Health Benefits: న్యూ లీఫ్‌ మైక్రోగ్రీన్స్‌లో 83 పోషకాలు.. ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

8 Feb, 2023 13:10 IST|Sakshi

‘మట్టి’గ్రీన్స్‌.. 83 పోషకాలు!

ఆహారోత్పత్తుల్లో పోషక విలువల సాంద్రతను బట్టి వాటి నాణ్యతను నిర్ణయించే పద్ధతి ఒకటుంది. సేంద్రియ/ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించిన ఆహారంలో రసాయనిక ఎరువులతో పండించిన పంటల్లో కన్నా ఎక్కువ సంఖ్యలో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరుబయట పొలాల్లో పండించే పంటలకే కాదు.. మహానగరాల్లో భవనాల్లో వర్టికల్‌ ఫామ్స్‌లో పండించే పంటలకూ వర్తిస్తుంది. 

ప్రకృతిలో 92 సహజ రసాయనిక మూలకాలు ఉంటాయి. ఇందులో పంటలకు 18 పోషకాలు అత్యవసరమని, వీటిలో 15 మట్టి నుంచి, 3 వాతావరణం నుంచి అందుతున్నాయని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) చెబుతోంది. ఈ లెక్క రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారానికి సంబంధించినదని భావించవచ్చు. 

న్యూ లీఫ్‌ మైక్రోగ్రీన్స్‌లో 83 పోషకాలు
తాము ప్రత్యేక సేంద్రియ ఎరువులతో మట్టిలో పండించే మైక్రోగ్రీన్స్‌లో 83 రకాల పోషకాలు ఉంటాయని దుబాయ్‌లోని వర్టికల్‌ అర్బన్‌ ఫార్మింగ్‌ సంస్థ న్యూ లీఫ్‌ వ్యవస్థాపకుడు ఆడమ్‌ పిట్స్‌ ప్రకటించారు. 

దుబాయ్‌లో 715 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిలువుగా పేర్చిన ట్రేలలో నియంత్రిత వాతావరణంలో మైక్రోగ్రీన్స్‌ పండిస్తున్న అర్బన్‌ వ్యవసాయ క్షేత్రం న్యూ లీఫ్‌. ఈ సంస్థ వందల కొద్దీ రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లకు ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, పచ్చివే తినదగిన పువ్వుల (ఎడిబుల్‌ ఫ్లవర్స్‌)ను పండించి, తాజాగా విక్రయిస్తోంది.

ఆడమ్‌ తన ఇండోర్‌ ఫార్మింగ్‌ ప్రయాణాన్ని ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం క్రెసెస్‌ వంటి మైక్రోగ్రీన్స్‌ పండించటానికి న్యూ లైఫ్‌ను ప్రారంభించి.. ఇప్పుడు 58 రకాల మైక్రోగ్రీన్స్, ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ను దుబాయ్‌ ప్రజలకు అందిస్తున్నారు.

పోషక నాణ్యతకు మూలం మట్టి
‘దుకాణాలలో విక్రయించే దాదాపు మైక్రోగ్రీన్స్‌ మొక్కలన్నీ హైడ్రోపోనికల్‌గా పండించినవే. అయితే, మేం ప్రత్యేకంగా తయారు చేసుకున్న సేంద్రియ మట్టి మిశ్రమంలోనే మైక్రోగ్రీన్స్‌ను పెంచుతున్నాం. పోషక నాణ్యతకు మూలస్తంభం మట్టి. హైడ్రోపోనిక్‌ లేదా ఏరోపోనిక్‌ పద్ధతులను ఉపయోగించకుండా గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన మట్టి మిశ్రమంలో పెంచుతున్నాం అని వివరించారు ఆడమ్‌.

‘మట్టిని ఉపయోగించడం అంటే.. మనకు చాలా ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సహాయం తీసుకోవటమే. ఇవి మొక్కలు పోషకాలను తీసుకోవడానికి సహాయపడతాయి. మా సూపర్‌ఫుడ్‌ మైక్రోగ్రీన్స్‌ 83 రకాల పోషకాలను కలిగి ఉంటాయి. సూక్ష్మజీవులు లేకుండా ఇది సాధ్యం కాద’ని ఆడమ్‌ వివరించారు. 

పంటను పండించిన తర్వాత మొక్కల వ్యర్థాలను తిరిగి మట్టిలోనే కలిపేస్తాం. ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరింతగా వృద్ధి చెంది, తదుపరి పంటకు ఉయోగపడుతున్నాయి. మట్టి ఆధారిత సాగులో మైక్రోగ్రీన్స్, ఆకుకూరల అధిక నాణ్యతను వినియోగదారులు గ్రహించి అభినందిస్తున్నారని ఆడమ్‌ అన్నారు. 

‘ఎడారి వాతావరణంలో ఉత్తమమైన మైక్రోగ్రీన్స్‌ను పెంచడం చాలా విశేషం. ఇండోర్‌ ఫార్మింగ్‌తో మీరు ఏ నగరం మధ్యలో అయినా మట్టిలోనే అద్భుతమైన ఉత్పత్తులను పండించవచ్చ’ని ఆడమ్‌ అనుభవంతో చెబుతున్నారు.

మైక్రోగ్రీన్స్‌ ప్రయోజనాలెన్నో
►విత్తిన 2 వారాల్లో వేలెడంత పొడవున్న మొక్కలను మారాకు వేయకముందే కత్తిరించిన మైక్రోగ్రీన్స్‌లో.. ఇదే పరిమాణంలో బాగా పెరిగిన ఆకుకూరల కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌ (వ్యాధితో పోరాడటానికి సహాయపడే సమ్మేళనాలు) ఉంటాయి.
►పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి వివిధ రకాల ఖనిజాలూ పుష్కలంగా ఉన్నాయి.
►వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు, అల్జీమర్స్, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
►పొలంలో మట్టిని పరీక్షించి సేంద్రియ/ప్రకృతి సాగుకు సేంద్రియ ధ్రువీకరణ ఇవ్వటం కంటే.. ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత, ఎన్ని ఎక్కువ రకాల పోషకాలు ఉన్నాయో పరీక్షించి, దాని ఆధారంగా సర్టిఫికేషన్‌ ఇవ్వటం మేలేమో! 
– పంతంగి రాంబాబు

చదవండి: Alzheimer's: కండరాల కదలికలు చురుగ్గా ఉన్న వారికి రిస్క్‌ తక్కువే! ఏం చేయాలంటే..
పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..

మరిన్ని వార్తలు