చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే

4 Oct, 2020 08:09 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీనా కుమారికి వారాంతాల్లో సపర్యలు చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాడు దర్శకుడు కమల్‌ అమ్రోహీ. అటు ‘అనార్కలి’ సినిమా అటకెక్కింది (తర్వాత ఆ ప్రాజెక్ట్‌ చేతులు మారి నాసిర్‌ హుస్సేన్‌ కథతో నంద్‌లాల్‌ దర్శకత్వంలో బీనా రాయ్, ప్రదీప్‌ కుమార్‌ ముఖ్య భూమికలుగా 1953లో విడుదలైంది ‘అనార్కలి’పేరుతోనే). ఇటు మీనా, కమల్‌ల స్నేహం ప్రేమై.. నిఖా చేసుకుంది రహస్యంగా. ఎందుకంటే కమల్‌ అప్పటికే వివాహితుడు, పిల్లలు కూడా. మీనా కుమారి కన్నా పదహారేళ్లు పెద్దవాడు.

ఆ నిఖా ఆమెకేనాడూ సంతోషాన్నివ్వలేదు. మీనాను భార్యగా కుబూల్‌ చేసిన మరుక్షణం నుంచే ఆమె చుట్టూ ఓ చట్రాన్ని బిగించాడు కమల్‌. అనుక్షణం అభద్రతలో రగిలిపోసాగాడు. ఏది ఏమైనా సాయంకాలం ఆరున్నరకల్లా ఇంటికి చేరుకోవాలి మీనా. అతను పంపిన కారులోనే ఆమె షూటింగ్‌కు వెళ్లాలి, రావాలి. సెట్స్‌లో ఆమె వెన్నంటే ఉండడానికి ఒక వ్యక్తినీ నియమించాడు కమల్‌. ఈ పొసెసివ్‌నెస్‌ మీనాను ఊపిరి సలపనివ్వకుండా చేసింది. ఆ పెళ్లి ఎనిమిదేళ్లు సాగినా కలహాల కాపురమే అయింది. మీనా హీరోయిన్‌గా తన కలల ప్రాజెక్ట్‌ ‘పాకీజా’ సినిమా తీయాలనుకున్నాడు కమల్‌. 

‘విడాకులు ఇస్తేనే చేస్తాను’ అంటూ కమల్‌ కళ్లల్లోకి సూటిగా చూసింది మీనా. ‘మానసికంగా మనమేమీ ఒకరికొకరం ముడిపడిలేమిప్పుడు. అయినా నీ ఆత్మసంతృప్తి కోసం ఇస్తాను’ చెప్పాడు కమల్‌ ఆమె చూపులనుంచి తప్పించుకోకుండానే. ఆ బంధం నుంచి ఆమెను తప్పించాడు విడాకులు ఇచ్చేసి. అలా పెళ్లి విఫలమవడంతో మందుకు దగ్గరైంది మీనా. ఆ కలతకాలంలోనే ఆమె చెంత చేరాడు ధర్మేంద్ర. కష్టాన్ని మరిపించాడు.. ఆమెను మురిపించాడు.. అంతలోనే ఆమెను వీడాడు. 

మునుపటి అందం...
ధర్మేంద్ర తనను వదిలిపోయాక, మద్యానికి బానిసైన మీనా కుమారి లివర్‌ సిర్రోసిస్‌ బారినపడింది. విదేశాల్లో చికిత్సపొంది తిరిగి ముంబైకి వచ్చాకే ఆమెకు కమల్‌ చేరవయ్యాడు మళ్లీ. ‘నువ్వు లేక నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌  కెమెరాకు ఎక్కకుండానే మిగిలిపోయింది’ అంటూ పాకీజా ఊసెత్తాడు మీనా కుమారి దగ్గర. ‘నన్ను మునుపటి అందంతో చూపిస్తాను అంటే నీ పాకీజా నేనవుతాను’ చెప్పింది మీనా కుమారి తన చేతులు, చేతివేళ్లు చూసుకుంటూ. ఎదురుగా ఉన్న మీనా కుమారిని మసగ్గా చూపించాయి కమల్‌ కళ్లల్లో ఊరిన నీళ్లు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ఆప్యాయంగా నొక్కాడు.‘పాకీజా’ సినిమాకు సన్నహాలు మొదలయ్యాయి మీనా కుమారి హీరోయిన్‌గా. హీరోగా ధర్మేంద్రతో అంతకుముందే సైన్‌ చేయించుకున్నాడు కమల్‌.

