Meenmutty Waterfalls: మీన్‌ ముట్టి.. పశ్చిమకోన పాలధార

15 May, 2021 16:26 IST|Sakshi

మీన్‌ముట్టి... జలపాతం...
వయనాడు తలమీద జల కిరీటం.
వెయ్యి అడుగుల ఎత్తు నుంచి దూకే
ప్రవాహవేగం తెల్లగా ...
పాలధారను తలపిస్తుంది.
నీటిచుక్కల సవ్వడి...
ఝంఝామారుతాన్ని గుర్తు చేస్తుంది.

కేరళ రాష్ట్రం అనగానే మనకు ఇండియా మ్యాప్‌లో దక్షిణాన అరేబియా సముద్రతీరానికి ఆనుకుని ఉన్న సన్నటి స్ట్రిప్‌ గుర్తుకు వస్తుంది. కేరళలో నివాస ప్రాంతాలన్నీ అరేబియా తీరానే ఉన్నాయేమో అని కూడా అనుకుంటాం. కానీ సాగరతీరాన్ని తాకకుండా కొన్ని జిల్లాలున్నాయి. వాటిలో ఒకటి వయనాడు. ఇది ఓ దశాబ్దం కిందట పర్యాటక ప్రదేశంగా బయటి ప్రపంచానికి పరిచయమైంది. రాహుల్‌గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో వయనాడు దేశమంతటికీ సుపరిచయమైంది. 

పశ్చిమ సుగంధం
వయనాడు సుగంధ ద్రవ్యాలు పుట్టిన నేల. పశ్చిమ కనుమల మీద విస్తరించిన హిల్‌స్టేషన్, ఏడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది. టూరిజం ఆధారంగా అభివృద్ధి చెందిన హోటళ్లు పెద్ద పెద్ద హోర్డింగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంటాయి. కొండ పైకి వెళ్లే కొద్దీ లోయలో పెరిగిన కొబ్బరి చెట్ల తలలు రోడ్డుకు సమాంతరంగా కనిపిస్తుంటాయి. కొబ్బరి, పోక, కాఫీ, టీ, ఏలకులు, మిరియాలు, లవంగాల చెట్లు, అక్కడక్కడా మామిడి, పేర్లు తెలియని లెక్కలేనన్ని జాతులు... అన్ని ఆకులూ పచ్చగానే ఉన్నా, దేని పచ్చదనం దానిదే. ఈస్టర్న్‌ ఘాట్స్‌ కంటే వెస్టర్న్‌ ఘాట్స్‌ అందంగా ఉంటాయి. వయనాడుకు వెళ్లే దారిలో కొండల్లో ప్రమాదకరమైన మలుపులున్నాయి. వాటిని హెయిర్‌పిన్‌ బెండ్‌లు అంటారు. 

మీన్‌ముట్టికి వెళ్లే దారిలో...
వయనాడు కొండ మీదకు చేరేలోపు ఒక చోట పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టుకు రెండు పెద్ద ఇనుప గొలుసులు ఉంటాయి. బ్రిటిష్‌ పాలన కాలంలో ఒక విదేశీయుడు గిరిజనులు నివాసం ఉండే ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి బయలుదేరాడు. దట్టమైన కొండల్లో దారి తప్పి పోకుండా ఉండడానికి స్థానిక గిరిజనుడిని సహాయంగా తీసుకెళ్లాడని, ఆ గిరిజనుడి మార్గదర్శనంతో దారి తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి తను మాత్రమే తెలియాలనే దురుద్దేశంతో ఆ విదేశీయుడు, తనకు సహాయం చేసిన గిరిజనుడిని ఈ చెట్టుకు గొలుసులతో కట్టేశాడని చెబుతారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం తర్వాత పూకాట్‌ లేక్‌కు చేరుకుంటాం. కొండల మీద ఉన్న పెద్ద మంచి నీటి సరస్సు ఇది. ఇందులో బోట్‌ షికారు చేయవచ్చు.

మీన్‌ముట్టి జలపాతానికి చేరాలంటే ట్రెక్కింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూకాట్‌ సరస్సులో బోటింగ్‌కి ఎక్కువ టైమ్‌ తీసుకోకపోవడమే మంచిది. పూకాట్‌ నుంచి ముందుకు సాగే కొద్దీ జనం ఆనవాళ్లు తగ్గుతుంటాయి. జలపాతం రెండు కిలోమీటర్లు ఉందనగా రోడ్డు ఆగిపోతుంది. అక్కడి నుంచి కొంత దూరం రాళ్ల బాటలో నడక. తర్వాత కొండవాలులో నడక. ఫారెస్ట్‌ సెక్యూరిటీ పాయింట్‌ దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. వాళ్ల రిజిస్టర్‌లో మన పేరు, ఊరు, ఫోన్‌ నంబరు రాయాలి. బృందంలో ఎంతమంది ఉంటే అన్ని కర్రలతో ఒక గార్డును సహాయంగా వస్తాడు. ఆ చెక్‌ పాయింట్‌ నుంచి ముందుకు వెళ్లిన వాళ్లు తిరిగి ఆ పాయింట్‌కు చేరే వరకు బాధ్యత వాళ్లదే.

అదో జానపద చిత్రమ్‌
కొండవాలులో దట్టమైన అడవిలో ట్రెకింగ్‌. చెట్లకు పెద్ద పెద్ద తాళ్లు కట్టి ఉంటాయి. గార్డు పర్యాటకుల చేతికి కర్రలిచ్చి, ముందుగా తాను నడుస్తూ, ఎక్కడ రోప్‌ను పట్టుకోవాలో హెచ్చరిస్తూ తీసుకెళ్తాడు. ఎక్కువ లగేజ్‌ లేకపోతే ట్రెకింగ్‌ సులువుగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎదురుగా కనిపించే కొండ తమిళనాడుది, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్‌ కొండలు కూడా కనిపిస్తాయి. నడుస్తూ ఉంటే చెట్ల సందుల్లో జలపాతం కనిపిస్తూనే ఉంటుంది. సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. పొరపాటున కాలు జారితే... లోయలో ఎక్కడకు చేరుతామో కూడా ఊహించలేం. ‘ఇంతదూరం వచ్చిన తర్వాత భయపడి వెనక్కి పోవడమేంటి’ అని మనసులో సాహసాన్ని ఒడిసిపట్టుకుని ముందుకు నడిస్తే అద్భుతానికే అద్భుతం ఆవిష్కారమవుతుంది. అదే మీన్‌ముట్టి జలపాతం. పచ్చటి చెట్ల మధ్య తెల్లటి నీటిధారలు. ఆ జల్లులో తడిస్తే తప్ప టూర్‌ పరిపూర్ణం అనిపించుకోదు. మీన్‌ ముట్టి అంటే... చేపలకు అడ్డుకట్ట అని అర్థం.
– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు