మా ఇద్దరి పేర్లలో పవర్‌ ఉంది..

13 Mar, 2021 00:19 IST|Sakshi
భారత సంతతి అమెరికన్‌ బాల నటి స్వే, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌.

‘స్వయం’భువు

యాభై ఆరేళ్ల కమలా హ్యారిస్‌ ఎక్కడ?! 2009 బ్యాచ్‌ స్వయం భాటియా ఎక్కడ?! ‘బట్‌.. నేను, తను ఒక్కటే. మా ఇద్దరి పేర్లలో పవర్‌ ఉంది. మా ఇద్దరిలో కాన్ఫిడెన్స్‌ ఉంది. ఇప్పుడీ పన్నెండేళ్ల వయసులో ఒక ఇండియన్‌ గా యూఎస్‌ లో నేను ఎలా ఉన్నానో, తన టీన్స్‌ ఆరంభంలో కమల అలానే ఉన్నారు‘ అంటోంది ఈ ‘స్వయం’భువు! ఇంతకీ అమ్మగారు ఏం చేస్తుంటారు? ఏదైనా చేస్తుండే వయసా ఇది! చేసి పెడుతుంటే, తిని పెడుతుండే ఏజ్‌ కదా! కానీ స్వయం భాటియా అలా లేదు. షి ఈజ్‌ ఏన్‌ యాక్ట్రెస్‌. సింగర్, డాన్సర్, మోడల్, డ్రమ్మర్‌.. ఇంకా చాలా! వైస్‌–ప్రెసిడెంట్‌ అనే ఆ పోస్టును తీసి పక్కన పెడితే.. నిజమే, నేనూ తానూ అనేంత ఉంది ‘స్వే’కి. అకస్మాత్తుగా ఈ పిడుగు ఎక్కడ నుంచి పడింది?!

ఈ చిన్నారిని చూశారుగా! పేరు స్వే భాటియా. వయసు పన్నెండేళ్లు. ఆ వయసుకు ఎంత పేరొచ్చినా స్వే భాటియా అనే పేరు తర్వాతనే. కానీ తను ‘మైటీ డక్స్‌ యాక్ట్రెస్‌’ అనే పేరుతో యూ ఎస్‌లో పాపులర్‌. న్యూయార్క్‌ సిటీలో ఉంటుంది. చదువు చదువే. టాలెంట్‌ టాలెంటే! నటనొక్కటే టాలెంట్‌ అనుకునేరు. సింగర్, డ్యాన్సర్, మోడల్, డ్రమ్మర్, ఇంకా.. కమెడియన్‌. అంత టైమ్‌ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం. తను మాత్రం వేరేలా అంటుంది.. ‘బోర్‌ కొడుతోంది మమ్మీ.. టైమ్‌ గడవడం లేదు’ అని! టైమ్‌ కంటే వేగం అయి ఉండాలి. అంత వేగామా.. అని ఇప్పటికప్పుడు మీరు స్వేని చూడాలనుకుంటే హెచ్‌.బి.వో.లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్లాక్‌ కామెడీ సెటైరికల్‌ డ్రామా సీరీస్‌.. ‘సక్సెషన్‌’ కోసం టీవీ ఆన్‌ చేయొచ్చు. అందులో సోఫీ రాయ్‌గా మీకు కనిపించబోయేది స్వే భాటియానే! లేకుంటే మార్చి 26న ప్రారంభమయ్యే ‘డిస్నీ ప్లస్‌’ సీక్వెల్‌ సీరీస్‌ ‘ది మైటీ డక్స్‌ : గేమ్‌ ఛేంజర్‌’ కోసం ఎదురు చూడొచ్చు. మైటీ డక్స్‌ విడుదలకు ముందే స్వే.. మైటీ డక్స్‌ యాక్ట్రెస్‌ అయిందంటే చూడండి. సరే, ఇప్పటి వరకు ఇదంతా స్వే (అసలు పేరు ‘స్వయం’) గురించి మనం చెప్పుకున్నది. ఇక్కడి నుంచి స్వే తన గురించి తను చెప్పుకోబోతున్నది! అయితే స్వే ఊరికే తనేమిటో చెప్పుకోవడం లేదు. కమలా హ్యారిస్‌తో తనని కంపేర్‌ చేసుకుంటోంది. లేదంటే కమలా హ్యారిన్‌ని తనతో కంపేర్‌ చేస్తోంది! ఇలాగని తను తన బ్లాగ్‌లో రాసుకుంది.


