6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!

18 Feb, 2022 14:09 IST|Sakshi

ఇరవై ఎనిమిదేళ్ల ఓషియానాకు వ్యాపారం చేయాలన్న ఆశ బలంగా ఉంది. కానీ ‘‘ఇంట్లో ఎవరూ వ్యాపారస్థులు లేరు, ఏ అనుభవం లేకుండా వ్యాపారం ఎలా చేస్తావు’’ అంటూ తల్లిదండ్రులు ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లారు. అయితే అక్కడితో తన ఆశను వదిలేయకుండా, వాళ్లను ఎలాగో ఒప్పించి ఓ స్టార్టప్‌ ను ప్రారంభించింది. అనుభవం లేకపోయినా అంకిత భావం ఉండటం వల్ల ప్రారంభంలో ఎదురైన అనేక ఆటుపోట్లను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోయింది. ఫలితం.. ఇప్పుడామె ఆదాయం నెలకు కొన్ని లక్షలు. అలా వ్యాపారం చేయాలన్న ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తోంది ఓషియానా.

ఢిల్లీకి చెందిన ఓషియానా ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ‘ఫ్యాషన్‌  ఎక్స్‌పోర్ట్‌ హౌజ్‌’లో చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తోంది కానీ మనసులో మాత్రం బిజినెస్‌ చేయాలని బాగా కోరిక. తన కోరికను తల్లిదండ్రుల ముందుంచితే ‘‘ఉద్యోగంలో ఎటువంటి రిస్కూ ఉండదు. వ్యాపారం అయితే లాభనష్టాలతో కూడుకున్నది. 

ఎక్కువ ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగం చెయ్యి’’ అని ప్రభుత్వ ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు ఆమెను వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఓషియానా వారి అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ తన మనసులో ఉన్న బిజినెస్‌ ప్లాన్‌ గురించి వివరించి ‘‘మీరు నాకు ఆరునెలలు సమయం ఇవ్వండి. నన్ను నేను నిరూపించుకుంటాను. అది జరగని పక్షంలో మీరన్నట్లే చేస్తాను’’ అని చెప్పి ఒప్పించింది.

ఫ్రెండ్‌తో కలిసి..
తల్లిదండ్రులు ఒప్పుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా 2019 ఫిబ్రవరిలో తన స్నేహితుడు సౌరభ్‌ తోకస్‌తో కలిసి ‘మోడ్రన్‌  మిత్‌’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఓషియానా ఉద్యోగం చేసేటప్పుడు దాచుకున్న డబ్బులు, ఇంకా సౌరభ్‌ తెచ్చిన కొంత మొత్తం కలిపి ఆరు లక్షల రూపాయలతో.. నాలుగు కుట్టు మిషన్లు, నలుగురు కళాకారులతో రెగ్జిన్‌ , కార్క్, కాటన్‌ , పైనాపిల్‌ వ్యర్థాలు, క్యాక్టస్‌ ఫైబర్‌ వంటి వీగన్‌  పదార్థాలతో బ్యాగ్‌ల తయారీ మొదలు పెట్టింది. 

చూడటానికి చాలా మోడర్న్‌గా ఉంటూ మన్నికగా ఉండే ఈ బ్యాగ్‌లకు మంచి ఆదరణ లభించింది. విక్రయాలు బాగా జరిగేవి. అలా వచ్చిన లాభాన్ని మళ్లీ దానిలోనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చింది. నేడు 15 మంది హస్త కళాకారులు, పది మిషన్లతో మోడ్రన్‌  మిత్‌ దూసుకుపోతోంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మిత్‌ కస్టమర్లకు నాణ్యమైన బ్యాగ్‌లు అందించేందుకు ప్రస్తుతం అందుబాటు లో ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్‌ డిజైన్లను వాడుకుని నెలకు 14 నుంచి 20 లక్షల వరకు ఓషియానా ఆర్జిస్తోంది. 

డిజైన్‌ , నాణ్యతే మా ప్రత్యేకత
‘‘ఫ్యాషన్‌  పరిశ్రమలో డిజైన్‌ తోపాటు నాణ్యత చాలా ముఖ్యం. అందుకే నేను ముందు మంచి హస్తకళాకారులను అన్వేషించాను. తరతరాలుగా అదే పనిచేస్తోన్న కుటుంబాలకు చెందిన కళాకారులను ఎంపికచేశాను. నా కంపెనీలో పనిచేస్తోన్న కళాకారుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వీళ్లు చేతితోనే అందమైన డిజైన్లు రూపొందిస్తారు. రెగ్జిన్‌ , కార్క్, కాటన్‌ లను ఢిల్లీ, కోల్‌కతాల నుంచి సేకరించి అందమైన బ్యాగ్‌లు రూపొందిస్తున్నాము. పైనాపిల్‌ వ్యర్థాలు, క్యాక్టస్‌ ఫైబర్‌ను కూడా తయారీలో వాడుతున్నాం. వీటివల్ల పర్యావరణానికి హాని కలగదు. మా దగ్గర 130 రకాల బ్యాగ్‌లు తయారవుతాయి. 

వీటిలో హ్యాండ్‌ బ్యాగ్స్, టాట్స్, స్లింగ్‌ బ్యాగ్స్, మేకప్‌ పౌచ్‌లు, ట్రావెలింగ్, ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార అనుభవం లేని అమ్మాయిగా ప్రారంభంలో నాకు చాలా సమస్యలు ఎదురైనప్పటికీ సౌరభ్‌ సాయంతో అన్నింటినీ అధిగమించగలిగాను. మా ఉత్పత్తులను ఆన్‌ లైన్‌ ద్వారా నేరుగా కస్టమర్లకు చేరుస్తూ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తున్నాను. ఎవరైనా స్టార్టప్‌ ప్రారంభించాలనుకుంటే ముందు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాన్ని బాగా పరిశోధించి అర్థం చేసుకోవాలి. తర్వాత తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దానిపై పట్టు సాధించాక అంచెలంచెలుగా దానిని పెంచుకోవాలి’’ అని స్టార్టప్‌ ఔత్సాహికులకు సూచిస్తోంది ఓషియానా.

మరిన్ని వార్తలు