కాని.. మీనా కుమారితో ధర్మేంద్రకున్న స్నేహం చిలువలు, పలువలుగా కమల్‌ను చేరి అతని మనసును కలవరపెట్టాయి. అతనిలోని పొసెసివ్‌ నేచర్‌ మళ్లీ పడగ విప్పింది. ధర్మేంద్రను ఆ సినిమా నుంచి తొలగించింది. ఆ పాత్రకు రాజ్‌కుమార్‌ను ఎంచుకున్నాడు. ‘పాకీజా’ మొదలైంది. అయితే అప్పటికి కమల్‌కు తెలియని నిజం ఏంటంటే రాజ్‌కుమార్‌ కూడా మీనా కుమారీకి దీవానానే అని. విలక్షణమైన తన ఉచ్చారణ శైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌.. సెట్స్‌లో మీనా కుమారిని చూడగానే మైమరచిపోయేవాడట.. సీన్‌లోని డైలాగులు టార్గెట్‌ అయ్యేవట. ఈ క్రమం ‘పాకీజా’కేమీ మినహాయింపు కాలేదు. డైరెక్టర్‌ కమల్‌ ‘ కెమెరా.. యాక్షన్‌’ అని చెప్పినా తాను చెప్పాల్సిన సంభాషణలను మరచిపోయి మీనా కుమారీనే చూస్తుండి పోయిన సందర్భాలెన్నో.

రాజ్‌కుమార్‌ తీరుతో చిర్రెత్తి పోయిన  కమల్‌.. హీరోహీరోయిన్లు  కలిసి నటించే  సీన్లను సాధ్యమైనంత తక్కువ షూట్‌ చేశాడట. ‘పాకీజా’లోని ‘చలో దిల్‌దార్‌ చలో చాంద్‌ కే పార్‌ చలో’ పాటను ప్రణయ గీతంగా  నాయికా నాయకుల మధ్య సాన్నిహిత్యంతో చిత్రీకరించాలని అనుకున్నాడట. కాని ఎప్పుడైతే రాజ్‌కుమార్‌ కూడా మీనా కుమారి అంటే పడిచచ్చిపోతున్నాడని కమల్‌ అమ్రోహీ గ్రహించాడో అప్పడు ఆ పాట చిత్రీకరణే మారిపోయింది. కళ్లతోనే ప్రేమను అభినయించమని, ముఖ కవళికలతోనే సాన్నిహిత్యాన్ని ప్రదర్శించమని మీనా కుమారిని ఆదేశించాడు కమల్‌. అంతేకాదు చుట్టూ ఉన్న చెట్లు, లతలు, పూలు, చందమామాను ఎక్కువగా ఫోకస్‌ చేసి రొమాంటిక్‌ సాంగ్‌ను పూర్తి చేశాడు.

అలా ఆ సినిమా షెడ్యూల్స్‌ అన్నీ అసహనం, కోపం, నిస్సహాయత, చిరాకునే మిగిల్చాయి దర్శకుడికి. పాకీజా విడుదలైన కొన్ని వారాలకే మీనా కుమారి అల్విదా చెప్పింది ఈ ప్రపంచానికి. కాని కమల్‌ పొసెసివ్‌నెస్‌ మాత్రం కొనసాగింది. ఫలితంగా తర్వాతటి తన సినిమాల్లో ఏ ఒక్కదాంట్లోనూ రాజ్‌కుమార్‌కు వేషం ఇవ్వలేదు అతను. 

  • సినిమాల్లో రొమాంటిక్‌ సన్నివేశాలు,  ప్రణయగీతాల పట్ల అంత ఆసక్తి కనబర్చేవాడు కాదట రాజ్‌కుమార్‌. కాని మీనా కుమారికి జంటగా చేసే సినిమాల్లో ఇష్టంగా నటించేవాడట. 
  • మీనా కుమారితో సినిమాలు చేసిన దర్శక, హీరోల్లో చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే. ఆమె అందానికి ఫిదా అయిన వారే. ఆ వరుసలోనే భరత్‌ భూషణ్‌ కూడా ఉంటాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం ‘బైజూ బావ్‌రా’. సూపర్, డూపర్‌ హిట్‌. ఆ సినిమా షూటింగ్‌లోనే భరత్‌ భూషణ్‌ మీనా కుమారితో ప్రేమలో పడ్డాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అభ్యర్థించాడు. సున్నితంగా తిరస్కరించింది మీనా కుమారి.  

-ఎస్సార్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా