స్టార్‌ చెఫ్‌కు 'మిషెలాన్‌ స్టార్‌' అవార్డు

9 Jan, 2024 10:39 IST|Sakshi

‘మిషెలాన్‌ స్టార్‌’ అవార్డ్‌ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ

‘అబ్బో! ఇప్పుడు తినాలా!’ అని బద్దకించే వాళ్లను కూడా ఆవురావురుమంటూ తినేలా చేసింది ముంబైకి చెందిన గరీమా అరోరా. వంటల తత్వాన్ని ఒడిసిపట్టిన గరీమా చెఫ్, రెస్టారెంట్‌ నిర్వాహకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

తాజాగా...
‘మిషెలాన్‌ స్టార్‌’ అవార్డ్‌ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ప్రత్యేకత సాధించింది గరీమా అరోరా. ప్రపంచ వ్యాప్తంగా ‘ఔట్‌ స్టాండింగ్‌ కుకింగ్‌’కు సంబంధించి చెఫ్‌లకు ఇచ్చే ఫ్రాన్స్‌ దేశపు అత్యున్నత అవార్డ్‌ మిషెలాన్‌ స్టార్‌.

నా సక్సెస్‌మంత్ర
పురాణాల నుంచి చరిత్ర వరకు వంటలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాను. మన భారతీయ పురాతన వంటకాల నుంచి ప్రేరణ పొందుతాను. సంప్రదాయ, ఆధునిక పద్ధతులను మిళితం చేస్తాను. స్థానికంగా దొరికే పదార్థాలను ఉపయోగిస్తాను. – గరీమా అరోరా

గరీమా ఫుడ్‌ ఫిలాసఫీ ఏమిటీ?
‘వంటకం ఎలా ఉండాలంటే తినే వ్యక్తి చుట్టుపక్కల ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోవాలి. ఆస్వాదన మీద తప్ప మరే విషయం మీద దృష్టి మళ్లకూడదు’.
కొత్త వంటకాలను రుచి చూడడం, కొత్త వం.టకాలు తయారు చేసి ఇతరులకు పరిచయం చేయడం అంటే గరీమాకు ఇష్టం. ఆ ఇష్టమే ‘చెఫ్‌’ అయ్యేలా చేసింది. గరీమాకు థాయిలాండ్‌లో ‘గా’ పేరుతో 
ఇండియన్‌ రెస్టారెంట్‌ ఉంది. ఊహించని సమ్మేళనాలతో దినుసులు, రకరకాల వంటకాల ఘుమఘుమలతో  అతిథులను ఆశ్చర్యపరచడంలో ‘గా’ ముందు ఉంటుంది.

‘ఏడు నెలల పిల్లాడిని చూసుకోవడం, బిజినెస్, కిచెన్‌ పనులను సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా టీమ్‌ను నా శక్తిగా చెబుతాను. రకరకాల కస్టమర్‌లు, లేటునైట్‌లు. పని ఒత్తిడి ఉన్నా, నేను అందుబాటులో లేకపోయినా రెస్టారెంట్‌ సజావుగా సాగేలా చేస్తారు. వారి సపోర్ట్‌ లేకపోతే కుటుంబ బాధ్యతలు, వ్యాపార పనులను సమన్వయం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మిషెలాన్‌ స్టార్‌ అవార్డ్‌ గెలుచుకోవడంలో తగిన సహాయ సహకారాలు అందించి టీమ్‌ నన్ను ముందుకు నడిపించింది.

రెస్టారెంట్‌లో పనిచేయడం లేదా నిర్వహించడం అంత సులభం కాదు. ఎంతో అంకితభావం ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. ఇంట్లో వాళ్లతో హాయిగా మాట్లాడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. సెలవులు, పండగలు, ఫంక్షన్‌లు మిస్‌ కావచ్చు. అన్నిటినీ తట్టుకోగలిగితే ఎన్నో సాధించవచ్చు’ అంటున్న గరీమా అరోరా మరిన్ని  పురస్కారాలు గెలుచుకోవాలని ఆశిద్దాం.

ఇవి చ‌ద‌వండి: 'ఇండిగ్యాప్‌'తో ఆరోగ్యం, అధికాదాయం!

>
మరిన్ని వార్తలు