ఫుడ్‌ హీరోలు!: పంటల పుట్ట రామకృష్ణ పొలం!

13 Oct, 2020 08:50 IST|Sakshi
తన పొలంలో పండించిన కూరగాయలను చూపుతున్న మీసాల రామకృష్ణ

13 ఎకరాల సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పంటలెన్నో!

అనేక రకాల బియ్యం, రకరకాల కూరగాయలు, పండ్లు.. చేపలు కూడా! 

ప్రజలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులన్నిటినీ ఏడాది పొడవునా అందిస్తున్న ‘ఫుడ్‌ హీరో’ మీసాల రామకృష్ణ 

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ఆశతో రైతులు తమ పని తాను చేస్తూనే ఉంటారు. విత్తనాలకు చెమటను చేర్చి ఆహారోత్పత్తుల్ని పండిస్తారు. తన చుట్టూ ఉన్న జనులకు అందించి తమకు దక్కిన దానితో సంతృప్తి చెందుతారు. వరదొచ్చినా, కరువొచ్చినా, చివరకు కరోనా వచ్చిపడినా.. తమ పని తాము చేసుకుపోతున్నారు.. రసాయనాల్లేకుండా అమృతాహారాన్ని పండిస్తున్నారు.. అందుకే వీరు నిజమైన అన్నదాతలు.. రియల్‌ హీరోలు.. అచ్చమైన ఫుడ్‌ హీరోలు! ఈనెల 16న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వీరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవటం మన బాధ్యత!

‘‘హలో.. నేను దుగ్గిరాల నుంచి శ్రీనివాసరావునండీ.. రేపు మా ఇంట్లో శుభకార్యముంది.. 50 కిలోలు బీపీటీ ఒంటి పట్టు బియ్యం, ఇంట్లో వాడకానికి 25 కిలోల షుగర్‌ ఫ్రీ బియ్యం, అరకిలో పసుప్పొడి, కర్పూర అరటి రెండు గెలలు, కూర అరటి గెల, పది కిలోలు చొప్పున బెండ, కాకరకాయ, వంకాయ, బీరకాయలు, పాలకూర, తోటకూర, గోంగూర అయిదేసి పెద్ద కట్టలు.. రెండు కిలోల చేపలు కూడా పంపండి’’
ఓ గృహస్తు ఫోనులో చెప్పిన ఈ ఆర్డరు ఏ సూపర్‌ మార్కెట్‌కో, దుకాణదారునికో అనుకుంటే పొరపాటు! ఒక రైతుకు!!
అవును.. మీరు విన్నది నిజమే. 
ఆ విలక్షణ రైతు పేరు మీసాల రామకృష్ణ.

ప్రతి కుటుంబానికీ రోజువారీ అవసరమయ్యే అన్ని రకాల ఆహారోత్పత్తులను నిత్యం అందించే సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అది. ఇంటికి అవసరమైన అన్ని రకాల ఆహార పంటలనూ తన వ్యవసాయ క్షేత్రంలో పండించడంతోపాటు ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంచటం ఆయన ప్రత్యేకత. తన పంట పొలం గట్టునే ఆహారోత్పత్తుల మార్కెట్‌గా మార్చి అనుదినం ఆదాయం పొందుతున్న రామకృష్ణ నిజమైన హీరో! ‘ఫుడ్‌ హీరో’!!

గుంటూరు జిల్లా నందివెలుగులో పంటకాలువ వెంట 13 ఎకరాల మెట్ట / మాగాణి భూమే రామకృష్ణ కార్యక్షేత్రం. చెంచాడు రసాయనం వాడకుండా ఆయన నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న పంటల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. అరెకరంలో చేపల చెరువు, 35 పైగా రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల పంటలు. ఆరు ఎకరాల మాగాణిలో సిద్ధసన్నం, చిట్టిముత్యాలు, రెడ్‌ రైస్‌ (నవారా), రత్నచోడి, బీపీటీ–5204, అరెకరంలో పసుపు (ప్రగతి, సేలం, బ్లాక్‌ పసుపు) పండిస్తున్నారు. అంతర పంటలుగా బొప్పాయి, మామిడి అల్లం వేశారు. 

ఎకరంన్నరలో అరటి (కర్పూర, చక్కెరకేళి, కూర అరటి), అయిదెకరాల్లో బీర, బెండ, దొండ, పొట్లకాయ, కాకరకాయ, కీర దోస, దోస, రెండు రకాల మిర్చి, సొరకాయ, బీట్‌రూట్, గోరుచిక్కుడు, అర ఎకరంలో తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర సాగు చేస్తున్నారు. చేనంతా కొబ్బరి, మామిడి, జామ, నిమ్మ, నారింజ, మునగ, కరివేపాకు, తిప్పతీగ, సీతాఫలం, పనస ఉన్నాయి. చేపల చెరువు నీరు మాగాణికి వెళ్తుంది. బియ్యం మర ఆడించగా వచ్చిన తవుడు, నూకలు చేపలకు మేతగా వేస్తారు. దగ్గర్లోని మరో అయిదెకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌–15048 (గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే సన్న బియ్యం) పండిస్తున్నారు.

ఐదు ఆవులు పెంచుతున్నారు. పాలేకర్‌ పద్ధతిలో కషాయాలు, చౌహాన్‌ క్యూ విధానంలో పిష్‌ ఎమినో యాసిడ్‌ వాడుతున్నామని రామకృష్ణ చెప్పారు. ‘డ్రిప్‌ ఇరిగేషనులో పంటలకు జీవామృతం, పంచగవ్య, పీఎస్‌బీ, సూడోమోనాస్, హ్యూమిక్‌ యాసిడ్, ఫిష్‌ అమినో యాసిడ్‌ పిచికారీ చేస్తున్నాను.. కూరగాయ పంటలకు పది రోజులకోసారి జీవామృతం, బాక్టీరియా, పెరుగుదలకు ఫిష్‌ అమినో యాసిడ్‌ ఇస్తున్నా.. ‘కలుపు మందు వాడను... కూలీలలో పీకించటమో చెక్కించడమో చేస్తున్నా.. నేల తల్లిపై ఏమాత్రం రసాయనాలు పడరాదనే’ అంటారు రామకృష్ణ వినమ్రంగా! 

బియ్యం మర ఆడించి, పసుపు పొడి చేయించి, పండ్లు, కూర గాయలు, ఆకు కూరలతో సహా చాలా వరకు పొలం గట్టు మీదనే విక్రయిస్తున్నారు. మిగిలినవి నగరాల్లోని ఆర్గానిక్‌ దుకాణాలకు పంపుతున్నానని చెప్పారు. కూరగాయలు, ఆకుకూరలు, అరటి పంటలను నిర్ణీత వ్యవధిలో విత్తుకోవటం ద్వారా అవి ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. రోజూ ఆదాయం పొందటం ఈ ఆదర్శ రైతు మరో ప్రత్యేకత! నెలకు రూ.40–50 వేల ఆదాయం సమకూరుతోందని రామకృష్ణ వివరించారు. రైతంటే ఒకటో రెండో పంటలు పండించటం కాదు.. అదే క్షేత్రంలో అవకాశం ఉన్నన్ని ఎక్కువ ఆహార పంటలను రసాయనాల్లేకుండా పండించి ప్రజలకు అందించాలన్న చైతన్యం రామకృష్ణ (9989646499) మాటల్లో, చేతల్లో కనిపిస్తుంటుంది.   
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి 

మరిన్ని వార్తలు