కొత్త మాట.. జెంటిల్మన్‌ వచ్చాడు

31 Jan, 2021 00:00 IST|Sakshi

అంతా మగ సంతే ఉన్న ఇంట్లోకి మొదటిసారిగా ‘మహాలక్ష్మి’ అడుగు పెడితే ఆ ఇల్లు తీరే మారిపోతుంది! కొత్త కోడలు లేక, లేకలేక కలిగిన ఒక ఆడశిశువు ప్రవేశంతో ఇంటికి కొత్త కళ వస్తుంది. ఇల్లు శుభ్రమౌతుంది. మనుషులు, మాటలు కూడా సంస్కారవంతం అవుతాయి. కొత్త బంధాలూ ఏర్పడతాయి. ఆ బంధాలు కొత్త భాషనూ నేర్పుతాయి. ఇన్నేళ్లూ ఆడకూతురి భాగ్యం లేక ‘కడు పేదరికం’లో ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు ఉపాధ్యక్షురాలిగా వచ్చిన కమలా హ్యారిస్‌ రాకతో సంతోషంగా, సందడిగా ఉంది. ఆమె భర్తతో బంధుత్వం కలుపుకుంది. ఆ బంధుత్వానికి ‘సెకండ్‌ జెంటిల్మన్‌’ అనే కొత్త వరసను కనిపెట్టింది. త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న అమెరికావాళ్ల అతి ప్రాచీన ‘మెరియం వెబ్‌స్టర్‌’ డిక్షనరీ తాజా ప్రచురణలో కూడా ‘సెకండ్‌ జెంటిల్మన్‌’ అనే మాట కనిపించ బోతోంది! 

ఇప్పటి వరకు అమెరికాలో గానీ, అమెరికా డిక్షనరీలలో గానీ ‘సెకండ్‌ జెంటిల్మన్‌’ అనే మాట అధికారికంగా లేదు. అమెరికా అధ్యక్షుyì  సతీమణిని ‘ఫస్ట్‌ లేడీ’ అనడం వంటిదే... అమెరికా ఉపాధ్యక్షురాలి భర్తను ‘సెకండ్‌ జెంటిల్మన్‌’ అనడం. జార్జి వాషింగ్టన్‌ అమెరికా తొలి అధ్యక్షుడు అయిన నాటి నుంచీ ఈ 232 ఏళ్లలోనూ ఆ అగ్రరాజ్యానికి పురుష అధ్యక్షులు, పురుష ఉపాధ్యక్షులు మాత్రమే ఉండటంతో వారి సతీమణి ‘ఫస్ట్‌ లేడీ’ (ప్రథమ మహిళ)గా, ‘సెకండ్‌ లేడీ’ (ద్వితీయ మహిళ) గా ఉంటూ వచ్చారు. ఈ ఫస్ట్‌ లేడీ, సెకండ్‌ లేడీ అనే మాటలు కూడా డిక్షనరీలలో ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు రెండు శతాబ్దాల తర్వాత తొలిసారి ఆ అగ్రరాజ్యానికి కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్షురాలిగా వచ్చారు. దాంతో ఆమె భర్త ‘సెకండ్‌ జెంటిల్మన్‌’ (ద్వితీయ పురుషుడు) అయ్యారు.

సంప్రదాయం ప్రకారం అవడానికైతే అయ్యారు. అధికారికంగా మాత్రం అలాంటి ఒక ప్రాణి (సెకండ్‌ జెంటిల్మన్‌) అమెరికా పాలన పత్రాల్లో గానీ, అమెరికా వారి 190 ఏళ్ల ఘన చరిత్ర గల ‘మెరియం వెబ్‌స్టర్‌’ నిఘంటువులో గానీ లేదు. ఇప్పుడిక ఉండబోతోంది. Second gentlemanకి మెరియం ఇచ్చిన అర్థం : The Husband of a vice-president or second in command of a country or jurisdiction. అంటే.. వైస్‌ ప్రెసిడెంట్‌ లేదా దేశ పాలనలో, దేశ పరిధిలో ద్వితీయ హోదాలో ఉన్న వ్యక్తికి భర్త.. అని మీనింగ్‌. ఇక మెల్లిమెల్లిగా అధికారిక పత్రాల్లోకీ ఈ మాట వచ్చేస్తుంది. కమలా హ్యారిస్‌ కనుక భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలు అయితే అప్పుడు ‘ఫస్ట్‌ జెంటిల్మన్‌’ అనే మాట కూడా ఆవిర్భవిస్తుంది. 