డ్రమ్మర్‌గా, నటిగా, మోడల్‌గా స్వే (స్వయం)

‘‘ఐ యామ్‌ స్వే. పుట్టినప్పుడు స్వయం రంజీత్‌ భాటియా నేను. ఈ మధ్యే నేను నా పేరులో ఉన్న పవర్‌ని గమనించాను. ‘స్వ’ అంటే ‘నా’ అని. ‘స్వయం’ అంటే ‘నేను’ అని. నేను పుట్టకముందే అమ్మానాన్న అబ్బాయి పుడితే పెట్టాలని ‘స్వీయ’ అనే అర్థంలో ‘స్వయం’ అనే సంస్కృత నామాన్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. నేను పుట్టాక అదే పేరు ఉంచేశారు’’ అని స్వే తన బ్లాగులో రాసుకుంది. అయితే ఇదేమీ విషయం కాదు. తన పేరులో ఉన్న పవరే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ పేరులోనూ ఉందని తను గమనించిందట. అంతే కాదు, తామిద్దరికీ పోలికలు ఉన్నాయని కూడా! కమలానికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నట్లే కమలా హ్యారిస్‌ ప్రయాణానికీ ఉంటుందని అనిపించి ఆమె గురించి తెలుసుకున్నా.

భారతీయ సంతతి అమెరికన్‌ టీనేజర్‌గా కమల అమెరికాలో ‘ఏకాకి’ అయిన సందర్భాలు.. నేను ఇప్పుడు ఏకాకి అవుతున్న సందర్భాలను గుర్తు చేస్తున్నాయి. ఆ వయసులో ఒక బ్లాక్‌ పర్సన్‌గా, ఒక ఇండియన్‌గా, ఒక మహిళగా తన గదిలో కమల ఒంటరిగా గడపడం.. ఇప్పుడు నా ఒంటరితనాన్ని గుర్తుకు తెస్తోంది. నేను టీన్స్‌లోకి వస్తున్నాను. పదమూడు రాబోతోంది. నాకూ నా గదిలో ఒంటరి ఇండియన్‌ని అనిపిస్తుంటుంది. బ్యాలే క్లాస్‌లో, హిప్‌ హాప్‌ డ్యాన్స్‌ కచ్చేరీల్లో, బ్రాడ్వే ఆడిషన్‌లలో నేనొక్కదాన్నే అన్నట్లు ఉంటుంది. గత ఏడాది కమల పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆమెతో నన్ను పోల్చుకున్నాను. ఆమె అడుగు కదిలినప్పుడు నా అడుగు కదలినట్లు, క్యాపెయిన్‌ను ఆపినప్పుడు నా అడుగు ఆగినట్లు ఊహించుకున్నాను. ఒకవేళ ఆమె ఇక్కడే ఆగిపోతే.. నేనూ ఆగిపోతానా అనే ఆలోచన కూడా నాకు ఆనాడు వచ్చింది. కానీ ఆమె గెలిచారు. నాలో గెలుపు ఆలోచనలు కలిగించారు. ఒక ఇండియన్‌ అమెరికన్‌ ఇంత ఘన విజయం సాధించారు కనుక నేనూ సాధిస్తాను అనుకున్నాను’’ అని స్వే తన బ్లాగ్‌లో రాసింది.

ఇదంతా స్వే మామూలుగా రాసుకున్నదే కానీ ఆమె ఇలా రాయడానికి ఇప్పుడు అనుకోని ప్రాధాన్యం లభిస్తోంది. ముఖ్యంగా కమలా హ్యారిస్‌తో ‘నేనూ తనూ’ అని పోల్చుకోవడం! యాక్టర్స్‌ ఈక్విటీ అసోసియేషన్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌–అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అండ్‌ రేడియో ఆర్టిస్ట్‌ సంస్థలతో స్వేకి కాంట్రాక్టులు ఉన్నాయి. అసలు మూడేళ్ల వయసు నుంచే స్వే సంగీత, సృజనాత్మక రంగాలలోకి వచ్చేసింది. కీబోర్డ్, క్లాసికల్‌ పియానో, బాస్‌ గిటార్, డ్రమ్‌.. ఆమె వేళ్లు చెప్పినట్లు రాగాలు పోతాయి. దరువులు వేస్తాయి. స్వే డ్యాన్స్‌ చేస్తే ఫ్లోర్‌ పరవశించిపోవలసిందే! అంత లయబద్ధంగా చేస్తుంది. ‘‘తను ప్రధానంగా నటి. డాన్స్, సంగీతం.. తనకు అనుబంధ ఆసక్తులు’’ అంటారు స్వే తల్లిదండ్రులు రంజీత్, ధర్మాంగి. చివరికి స్వే ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా ఎదిగి, రాజకీయాల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. కమలతో తనను కంపేర్‌ చేసుకుంటోందంటే.. కమల అడుగు జాడల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉందనేగా!       

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు