ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి?

2 Jan, 2021 12:24 IST|Sakshi

అక్క చేతుల మీదుగా ‘గుర్హతి’

మార్పుకు నాంది పలికిన బిహార్‌ పెళ్లి

‘‘మా తమ్ముడికి అన్న లేడు. అక్కను మాత్రమే ఉన్నాను. తమ్ముడికంటే ముందు పుట్టిన కారణంగా, వాడికంటే ముందే చదువు పూర్తి చేసి ఉన్న కారణంగా నేను తమ్ముడికి చాలా విషయాల్లో మార్గదర్శనం చేయగలిగాను. వాడి అప్లికేషన్‌ నింపినప్పుడు నేను ఆడపిల్లనే కదా! వాడి పెళ్లిలో పెద్దన్న పాత్ర నేను పోషిస్తే తప్పేంటి’’ అని ప్రశ్నించిందో అమ్మాయి. ‘‘మా తమ్ముడికి అక్కనైనా, అన్ననైనా నేనే’’ అని స్పష్టం చేసింది. ఆమె వాదన పెళ్లి నిర్ణయంలో కానీ, పెళ్లి నిర్వహణలో కానీ పెత్తనం చేయడం కోసం కాదు. పురాతన పద్ధతుల కోసం పాకులాడడం ఎంత వరకు సమంజసం అని మాత్రమే. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు ఆమోదించారు. తమ్ముడు స్వాగతించాడు. తమ్ముడి అత్తింటి వారు అంగీకరించారు. ఇంకేం కావాలి? పెళ్లిలో వరుడి అన్న చేతుల మీదుగా నిర్వహించాల్సిన ‘గుర్హతి’ ప్రక్రియ వరుడి అక్క చేతుల మీదుగా జరిగింది. బీహార్‌ రాష్ట్రంలో ఇలాంటి మార్పుకు నాంది పలికిన తొలి పెళ్లి ఇది.

మగవాళ్లే ఎందుకు?
బీహార్‌ పెళ్లిళ్లలో గుర్హతి అనే సంప్రదాయ విధానం ఒకటి ఉంది. వధూవరులు పెళ్లి మండపంలోకి వచ్చిన తర్వాత అత్తింటివారు వధువుకి చీరలు, నగలు బహుమతిగా ఇస్తారు. ఈ బాధ్యతను వరుడి అన్న చేతి మీదుగా నిర్వర్తిస్తారు. వధువుకి భద్రత కల్పించే బాధ్యత ఇక నుంచి తమదేనని భరోసానిస్తారు. వరుడికి అన్న లేకపోతే వరుసకి అన్న అయ్యే వ్యక్తి ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. ఈ పనిని మగవాళ్లే ఎందుకు చేయాలని, తానెందుకు చేయకూడదని ప్రశ్నించింది మీమాంస శేఖర్‌ అనే యువతి. తమ్ముడి పెళ్లిలో వధువుకి అత్తింటి తరఫున ఇవ్వాల్సిన బహుమతులను తన చేతుల మీదుగా అందించింది. ఈ క్రతువును దగ్గరుండి జరిపించడానికి పురోహితుడు మాత్రం కొంచెం సంశయించాడు. మీమాంస సంధించిన ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేకపోవడంతో తలూపాల్సి వచ్చింది. ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్షులు పెళ్లికి హాజరైన అతిథులందరూ. వీరిలో సంప్రదాయవాదులు నొసలు చిట్లించారు. అభ్యుదయ వాదులు హర్షం వ్యక్తం చేశారు. వరుడి తల్లి భావన శేఖర్‌ మాత్రం ‘‘ఈ తరం ఆడపిల్లలకు మగవాళ్లు రక్షణ కల్పించడం నిజంగా అవసరమా’’ అని ప్రశ్నించారు. (చదవండి: గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌)


కొత్త ఆచారం
‘‘కాలం మారింది. జీవనశైలి మారింది. ఆచార వ్యవహారాలను గుడ్డిగా ఆనుసరించకుండా ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆడవాళ్లు గడపదాటడానికి ఆంక్షలు ఉన్న రోజుల్లో రూపుదిద్దుకున్న ఆచారాలను ఇంకా కొనసాగించడం ఎందుకు? నేను టీచర్‌గా పాఠ్యపుస్తకాల్లో ఉన్న జ్ఞానంతోపాటు సామాజిక చైతన్యాన్ని కూడా విద్యార్థులకు అందించాను. పన్నెండేళ్లుగా రచయితగా నా ఆలోచనలకు అక్షర రూపమిచ్చాను. ఈ రోజు నా కొడుకు పెళ్లిలో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టాను’’ అన్నారు మీమాంస తల్లి భావన. ఆచారం అనాదిగా వస్తుంటుంది. కొత్తగానూ రూపుదిద్దుకుంటుంది. ఏ ఆచారమైనా దానికి ప్రాసంగికత ఉన్నంత కాలం మనుగడలో ఉంటుంది. అవసరం లేని వస్తువు అటకెక్కినట్లుగానే అవసరం లేని ఆచారం కూడా రూపు మార్చుకోవాలి. (చదవండి: ఆమె ఒక నడిచే గ్రంథాలయం)

మరిన్ని వార్తలు