హోమ్‌షెఫ్‌.. ఫుల్‌టైమ్‌ వంట

4 Sep, 2021 12:58 IST|Sakshi

‘అమ్మ చేతి వంట ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. అమ్మ మనసు పంచే ప్రేమలా’ అంటారు హైదరాబాద్‌ టోలీచౌకీలో ఉంటున్న జరీనా షా. పన్నెండేళ్లుగా మామ్స్‌ హోమ్‌ మేడ్‌ ఫుడ్‌ పేరుతో హోమ్‌ షెఫ్‌గా రాణిస్తున్న జరీనా పిల్లల స్నేహితులు అడిగారని ఇంటి నుంచే ఫుడ్‌ బిజినెస్‌ను మొదలుపెట్టారు. దీనినే ఉపాధిగా మలుచుకొని ఉద్యోగులకు, ఫంక్షన్లకు ఆర్డర్ల మీద వంటలు చేస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా మాల్స్, కైట్‌ ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్స్‌ అంటూ నగరంలో జరిగే కార్యక్రమాల్లో ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తూ ఇంటి వంటను రుచిగా అందిస్తున్నారు.  ‘వంట చేయడం అంటే ఇష్టం, చేసిన వంటను నలుగురు మెచ్చుకుంటూ తింటూ ఉంటే మనసుకు చాలా ఆనందం కలుగుతుంది’ అంటారు జరీనా. రెండు వందల మందికైనా టిఫిన్లు, భోజనాలను సిద్ధం చేసే పనిలో రోజంతా తీరికలేకుండా ఉంటారామె. (కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్‌ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్‌ చేశారా)
   
ఆరుగురు కోడళ్లలో ఒకరిగా.. 
యాభై నాలుగేళ్ల తన జీవితం గురించి ప్రస్తావిస్తూ ‘‘ముప్పై ఏళ్లుగా వంటలోనే మమేకం అయి ఉన్నాను. పుట్టింట్లో ఉన్నప్పుడు వంటలో అసలు ఓనమాలు కూడా తెలియవు. అత్తింటిలో అడుగుపెట్టాకే వంట నేర్చుకున్నాను. ఆరుగురు కోడళ్లలో రెండవకోడలిని. అందరం కలిసి పనులు చేసుకుంటూ ఉండేవాళ్లం. నా చేతి వంట బాగుంటుందని మా అత్తగారు గొప్పగా చెబుతుండేవారు. ఇంటిల్లిపాది మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉండేది. మా కుటుంబసభ్యులు అందరు కలిస్తేనే రెండు వందల మంది అయ్యేవారు. పిల్లలు కాలేజీలకు వచ్చే సమయానికి వేరు కాపురాలు అయిపోయాయి. పిల్లలకు లంచ్‌ బాక్సులు కట్టి ఇస్తే, వాటిని వాళ్ల స్నేహితులు తిని తెగ మెచ్చుకునేవారట. వారి కోసం కూడా స్వయంగా బాక్సులు కట్టి పంపేదాన్ని. (చికెన్‌- పాలకూర ఫ్రిట్టర్స్‌ ఎలా తయారు చేయాలో తెలుసా?)

ఇదే విధానం వాళ్లు ఉద్యోగాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది. పిల్లలు, వారి స్నేహితులు అడిగారు కదా కొన్ని కొన్ని ఫుడ్‌ ఐటమ్స్‌ చేసి ఇచ్చేదాన్ని. ఆర్డర్లు పెరుగుతుండటంతో దీనినే ఫుల్‌టైమ్‌ జాబ్‌గా ఎంచుకున్నాను. ఉద్యోగుల కోసం టిఫిన్లు, లంచ్‌ బాక్సులు, చిన్న చిన్న పార్టీలకు ఆర్డర్స్‌ మీద వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తూ వచ్చాను. నోటి మాటగానే చాలా మందికి తెలిసిపోయింది. మా ఏరియా నుంచే కాకుండా నగరంలో మిగతా చోట్ల నుంచి కూడా ఫుడ్‌ ఆర్డర్లు వస్తాయి. హోమ్‌మేడ్‌ హలీమ్‌తో పాటు బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలు, ఖద్దూకా ఖీర్‌.. వంటి అన్ని రకాల స్వీట్ల తయారీ ఉంటుంది. నా వంట ద్వారా నేను ఉపాధి పొందడమే కాదు, దీని ద్వారా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు తృప్తిగానూ ఉంటుంది.

ఉచితంగా ఆహారం
ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆర్థిక అవసరం ఏమీ లేదు. పిల్లలు ఇప్పుడు కూర్చో, ఎందుకు కష్టపడతావు అంటారు. కానీ, రుచికరమైన ఆహారాన్ని తయారుచేయడంపై ఉన్న ఇష్టమే ఇంకా ఈ బిజినెస్‌లో కొనసాగేలా చేస్తోంది. రోజులో ఎక్కువ గంటలు నిల్చొనే పనులు చేయడం వల్ల కాలు నొప్పి సమస్య వచ్చిందని, ఇంట్లో ఈ పనిని వదిలేయమంటారు. కానీ, మనసు ఒప్పుకోదు. నేను వంటలు చేస్తాను అని మా చుట్టుపక్కల వారికి తెలుసు కాబట్టి, పేదవాళ్లు ఎవరైనా వచ్చి భోజనం అడుగుతారు. నేనీ పని ఆపేస్తే వారికి ఎలా సాయం చేయగలను. దీని ద్వారా రోజులో కొంతమంది పేదవారికైనా నా చేతులతో వండిన ఇంటి భోజనాన్ని అందిస్తాను కదా అనిపిస్తుంది.

స్వయంగా సిద్ధం
వంటకు రుచి రావాలంటే అందులో వాడే మసాలా దినుసుల వాడకం ముఖ్యం. సన్నని మంట మీద సువాసన వచ్చేలా వేయించిన మసాలా దినుసులను ఏ రోజుకు ఆ రోజు నేనే స్వయంగా తయారుచేసుకుంటాను. వంటకాలలో మిక్సీ వాడకం అంటూ ఉండదు’ అని చెప్పే జరీనా కరోనా పాజిటివ్‌ వచ్చినవారు కోరితే అన్ని రోజులూ ఉచితంగా ఫుడ్‌ డెలివరీ చేశారు. ‘చేసిన సాయం చెప్పుకుంటే దేవుడు హర్షించడు, నాకు ఆ శక్తిని ఇచ్చినందుకు వారికే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను’ అంటారామె. 
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు