Mehrunnisa: నైట్‌ క్లబ్‌లలో ధైర్యంగా విధులు నిర్వర్తించి! 2500 మందికి ఉపాధి చూపి! ఆమె విజయం అసామాన్యం

22 Sep, 2022 09:59 IST|Sakshi
మెహరున్నీసా (PC: Instagram)

తొలి మహిళా బౌన్సర్‌... 2500 మందికి ఉపాధి చూపింది

బౌన్సర్లంటే మగవాళ్లే గుర్తుకు వస్తారు. కండలు తిరిగిన ఒంటితో హడావిడి చేస్తారు. కాని 20 ఏళ్ల క్రితమే మెహరున్నిసా తొలి మహిళా బౌన్సర్‌ అయ్యింది. నైట్‌ క్లబ్‌లలో ధైర్యంగా విధులు నిర్వర్తించింది. ఆకతాయిల భరతం పట్టి స్త్రీలకు రక్షణ ఇచ్చింది. గత సంవత్సరం సొంత సెక్యూరిటీ సంస్థ స్థాపించి 2500 మంది యువతీ యువకులకు ఈ రంగంలో ఉపాధి చూపింది. ఆమె విజయం అసామాన్యం.

గతంలో ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌’, ‘పేజ్‌ 3’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ తాజాగా ‘బబ్లీ బౌన్సర్‌’ అనే సినిమాను తీశాడు.  తమన్నా ముఖ్యపాత్ర. వచ్చే వారమే విడుదల. ఒక లేడీ బౌన్సర్‌ కథను సినిమాగా తీయడం వెనుక అతణ్ణి ఇన్‌స్పయిర్‌ చేసిన విషయం ఏమిటన్నది చెప్పలేదు కానీ కచ్చితంగా మెహరున్నీసా జీవిత కథ మాత్రం ఇందుకు ఒక కారణం అని చెప్పవచ్చు.

ఎందుకంటే మెహరున్నీసా మన దేశంలో తొలి మహిళా బౌన్సర్‌. 2003లోనే ఆమె బౌన్సర్‌గా మారి సంచలనం సృష్టించింది. గత 20 ఏళ్లుగా అదే రంగంలో పని చేస్తూ తాజాగా సౌత్‌ ఢిల్లీలో ‘మర్దాని బౌన్సర్‌ అండ్‌ డాల్ఫిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌’ అనే సంస్థ స్థాపించి యువతీ యువకులకు సెక్యూరిటీ పర్సనల్‌గా, బౌన్సర్లుగా ఉపాధి కల్పిస్తోంది. ఒక చిన్న ఊరి నుంచి బయలుదేరిన మెహరున్నీసా ఇంత దూరం ప్రయాణించడం సామాన్యమైన విషయం కాదు.


మెహరున్నీసా (PC: Instagram)

నేను సెక్యూరిటీ గార్డ్‌ను కాను
‘మాది ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌. ఢిల్లీలో ఒకసారి ఇండియన్‌ ఐడెల్‌ ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ చాలామంది బౌన్సర్లను చూశాను. అందరూ మగవాళ్లే. నాక్కూడా బౌన్సర్‌ కావాలనిపించింది. మేము నలుగురం అక్కచెల్లెళ్లం.

మా నాన్నకు మమ్మల్ని చదివించాలంటే భయం. ఎందుకంటే చదువుకున్న ఆడపిల్లలు వాళ్ల ఇష్టానికి పెళ్లి చేసుకుని పోతారని అనుకునేవాడు. కాని మా అమ్మ చదివించింది. అయినా సరే నా 12వ ఏట పెళ్లి చేద్దామని మా నాన్న అనుకుంటే టైఫాయిడ్‌ వచ్చి మూలన పడ్డాను. అలా ఆ పెళ్లి తప్పింది. ఆ సమయంలో గట్టిగా అనుకున్నాను– శరీరాన్ని దృఢంగా చేసుకోవాలని.

వెంటనే కరాటేలో చేరాను. జిమ్‌ మొదలెట్టాను. పోలీస్‌లో చేరదామనుకున్నా, కాని వీలు కాలేదు. ఇంటర్‌ అయ్యాక ఉద్యోగ ఆలోచనలు చేస్తుంటే ఢిల్లీలో బౌన్సర్‌ ఉద్యోగం ఉందని తెలిసింది. అప్పటి వరకూ ఆడపిల్లలు బౌన్సర్‌గా చేయడం లేదు. ధైర్యం చేసి చేరాను. కాని మహిళను కావడంతో అందరూ నన్ను సెక్యూరిటీ గార్డ్‌ అని పిలిచేవారు.

నేను సెక్యూరిటీ గార్డ్‌ను కాను బౌన్సర్‌ని అని గట్టిగా వాదులాట చేయాల్సి వచ్చింది. బార్‌లో స్త్రీలను ఆకతాయిల నుంచి కాపాడటం, డ్రగ్స్‌ వంటి ధంధాలు నడవకుండా చూడటం, తాగేసి తగాదా పడే మగవాళ్లను సమర్థంగా విడదీసి ఇళ్లకు పంపడం ఇవన్నీ బాగా చేసేదాన్ని. దాంతో నన్ను బౌన్సర్‌ అని పిలవక తప్పలేదు’ అంటుంది మెహరున్నీసా.

నేటికీ బౌన్సర్‌గా
మెహరున్నీసా బౌన్సర్‌గా పని చేయడం తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదు. బౌన్సర్‌ అంటే నైట్‌ డ్యూటీ. అందువల్ల బంధువులు ఏవో ఒక మాటలు అనేవారు. అయినా సరే మెహరున్నీసా తన డ్యూటీలో నిమగ్నమైంది. నేటికీ ఢిల్లీని హౌస్‌ఖాస్‌ ప్రాంతంలో ‘సోషల్‌’ అనే పబ్‌లో బౌన్సర్‌గా డ్యూటీ చేస్తుంది.

మరోవైపు గత సంవత్సరం ఆమె సెక్యూరిటీ సంస్థ స్థాపించి బౌన్సర్లను, సెక్యూరిటీ గార్డ్‌లను ఆయా సంస్థలతో అనుసంధానం చేయడం మొదలెట్టింది. ఢిల్లీలో ఈవెంట్లు జరిగితే, సినిమా వాళ్లు వస్తే మెహరున్నీసా సంస్థ నుంచి బౌన్సర్లు వెళుతున్నారు.

మెహరున్నీసాను చూసి ఆమె ఆఖరు చెల్లెలు కూడా బౌన్సర్‌ అయ్యింది. ‘మా నాన్న నాకొచ్చిన పేరు, గుర్తింపు గౌరవం చూసి ఇప్పుడు సంతోషపడుతున్నాడు. మా చిన్న చెల్లెలు బౌన్సర్‌ అయినా ఏమీ అనలేదు. ఆయన గతంలో ఆడపిల్లలు ఇంటి పనులు నేర్చుకుంటే చాలు అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆడపిల్లలు చాలా సాధించగలరు అని తెలుసుకున్నాడు’ అంటుంది మెహరున్నీసా.

ఇప్పుడు ఆమెకు 35 ఏళ్లు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కొత్తదారుల్లో మొదటగా నడిచేవారు విజేతలవుతారనడానికి మెహరున్నీసా ఒక ఉదాహరణ. మగవాళ్లు మాత్రమే అనుకునే రంగాల్లో స్త్రీలూ ప్రవేశించగలరు అనడానికి ఈమె ఒక స్ఫూర్తి.  

చదవండి: ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ                                              

మరిన్ని వార్తలు