లంచ్‌ బెల్‌: మధ్యాహ్న నైవేద్యం

10 Oct, 2020 08:35 IST|Sakshi
లంచ్‌ బెల్‌

అక్టోబర్‌ 15 నుంచి దేశంలోని విద్యాలయాలను తెరుస్తున్నారు. గణ గణ ఇక గంటలు మోగుతాయి. ప్రభుత్వం ఓకే చెప్పేసింది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా. మిడ్‌–డే మీల్‌ వండేవారు, వండాక పిల్లలకు వడ్డించే వారు శుభ్రంగా ఉండాలి. ఏప్రాన్‌లు, తలగుడ్డలు పెట్టుకోవాలి. చేతులకు గోళ్లు, గోళ్లకు రంగు ఉండకూడదు. అలంకరణగా పెట్టుడు గోళ్లు ఉంటే వాటిని తీసేయాలి. ఉంగరాలు పెట్టుకోకూడదు. చేతులకు గాజులు వేసుకోకూడదు. వాచీలు, అభరణాలు ఇంట్లోనే వదిలేసి రావాలి. మాసిన బట్టలు వేసుకోకూడదు. వంటపాత్రలు, వంట ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. పిల్లలు భోజనం చేశాక ఆ ప్లేట్లను పిల్లలు కడిగినప్పటికీ పనివాళ్లు మళ్లీ కడగాలి. కడిగిన ప్లేట్లలో సబ్బు నురగ, సబ్బు పౌడర్‌ మరకలు కనిపించకూడదు.

మిడ్‌–డే మీల్‌కు పని చేసేవారంతా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ల ఇంట్లో వాళ్లకూ ఎలాంటి అనారోగ్యం ఉండకూడదు. ఉంటే, వేరొకర్ని ఏర్పాటు చేసి వీళ్లు సెలవు పెట్టాలి. వీళ్లందరినీ జిల్లా, బ్లాక్‌ లెవల్‌ అధికారులు కనిపెట్టి ఉండాలి. టైమ్‌ టు టైమ్‌ కరోనా టెస్టులు చేయిస్తుండాలి. ఇవన్నీ స్కూళ్లు తెరవక ముందే కేంద్ర విద్యాశాఖ సిద్ధం చేసిపెట్టిన నియమావళిలోని మార్గదర్శక నిబంధనలు. మరికొన్ని కూడా ఉన్నాయి. పిల్లలకు వండి పెట్టే కూరగాయలను ముందుగా కొంచెం ఉప్పు, పసుపు కలిపి శుభ్రంగా కడగాలి. పిల్లలు తాగే మంచినీళ్లు కలుషితమైనవి కాకుండా జాగ్రత్త పడాలి.

పిల్లలు తినే సమయానికి భోజనం కనీసం 65 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు పిల్లల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. చోటు లేకుంటే ఎవరి తరగతి గదిలోనే వారికి భోజనం ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ పెద్ద లిస్టుగా చెప్పుకోబట్టి పోలవరం  ప్రాజెక్టు నిర్మాణానికి గైడ్‌ లైన్స్‌ లా ఉన్నాయి కానీ, గైడ్‌ లైన్స్‌ లేకున్నా మామూలుగా చేయవలసిన పనులే. ఇంట్లో అమ్మ రోజూ కేర్‌ తీసుకుంటుంది కదా అలాగే. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వామివారి నైవేద్యసేవగా భావిస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారు. దేశ భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన జవసత్వాలు అవుతారు.


 

మరిన్ని వార్తలు