బొమ్మ బొమ్మను గీసింది.

25 Mar, 2021 00:17 IST|Sakshi

బొమ్మ బొమ్మను గీసింది. అవును మీరు చదివింది నిజమే. ఈ బొమ్మ అటుఇటూ కదలడమే గాకుండా మనం పలకరిస్తే చిలక పలుకులు పలుకుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం చెప్పుకునే మరబొమ్మ మరెవరో కాదు హ్యూమనాయిడ్‌ రోబో ‘సోఫియా’ అని. మీరడిగే ప్రశ్నలకు సమాధానాలే కాదండి మీరు గీసినట్టు నేను చిత్రాలు గీస్తున్నాను చూడండి అంటోంది సోఫియా. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యన్‌సన్‌ రోబోటిక్స్‌ సంస్థ తయారు చేసిన ఈ సోఫియా ఇప్పటికే ఒక కార్యకర్తగా, మ్యుజీషియన్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా పేరుగాంచింది.

తాజాగా డిజిటల్‌ ఆర్టిస్ట్‌గా మారింది. 31 ఏళ్ల ఇటాలియన్‌ డిజిటల్‌ ఆర్టిస్ట్‌ ఆండ్రియా బోనాసెటో దగ్గర రంగురంగుల చిత్రాలు గురించి ఇన్‌పుట్స్‌ తీసుకుని ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులైన టెస్లా చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఎలన్‌ మస్క్‌ వంటి వారి చిత్రాలను సోఫియా గీసింది. ఈ చిత్రాలను నాన్‌ ఫంజిబల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ) రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాన్నీ కొన్నవారికి ఎన్‌ఎఫ్‌టీ సర్టిఫికెట్‌  ఇస్తారు. ఎన్‌ఎఫ్‌టీ చిత్రం డిజిటల్‌ సంతకంలా బ్లాక్‌చెయిన్‌ లెడ్జర్స్‌లో భద్రపరచ బడుతుంది. వేలంలో సోఫియా చిత్రాన్నీ కొన్నవారికి హక్కులు అధికారికంగా ధ్రువీకరించబడతాయి. అయితే కృత్రిమమేధస్సుతో రూపొందించిన వస్తువును వేలం వేయడం ప్రపచంలో ఇదే తొలిసారి.  

సోఫియా చిత్రాన్ని ‘సోఫియా ఇన్‌స్టాంటియేషన్‌’ గా పిలుస్తున్నారు. దీనిలో బోనాసెటో గీసిన చిత్రాన్నీ సోఫియా డిజిటల్‌ చిత్రంగా ఎలా మర్చిందో చూపించే ఎమ్‌పీ4 ఫైల్‌ 12 సెకన్ల నిడివితో ఉంటుంది. దీనితోపాటు సోఫియా స్వయంగా తన చేతులతో పెయింటింగ్‌ వేసిన చిత్రం ప్రింట్‌ అవుట్‌ హార్డ్‌ కాపీ కూడా జతగా ఉంటుంది.  ‘‘మనుషులు నా డిజిటల్‌ ఆర్ట్‌ను ఇష్టపడతారని అనుకుంటున్నాను, మనుషులతో కలిసి  నేను ముందుకు సాగడానికి కొత్తరకం, ఉత్తేజకరమైన మార్గాల్లో సహకరిస్తారని ఆశిస్తున్నట్లు సోఫియా చెప్పింది. సిల్వర్‌ కలర్‌ సూటు ధరించి చేతిలో పెన్సిల్‌ పట్టుకొని ఉన్న సోఫియా మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్‌ నెట్‌వర్క్స్, జెనిటిక్‌ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి ఈ చిత్ర కళాఖండాలను రూపొందించాము.

అందువల్ల ఈ చిత్రాలు డిజిటల్‌ ఆర్ట్‌లో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక నమూనాలను సృజనాత్మకంగా సృష్టిస్తాయి’ అని సోఫియా చెప్పింది. ఈ మధ్యకాలంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే ప్లాట్‌ఫారమ్‌గా ఈ ఎన్‌ఎఫ్‌టీ టెక్నాలజీ వ్యవహరిస్తోంది. ఈ నెలలో నిర్వహించిన ఓ డిజిటల్‌ ఆర్ట్‌కు వేలం నిర్వహించ గా దాదాపు 70 మిలియన్‌ డాలర్లకు అమ్ముడయ్యింది. కాగా సోఫియా గీసిన డిజిటల్‌ చిత్రాన్నీ ఎవరు కొనుగోలు చేస్తారో వారిని కలిసి వారితో మాట్లాడి వారి ఫేస్‌ను రీడ్‌చేసి ఆ తరువాత సోఫియా తాను గీసిన చిత్రానికి తుది మెరుగులు దిద్దనుంది.l 

మరిన్ని వార్తలు