Mobile Phones: మీ చెవులు బిజీయా.. అయితే వీటి ముప్పు తప్పదు

12 Mar, 2022 23:54 IST|Sakshi

రోజుకు ఎన్ని గంటలు చెవి ఒగ్గుతున్నారు? అదేనండీ! రోజుకు ఎంత సేపు ఫోన్‌ వాడుతున్నారు? ఇయర్‌ ఫోన్స్‌... హెడ్‌ ఫోన్‌తో  చెవిని బిజీగా ఉంచుతున్నారా? ఇక... ఇన్‌ఫ్లమేషన్‌... ఇరిటేషన్‌... ఇన్ఫెక్షన్‌ పొంచి ఉంటాయి.

‘చెయ్యి ఖాళీ లేదు’ అనే మాట ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. కానీ చెవి ఖాళీ లేదని మాత్రం చెప్పాల్సిన పనిలేకనే కనిపిస్తోంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆరు ఫోన్‌లుంటాయి. కొన్ని ఫోన్‌లకు రెండు సిమ్‌లు కూడా. ఒక ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగానే మరో ఫోన్‌ రింగవుతుంది. ఆన్సర్‌ చేయడానికి చెయ్యి ఖాళీ ఉండదు. ఒకవేళ ఇయర్‌ ఫోన్స్‌తో వింటూ మాట్లాడుతూ ఉంటే చెయ్యి ఫ్రీగానే ఉంటుంది. కానీ చెవి మాత్రం ఖాళీ ఉండదు. రోజులో ఓ రెండు గంటల సేపు ఫోన్‌ కోసం చెవిని అంకితం చేయక తప్పని లైఫ్‌స్టైల్‌ ఇది. ఆ పైన ఖాళీ సమయాన్ని ఎవరికి వాళ్లు స్మార్ట్‌ఫోన్‌లో తమకు నచ్చిన చానెల్‌లో ఇష్టమైన ప్రోగ్రామ్‌ చూస్తూ గడిపేస్తారు. పక్క వాళ్లకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఇయర్‌ఫోన్స్‌ను ఆశ్రయించక తప్పదు.

ఇలా రోజులో ఐదారు గంటల సమయం చెవుల్లో ఇయర్‌ ఫోన్‌ ఉంటోంది. మరికొన్ని వృత్తుల్లో అయితే హెడ్‌ఫోన్‌ తప్పనిసరి. వాళ్లు ఏడెనిమిది గంటల సమయం హెడ్‌ఫోన్‌ ధరించి ఉంటారు. మొదట్లో బాగానే ఉంటుంది. కానీ క్రమంగా తమకు తెలియకనే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పెద్దగా గొంతు పెంచి మాట్లాడడం అలవాటవుతుంది. ఇంట్లో వాళ్లు చెప్పేది సరిగ్గా వినిపించదు. చిరాకులు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య తెలియని దూరం పెరుగుతుంది. ఆ తర్వాత చెవిలో దురద, వాపు, ఇన్‌ఫెక్షన్‌లు మొదలవుతాయి.

వీటన్నింటికీ కారణం ఇయర్‌ఫోన్స్, హెడ్‌ ఫోన్స్‌తో చెవులను రొద పెట్టడమేనంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ సమస్యను ‘స్విమ్మర్స్‌ ఇయర్‌’ అంటారు. ఈ రకమైన ఇబ్బంది మొదలైన వాళ్లలో పన్నెండు శాతం మందికి వినికిడి శాశ్వతంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కారణం చెవి అదేపనిగా శబ్దాలను వినాల్సి రావడమేనంటే... వింతగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంది. కానీ ఇదే వాస్తవం. అనుక్షణం మితిమీరిన శబ్దాల మధ్య ఈదులాడాల్సిన దుస్థితి చెవిది.

గ్రాఫ్‌ పెరుగుతోంది
పాశ్చాత్యదేశాలతో పోలిస్తే ఈ సమస్య మనదేశంలో వేగంగా పెరుగుతోంది. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండడం, సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభించడం స్వాగతించాల్సిన పరిణామమే. కానీ టెక్నాలజీని ఎంత వరకు ఉపయోగించుకోవాలనే విషయంలో స్వీయ నియంత్రణ ఉండి తీరాలి. ఇక తప్పని సరిగా ఎక్కువ సేపు మాట్లాడాల్సిన ఫోన్‌కాల్స్‌ విషయంలో స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడడం ఓ మధ్యేమార్గం. ట్రాఫిక్‌ శబ్దాల్లో ఎక్కువ సమయం పని చేయాల్సిన వాళ్లు... ఇయర్‌ కెనాల్‌ను (చెవిరంధ్రాన్ని) కాటన్‌ బాల్‌ లేదా ఇయర్‌ప్లగ్స్‌తో కప్పి ఉంచడం మంచిది.

చివరగా ఒకమాట... చెవుల నుంచి వైర్లు వేళ్లాడుతూ, సంగీతానికి అనుగుణంగా మెలికలు తిరుగుతూ ఉంటే... మోడరన్‌ లుక్‌ ఫీలవచ్చేమో కానీ... ఇది శృతి మించితే హియరింగ్‌ మెషీన్‌తో సహజీవనం చేయాల్సిందే. ఎంతటి సంగీత ప్రియులైనా సరే... ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వినేటప్పుడు 70 నుంచి 80 డెసిబుల్స్‌కు మించితే హియరింగ్‌ మెషీన్‌కు దగ్గరగా వెళ్తున్నట్లే. అలాగే ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్‌ వాడే వాళ్లు అరగంటకోసారి వాటిని తీసి చెవులను సొంతంగా మామూలు శబ్దాలను కూడా విననివ్వాలి. 

మరిన్ని వార్తలు