ఆమ్‌స్టర్‌డామ్‌లో పరిచయం.. ఉదయ్‌పూర్‌లో ప్రేమ

25 Sep, 2020 12:18 IST|Sakshi

జైపూర్‌:  హిందూ వివాహ సంప్రదాయంలో కొన్ని తంతులు చాలా విచిత్రంగా ఉంటాయి. మాంగళ్యధారణ కాగానే అమ్మాయి భర్త కాళ్లకు దండం పెడుతుంది.. పెళ్లైన వెంటనే తన ఇంటి పేరును మార్చుకుంటుంది. మరి రివర్స్‌లో జరగదు ఎందుకు. పెళ్లి కుమారుడు అంటే శ్రీ మహా విష్ణువు అంటారు.. మరి భార్య అంటే లక్ష్మీ దేవినే కదా. కాళ్లు కడిగితే తప్పేంటి.. పాదాలకు ఎందుకు నమస్కరించకూడదు. ఆడపిల్లకు తొలుత పుట్టింటి నుంచే ఓ గుర్తింపు వస్తుంది.. మరి అలాంటప్పుడు దాన్ని మార్చుకోవడం ఎందుకు. ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడిగేతే మనకు వేరే పేర్లు పెట్టేస్తారు. మన పితృస్వామ్య సమాజంలో ఇలాంటివి మహా పాపం. వదిలేద్దాం. కానీ కొందరు మాత్రం ఈ అభిప్రాయాలతో ఏకీభవించడమే కాక ఆచరిస్తారు. అలాంటి వ్యక్తికి సంబంధించినదే ఈ కథనం. భారతీయ యువతిని ప్రేమించి.. మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని.. ఏళ్లుగా ఆడ పిల్లలు మాత్రమే పాటిస్తున్న సంప్రదాయాలను తాను పాటించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ప్రత్యేక కథనాన్ని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ప్రచురించింది. (చదవండి: ప్యాంట్ ‌సూట్‌లో షాకిచ్చిన వధువు!)

వివరాలు.. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల నిమిత్తం ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్‌ బుల్లర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు విద్యార్థి నాయకుడు. మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇద్దరి మనసులో మాత్రం ఒకరికోసం ఒకరం అనే భావన కలిగింది. అయితే వారి పరిచయం ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఒలేగ్‌కి అది లాస్ట్‌ అకడామిక్‌ ఇయర్‌. దీపా యూనివర్సిటీలో చేరిన 6 నెలలకే అతడు క్యాంపస్‌ నుంచి వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా కేవలం పుట్టిన రోజు నాడు మాత్రమే మెసేజ్‌లు చేసుకునే వారు. ఇలా ఓ పుట్టిన రోజు నాడు ఆమ్‌స్టర్‌డామ్‌లో డిన్నర్‌కి మీట్‌ అవుదామని అడిగాడు ఒలేగ్‌. అప్పుడు దీప లండన్‌లో ఉంది. దాంతో ఆరు నెలల తర్వాత డిన్నర్‌కి కలిశారు. ఆ తర్వాత స్కైప్‌లో మాట్లాడుకునే వారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దీపకు ఓగ్‌ నుంచి డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగింది. దీప ఒక్కతే వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు అనుకోని సర్‌ప్రైజ్‌ ఎదురయ్యింది. అక్కడ ఒలేగ్‌ ఉన్నాడు. (చదవండి: ఏడడుగులు వేసిన వేళ)

పైగా అతడి చేతిలో ఉంగరం. దీప రాగానే మోకాలి మీద నిలబడి పెళ్లి చేసుకోమని కోరాడు ఒలేగ్‌. ఆనందభాష్పాల మధ్య దీప ఎస్‌ చెప్పింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆమోదంతో వీరి వివాహం నిశ్చయమయ్యింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘మా వివాహం యూరోపియన్‌, భారతీయ సంస్కృతుల సంపూర్ణ కలయికగా నిలిచింది. ఇక వివాహ తంతులో నన్ను ఒలేగ్‌ పాదాలకు నమస్కరించమని చెప్పారు. అప్పుడు ఇద్దరం కేవలం ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి అని ప్రశ్నించాము. వెంటనే ఒలేగ్‌ నా పాదాలను తాకాడు. అంతేకాదు మేం ఒకరి ఇంటి పేరు ఒకరం మార్చుకున్నాం.  నేను దీప బుల్లర్‌ ఖోస్లా... తను ఒలేగ్‌ బుల్లర్‌ ఖోస్లా. చాలా గర్వంగా ఉంది’ అన్నారు దీప. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్‌ చాలా మందికి నచ్చింది. ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు