మై బెస్ట్‌ ఫ్రెండ్‌

10 Aug, 2020 00:17 IST|Sakshi

డబ్బు.. ప్రీతి బెస్ట్‌ ఫ్రెండ్‌! ‘నాకే కాదు.. ప్రతి స్త్రీకీ..’ అంటారు ప్రీతి. చేతిలో డబ్బుండటమే.. ఫెమినిజానికైనా ప్రీతి చెప్పే అర్థం. అదీ తన సొంత డబ్బు. భర్త ఇచ్చిందీ.. తండ్రిని అడిగితే వచ్చిందీ కాదు. తనే ఇంకొకరికి ఇవ్వగలిగింది. మహిళల్లో ఆర్థిక విశ్వాసాన్ని నాటి.. ‘లక్ష్మీ’కళను తెప్పిస్తున్నారు ప్రీతి. 

ప్రీతి రథి గురించి ఎప్పుడూ ఒక మంచి మాట వినిపిస్తుంటుంది. పందొమ్మిదేళ్లకు పెళ్లయింది ప్రీతికి. అప్పటికి ఏవో కలలు ఉండి ఉంటాయి కదా, వాటన్నిటినీ ఓ చోట కుదురుగా పార్క్‌ చేసి, కొంతకాలం తర్వాత మళ్లీ వెళ్లి ఆ స్టాండ్‌లోంచి తన కలలన్నిటినీ బయటికి తీశారని! ప్రస్తుతం ఆమెకు నలభై తొమ్మిదేళ్లు. పెళ్లయిన తొలి ఏళ్లలోనే చదవాలనుకున్నది చదివారు. చేయాలనుకున్నది చేశారు. ఇప్పుడామె రెండు మూడు కంపెనీలకు అధిపతి.

‘ఇష్కా ఫిల్మ్స్‌’ ఆమెదే. ‘ఆనంద్‌ రథి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఇక ముంబైలోని ఆమె మరో సొంత కంపెనీ ‘లక్ష్మి’.. (ఎల్‌.ఎక్స్‌.ఎం.ఇ.) డబ్బును జాగ్రత్తగా మదుపు చేయడం ఎలా అని మహిళలకు చిట్కాలు చెబుతూ ఉంటుంది. పురుషుల కన్నా, స్త్రీలే డబ్బును చక్కగా సంరక్షించి, సద్వినియోగ పరచగలరని ప్రీతి తరచు బిజినెస్‌ మీట్‌లలో చెబుతుంటారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో చదివారు తను. స్త్రీకి తొలి నమ్మకమైన స్నేహితురాలు డబ్బే అంటారు ప్రీతి. ఆమెకైతే డబ్బుతోపాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ ఉన్నారు. కవిత్వం, వర్షం! 

‘ఫోర్బ్స్‌ అడ్వయిజర్స్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రతినిధులు ఇటీవల ప్రీతిని ఇంటర్వూ్య చేసినప్పుడు ఆమెను రెండు ప్రశ్నలు అడిగారు. ఒక మహిళగా మీరు మీ జీవితంలో నేర్చుకున్నదేమిటి అనేది ఒక ప్రశ్న. ‘‘డబ్బును మగవాళ్ల కంటే కూడా మహిళలే భద్రంగా పెంచి పెద్ద చేయగలరని తెలుసుకున్నాను’’ అని చెప్పారు ప్రీతి. ఇక రెండో ప్రశ్న.. డబ్బు స్త్రీని ఎలా స్వతంత్రురాలిని చేస్తుందన్నది. ఇందుకు ఆమె చెప్పిన సమాధానం మహిళలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఉంది. ‘‘ఫెమినిజం అంటున్నాం కదా.. అది డబ్బుతోనే వస్తుంది. స్వశక్తితో డబ్బును సంపాదించడం, జాగ్రత్తగా దాచుకోవడం, ఇన్వెస్ట్‌ చేయడం.. ఇవి.. ‘నా జీవితానికి నేనే విధాతను’ అనే ధైర్యాన్ని మహిళకు ఇస్తాయి.

ధైర్యాన్ని అర్థికంగా కలిగి ఉండటమే ఫెమినిజం’’ అన్నారు ప్రీతి! ఏమైనా చేతిలో డబ్బు ఉంటే ఆ ఆత్మవిశ్వాసమే వేరు. దండిగా డబ్బున్న పురుషుడు ఏ దిక్కు ఎక్కడో తెలియనట్లుగా ఉంటాడు. స్త్రీ మాత్రం ఎంతగా డబ్బు ఎక్కువవుతుంటే అంతగా ఆర్థిక క్రమశిక్షణతో ఉంటుంది. ఈ విషయాన్ని కళ్లతో చూసి తెలుసుకున్నారు ప్రీతి. ఆమె కంపెనీకి (లక్ష్మి) ప్రస్తుతం నాలుగువేల మంది మహిళా కస్టమర్‌లు ఉన్నారు. ఏ షేర్లు కొనొచ్చు, వేటిని అమ్మొచ్చు, ఇంకా.. ఎక్కడెక్కడ డబ్బును లాభాల కోసం పెట్టుబడిగా పెట్టొచ్చు అనే సూచనలను, సలహాలను ఆమె వాళ్లకు ఇవ్వడమే కాదు, వాళ్ల దగ్గర్నుంచీ తీసుకుంటుంటారు! మహిళల్లో ఉన్న విశేషం ఇదే అనిపిస్తుంది. నేర్పాల్సిన చోట నేర్పుతారు. నేర్చుకోవలసిన చోట నేర్చుకుంటారు. మదుపు అనే డబ్బు చెట్లు ఎదగడానికి ఈ నైపుణ్యం సరిపోదా! 

పదమూడేళ్ల వయసు నుంచే ప్రీతి ‘బిజినెస్‌ ట్రిప్పులు’ మొదలయ్యాయి. తండ్రి ఆనంద్‌ రథి బిజినెస్‌మ్యాన్‌. ఆయన తిప్పేవారు కుటుంబాన్ని.. ముంబై నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వెరావల్‌ (గుజరాత్‌). అలా తనకెంతో ఇష్టమైన వర్షంలో అన్ని ఊళ్లలోనూ తడిచింది ప్రీతి. అక్కడి భాషల, సంస్కృతుల, సంప్రదాయాల జల్లులు అవి. డబ్బు ఎక్కడ ఎలా రొటేట్‌ అవుతోందో తండ్రి లెక్కల్లో, మాటల్లో ఆమెకు తెలిసేది. ఆయన పెద్ద ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌. ఆ అనుభవంతో భర్తను కూడా ‘డబ్బు వ్యాపారం’ లోకి దింపారు ప్రీతి. ‘నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ డెస్క్‌’ అనేదొకటి ఆయన చేత పెట్టించారు. లాభాలు చూపించారు. ఆ వరుసలో.. 2014 లో ఇంట్లో వాళ్లందరికీ షాక్‌ ఇచ్చారు. ‘ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ’ పెట్టబోతున్నట్లు చెప్పారు.

డబ్బు కోసం డబ్బు పెట్టడం తప్ప కళ కోసం డబ్బు పెట్టడం ఆ వంశంలో లేదెప్పుడూ. ఆ ఆసక్తి ఆమెకు బహుశా తల్లివైపు నుంచి వచ్చినట్లుంది. ఇంట్లో అంతా డబ్బు లెక్కల్లో మునిగి తేలుతుంటే, ప్రీతి తల్లి సినిమాల్లోని మంచి మంచి సీన్‌ల గురించి ఇష్టంగా మాట్లాడుతుండేవారట. ప్రీతి ప్రొడక్షన్‌ కంపెనీ ‘ఇష్కా ఫిల్మ్స్‌’ తీసిన మొదటి సినిమా ‘వెయిటింగ్‌’. 2015లో రిలీజ్‌ అయింది. నజీరుద్దీన్‌ షా, కల్కీ కోక్లియన్‌ నటించారు. పిక్చర్‌ బాగుందని పేరొచ్చింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కి కూడా వెళ్లింది. ‘కర్వాన్‌’ కూడా తనదే. 2018లో వచ్చింది. ఇర్ఫాన్‌ ఖాన్, దుల్కర్‌ సల్మాన్, మిథిలా పాల్కర్‌. రోడ్‌ కామెడీ డ్రామా అది. మంచి సినిమా అనిపించుకుంది. ‘‘రేపటి కోసం చూడొద్దు. ఈరోజే చేసెయ్‌. ఈరోజే చెప్పెయ్‌. చేయకుండా, చెప్పకుండా ఏ రోజూ  సంపూర్ణం అవదు’’ అంటారు ప్రీతి. డబ్బు నిర్ణయాలకు, మానవ సంబంధాలకు.. రెండిటికీ ఈ మాటను వర్తింపజేసుకోవచ్చు.
భర్త ప్రదీప్, కూతురు ఐశ్వర్య, కొడుకు కృష్ణవ్‌లతో ప్రీతి 

మరిన్ని వార్తలు