్రవర్తి పుట్టిన రోజు. స్నేహితుడు సుశాంత్‌ సింగ్‌ ఉండి ఉంటే బహుశా ఆమె అతడితో తన ‘రెండో’ పుట్టిన రోజును జరుపుకుని ఉండేవారు. ఏడాది క్రితమే ఏప్రిల్‌లో సుశాంత్‌కి ఆమె పరిచయం. లేదా ఆమెకు సుశాంత్‌ పరిచయం. డిసెంబర్‌ నాటికి ఈ రెండు పక్షులు ఒక గూటికి చేరాయి. ఆ గూడు ముంబైలోని బాంద్రాలో సుశాంత్‌ ఉంటున్నది. అందులోనే మగపక్షి జూన్‌ 14 న సీలింగ్‌ ఫ్యాన్‌కి నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. అప్పటికి ఆరు రోజులుగా ఆ గూడులో జంటపక్షి కనిపించడం లేదు. రియాపై తొలి సందేహం!  (చదవండి: సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొన్నా..)

తొలి సందేహం మొదట ప్రియమైన వారి మీదనే వస్తుంది. రియాతోపాటు ఈ కేసులో డబ్బు, డ్రగ్స్, వాట్సాప్‌ కీలకంగా ఉన్నాయి. వాట్సాప్‌ చాట్‌లను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) పరిశీలిస్తోంది. డబ్బు ‘ఫ్లో’ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పరిశోధిస్తోంది. డ్రగ్స్‌ వేర్లను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) తవ్వితీస్తోంది. ప్రతి దాంట్లోనూ రియా కామన్‌. సీబీఐ, ఈడీ, ఎన్‌.సి.బి. ఆమెను ఇంటరాగేట్‌ చేస్తున్నాయి. అయితే ఈ మూడింటిని మించి ఆమెపై విచారణ జరుపుతున్న అనధికార శక్తి ఒకటి ఉంది. మీడియా! చూసే ఉంటారు.. ఆది, సోమవారాల్లో విచారణకు హాజరయ్యేందుకు ఎన్‌.సి.బి. కార్యాలయానికి వెళ్తున్న, వెళ్లి వస్తున్న రియాను మూకుమ్మడిగా అడ్డగించి.. ‘రియా, రియా.. రియా..’ అంటూ మీద పడుతూ మీడియా ప్రతినిధులు తనని ఎంత అసౌకర్యానికి గురి చేశారో! 

అది వారి డ్యూటీలో భాగమే అవచ్చు. రాబట్టి, బయటపెట్టడం. అయితే అది డ్యూటీ చేస్తున్నట్లుగా లేదు. లాఠీ ఛార్జి చేస్తున్నట్లుగా ఉంది. రియాను ఎవరూ సమర్థించడం లేదు. అంతమాత్రాన మీడియా ఆమెను ఎలా ప్రశ్నించినా అంగీకారం అవుతుందా?!  ‘‘సీబీఐ గానీ, ఈడీ గానీ, ఎన్‌.సి.బి. గానీ రియాను వెంటాడటం లేదు, వేటాడటం లేదు. మీడియా ఒక్కటే ఆ పని చేస్తోంది. విచ్‌–హంట్‌ చేస్తోంది. అరెస్టుకు రియా సిద్ధంగానే ఉన్నారు. ప్రేమించినందుకు ఫలితం ఇదే కనుకైతే ఆ ఫలితాన్ని అనుభవించకుండా పారిపోవాలని ఆమె అనుకోవడం లేదు. ముందస్తు బెయిలు ఇవ్వమని ఒక్క కోర్టును కూడా రియా ఇప్పటివరకు అభ్యర్థించలేదు’’ అని రియా లాయర్‌ మీడియా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

‘‘విచారణ సంస్థలకు ఏమీ మిగలకుండా తనే మొత్తం విచారణ జరిపి రియాను దోషిగా తేల్చేసింది మీడియా..’’ అని సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షీ బీబీసీతో అనడం కూడా మీడియా వహించవలసిన పాత్రను గుర్తు చేయడమే. ‘‘కంగ్రాచ్యులేషన్స్‌ ఇండియా. నా కొడుకును అరెస్ట్‌ చేశావు. నా కూతుర్నీ అరెస్టు చేస్తావు. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని చక్కగా కూలగొట్టేశావ్‌. ఏమైనా.. న్యాయం కోసం ఏదైనా జరగాల్సిందే. జై హింద్‌’’ అని రియ తండ్రి ఆవేదన చెందారు. రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఆయన. ఇండియా అంటే మీడియానే! మీడియా ఏం చూపిస్తోందో అదే కదా మనం చూసే ఇండియా. విస్తరిస్తున్న కరోనా, ‘హద్దు’ మీరుతున్న చైనా, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. ఈ ఐదు నెలలుగా మన ఇండియా. ఇప్పుడు రియా కూడా! 

అభిమాన నటుల అర్ధంతర మరణం హృదయాన్ని కలచి వేస్తుంది. అర్ధంతర అనుమానాస్పద మరణమైతే సందేహ జ్వాలల్ని రేపుతుంది. ఆ జ్వాలలు ఇప్పుడు రియాను చుట్టుముట్టాయి. వాటిల్లో ఆమె కెరీర్‌ దగ్ధం అయిపోవడమో, సుశాంత్‌ పెట్టి వెళ్లిపోయిన అగ్నిపరీక్ష పాస్‌ అయి బయటికి రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఈలోపే మీడియా.. ఇన్విజిలేటర్‌గా, స్క్వాడ్‌గా, ఎవాల్యుయేటర్‌గా అన్నీ తానే అవడంతో పాటు, క్వొశ్చన్‌ పేపర్‌ను కూడా తనే సెట్‌ చేసి ఇస్తోందన్న ఒక విమర్శ అయితే ఉంది. 

తూనీగ తూనీగ 
టీవీ షోల నుంచి సినిమాల్లోకి వచ్చారు రియా. ఆమె తొలి చిత్రం తెలుగులో వచ్చిన ‘తూనీగ తూనీగ’ (2012). తర్వాత బాలీవుడ్‌లో ఆరు చిత్రాల్లో నటించారు. ‘జలేబీ’ (2018) లో చక్కటి నటనను ప్రదర్శించారు. ‘చెహ్రే’ అని ఇంకో సినిమా విడుదల కావలసి ఉంది.

మరిన్ని వార్తలు