మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్‌

4 Feb, 2021 20:55 IST|Sakshi

కొన్ని క్యాన్సర్స్‌ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. సర్వికల్‌ క్యాన్సర్‌ మహిళల్లో మాత్రమే వస్తుంది. అలాగే రొమ్ముక్యాన్సర్‌ చాలా అరుదుగా పురుషుల్లో కనిపించినా... మహిళల్లోనే అది ఎక్కువ. రొమ్ము క్యాన్సర్‌ అవగాహన కోసం సంక్షిప్తంగా కొన్ని ప్రధాన విషయాలివి.. రొమ్ము క్యాన్సర్‌ క్యాన్సర్లలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది.  అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయన్నమాట. మరీ వివరంగా చెప్పాలంటే 80 ఏళ్లు పైబడ్డ  ప్రతి 10 మందిలో ఒకరికి ఇది తప్పక కనిపిస్తుంది. దీని విస్తృతి ఇంత ఎక్కువ కాబట్టే మహిళల్లో దీని గురించి ఆందోళన కూడా ఎక్కువే. అయినప్పటికీ దీని గురించి అంతగా బెంగపడాల్సినక్కర్లేదు. 

రిస్క్‌ గ్రూప్‌ ఎవరంటే : 

  • కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు
  • రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉన్నప్పుడూ
  • పిల్లలు లేని వాళ్లలో
  • మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే
  • ఐదేళ్లకు పైబడి హార్మోనల్‌ చికిత్స తీసుకుంటూ ఉంటే... 

వీళ్లకు ఈ రకం క్యాన్సర్‌ వచ్చే అవకాశాలెక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్‌ గ్రూపులు పరీక్షలు చేయించుకోవాలి. 
మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది. ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా అర్థమైపోతుంది. లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్‌/గైనకాలజిస్ట్‌ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. 
మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. (చదవండి: వివిధ రకాల క్యాన్సర్లు: లక్షణాలు ఇవే)

చాలా హై రిస్క్‌ ఉంటే... 
కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... వాళ్లకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చేదే లేనిదీ...  జన్యుపరీక్షల ద్వారా– బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జీన్‌ మ్యూటేషన్స్‌ ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఓ చిన్ని రక్తపరీక్ష ద్వారా దీన్ని కనుక్కోవడం చాలా సులభం. మంచి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రొమ్ము క్యాన్సర్‌ విషయంలోనూ ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. 

సర్విక్స్‌ క్యాన్సర్‌... 
దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్‌ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్‌) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్‌ తర్వాత రక్తస్రావం (పోస్ట్‌ కాయిటల్‌ బ్లీడింగ్‌), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. 

మరిన్ని వార్తలు