సక్సెస్‌ స్టోరీ: యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌

11 Mar, 2022 00:39 IST|Sakshi

కరెంటు బిల్‌ అనే మాట వినబడగానే... కొండంత భయం ఎదురొచ్చి నిలుచుంటుంది. ఆ కొండను కోడిగుడ్డు స్థాయికి తగ్గించలేమా?
కరెంటు బిల్లు అనేది పెద్ద ఖర్చు కాదు. విద్యుత్‌ వృథాను అరికడితే ‘బిల్‌’ మనల్ని కనికరిస్తుంది. ‘వెరీగుడ్‌’ అని వెన్నుతట్టేలా చేస్తుంది.
మరి విద్యుత్‌ వృథాను అరికట్టాలంటే? 26 సంవత్సరాల గోకుల్‌ శ్రీనివాస్‌ సక్సెస్‌ స్టోరీని తెలుసుకోవాల్సిందే...

ఒకప్పటి మాదిరిగా ఇంట్లో లైట్‌ వెలగడానికి మాత్రమే మనం కరెంట్‌ను ఖర్చు చేయడం లేదు. ఇస్త్రీ పెట్టె, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్‌ వోవెన్, కంప్యూటర్‌... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
విద్యుత్‌ వినియోగానికే పరిమితమైన మనం ‘వృథా’ను అంతగా పట్టించుకోవడం లేదు. లేదా అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిందే ‘మినియన్‌’ డివైజ్‌. దీని సృష్టికర్త గురించి...
హైస్కూల్‌ రోజుల్లో గోకుల్‌ శ్రీనివాస్‌కు ‘హాకీ’ అంటే ప్రాణం. ఈ ఆటలో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అయితే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని కలలు అవిరైపోయాయి. హాకీ గట్టిగా ఆడలేని పరిస్థితి.

కట్‌ చేస్తే...
చదువు పూర్తయిన తరువాత అమెజాన్‌ ఐటీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరం పూర్తయిన తరువాత ‘ఇది మనకు సెట్‌ అయ్యే జాబ్‌ కాదు’ అనిపించింది. తనకు ‘ఎలక్ట్రానిక్స్‌’ అంటే చా...లా ఇష్టం. రకరకాల డివైజ్‌లు తయారుచేశాడు. అలా తయారు చేసిందే మినియన్‌ (మిని+ఆన్‌) సంప్రదాయ విధానాల్లో ‘ఎనర్జీ మానిటరింగ్‌’ అనేది సంక్లిష్టమైన విషయం.‘మినియన్‌’ డివైజ్‌తో మాత్రం విద్యుత్‌ వాడకానికి సంబంధించి మానిటరింగ్, ఎనాలసిస్‌ చేయడం సులభం.

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), ఎంఎల్‌ (మెషిన్‌ లెర్నింగ్‌) వైర్‌లెస్‌ డివైజ్‌ ‘మినియన్‌’అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజ్‌లో ఉంటుంది. వృథాను అరికట్టడం మాత్రమే కాదు... ఏదైనా విద్యుత్‌ ఉపకరణాన్ని రిపేర్‌ చేయించాల్సిన పరిస్థితి వస్తే అలర్ట్‌ చేస్తుంది. ‘మినియన్‌ ల్యాబ్స్‌’ పేరుతో బెంగళూరులో అంకుర సంస్థను మొదలుపెట్టాడు శ్రీనివాస్‌. ఇది అంతర్జాతీయ స్థాయిలో హిట్‌ అయింది. ఇళ్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ...లలో ఇంధన వృథాను గణనీయంగా అరికడుతూ ప్రశంసలు అందుకుంటోంది.

‘విద్యుత్‌ వృథాను అరికట్టడం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా’ అంటారు. యువత ‘మినియన్‌’లాంటి ఇంధన వృథాను అరికట్టే పరికరాలను మరిన్ని తయారుచేస్తే ఆ బాధ్యత నెరవేర్చడం సులువవుతుంది.

మరిన్ని వార్తలు