చెడుల నిర్మూలనకు కంకణ బద్ధులు కావాలి

23 May, 2022 10:26 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలి.

నేడు సమాజంలో ఎటు చూసినా చెడులు, దుష్కార్యాలు పెరిగిపోతున్నాయి. మానవ జీవితంలోని అన్ని రంగాలనూ ఈ రుగ్మతలు పరివేష్టించాయి. చెడులతో పోల్చుకుంటే మంచి తక్కువగా కనబడుతోంది. నిజానికి మంచి అన్న మేరు పర్వతం ముందు చెడు చీడ పురుగులా గోచరించ వలసింది. కాని దురదృష్ట వశాత్తూ దుర్మార్గమే దొడ్డుగా ఉన్నట్లు కనబడతా ఉంది. ఈ దుస్థితి మారాలి. మార్చాల్సిన బాధ్యత సమాజ శ్రేయోభిలాషులందరిపై ఉంది. ముఖ్యంగా దైవ విశ్వాసులపై మరీ అధికంగా ఉంది. దుర్మార్గాల నిర్మూలన, సత్కార్యాల స్థాపన పైనే మానవాళి సాఫల్యం ఆధారపడి ఉంది.

ఈ గురుతరమైన బాధ్యతను గుర్తు చేస్తూ పవిత్ర ఖురాన్‌ ఇలా అంటోంది: ’ మీలో కొందరు, ప్రజలను మంచి వైపుకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించే వారు, చెడులనుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇహపర లోకాలలో సాఫల్యం పొందేవారు’..(3 –104). మరొక చోట:,  ’విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరే.. మీరు సత్కార్యాలు చేయమని ప్రజలను ఆదేశిస్తారు, దుష్కార్యాలనుండి వారిస్తారు. దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు’ అని చెప్పబడింది. (3–110)

పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యాలు దైవ విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటో, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలేమిటో విశదీకరించాయి. దీన్నిబట్టి  ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలని మనకు అర్ధమవుతోంది.

అందుకే పవిత్ర ఖురాన్, ప్రజల్లో దైవ భీతిని, పరలోక చింతనను జనింపజేసి తద్వారా వారిని  నీతిమంతులుగా, సత్పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషిస్తోంది. మూఢనమ్మకాలు, దురాచారాలతో సహా ప్రపంచంలోని  అన్నిరకాల చెడులను నిర్మూలించి చక్కని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పదలిచింది. ఈ లక్ష్యసాధన కోసం పవిత్ర ఖురాన్‌ దైవ విశ్వాసులపై మంచిని పెంచే, చెడును నిర్మూలించే బృహత్తర బాధ్యత ను నిర్బంధం చేసింది. దీనికోసం దైవ విశ్వాసులు ఒక సంఘటిత శక్తిగా రూపొందాల్సిన ఆవశ్యకతను అది గుర్తు చేస్తోంది. 

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ఖాన్‌ 

మరిన్ని వార్తలు