కమలా హ్యారిస్‌ భర్త డగ్లాస్‌ ఎంహాఫ్‌. ఇద్దరి ఏజ్‌ ఒకటే. 56. ఇద్దరూ అక్టోబర్‌లోనే పుట్టారు. డగ్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాయర్‌. స్క్రీన్‌ ఇండస్ట్రీ వివాదాల్ని పరిష్కరిస్తుంటారు. వ్యక్తిగా ఆయనకుండే పేరు ఆయనకు ఉన్నా కమల భర్తగా ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరుకు (సెకండ్‌ జంటిల్మన్‌) కు ఆనందం పట్టలేకపోతున్నారు. ‘వెల్, నౌ ఇటీజ్‌ అఫిషియల్‌’ అంటూ.. గాల్లో తేలినట్లుందే.. అన్నంతగా ట్వీట్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాయర్‌గా ఆయన ఉద్యోగం లాజ్‌ ఏంజెలిస్‌లో. సెకండ్‌ జెంటిల్మన్‌గా ఆయనా వైట్‌ హౌస్‌లోనే ఉండొచ్చు కానీ.. వద్దనుకున్నారు. జార్జిటౌన్‌లో ‘లా’ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పడానికి వెళ్లిపోతున్నారు. అలాగని మరీ పట్టనట్లు ఏమీ ఉండరు. సెకండ్‌ జెంటిల్మన్‌ నెరవేర్చవలసిన బాధ్యతలు లేకున్నా, ధర్మాలు కొన్ని ఉన్నాయి.

సామాజిక న్యాయం, ఇతర సంఘహిత కార్యక్రమాల్లో బైడెన్‌ పాలనాయంత్రాంగ ప్రతినిధిగా ఈయన ఒక చెయ్యి వేయవలసి ఉంటుంది. వేస్తానని బైడెన్‌ ప్రమాణ స్వీకార సందర్భంలో ట్వీట్‌ చేశారు డగ్లాస్‌ ఎంహాఫ్‌. ‘లా’ టీచర్‌గా సర్వ సాధార ణమైన జీవితాన్ని గడిపేందుకు ఈ సెకండ్‌ జెంటిల్మన్‌కు స్ఫూర్తి, ప్రేరణ అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ కాకపోయినప్పటికీ, ఎన్నికల ముందే ఆమె.. ‘తన భర్త అమెరికా అధ్యక్షుడు అయినా, నేను టీచర్‌గానే కొనసాగుతాను’ అని ప్రకటించడంతో డగ్లాస్‌ను, జిల్‌ బైడెన్‌తో పోలుస్తున్నారు. ఇద్దరివీ ఒకేవిధమైన ఔన్నత్యాలు అని. ఆయన మాత్రం ఒక మంచి మాట అన్నారు.

‘‘నా కన్నా ముందు ఎందరో మహిళలు ‘ద్వితీయులు’గా (ఉపాధ్యక్షుల భార్యలు) తమ బాధ్యతలను నిశ్శబ్దంగా, వెలుగులోకి రాకుండా నిర్వర్తించారు. వారి గౌరవాన్ని నిలిపేందుకు సెకండ్‌ జెంటిల్మన్‌గా అంకితభావంతో పని చేస్తాను’’ అన్నదే ఆ మాట. గురువారం ఆయన వాషింగ్టన్‌ డీసీలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇక తను సెకండ్‌ జెంటిల్మన్‌ అవడంపైన కూడా ఆయన కామెంట్‌ ఉన్నతంగానే ఉంది. ‘‘నేను రెండవ వ్యక్తిని కావచ్చు. చివరి వ్యక్తినైతే కాదు’’ అన్నారు.  ద్వితీయ పురుషులు, ప్రథమ పురుషులు ఇకముందు కూడా ఉంటారని చెప్పడం ఆయన భావన. అంటే మున్ముందు మరింత మంది మహిళలు పాలన పగ్గాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు