ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. న్యాయం కోసం సీఎంపై పోటీ

18 Mar, 2021 01:36 IST|Sakshi
కన్నీరు మున్నీరు అవుతున్న ‘వలయార్‌’ సిస్టర్స్‌ తల్లి

అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ సీఎం పినరయి విజయన్‌పై స్వతంత్ర అభ్యర్థిగా ‘వలయార్‌ సిస్టర్స్‌’ తల్లి పోటీ చేస్తున్నారు! నాలుగేళ్ల క్రితం 13, 9 ఏళ్ల వయసున్న ఆమె కూతుళ్లపై అత్యాచారం జరిగింది. రెండు నెలల వ్యవధిలోనే వారిద్దరూ ప్రాణంలేని బొమ్మలై కనిపించారు! నాటి నుంచీ న్యాయం కోసం ఆమె పోరాడుతూనే ఉన్నారు. పోలీసులతో పోరాటం, లాయర్‌లతో పోరాటం, ప్రభుత్వంతో పోరాటం, చివరికి ఇప్పుడు సీఎంతో పోరాటం! ఈ తల్లికి న్యాయం జరుగుతుందా? అదే పనిలో ఉన్నామని, కేసును సీబీఐకి అప్పగించామని కేరళ ప్రభుత్వం అంటోంది. 

మొదట ఆమె ఫిబ్రవరి 27న శిరోముండనం చేయించుకున్నారు. తర్వాత మార్చి 16న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ధర్మదం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండూ కూడా తన న్యాయ పోరాటంలో భాగంగా ఆమె తీసుకున్న నిర్ణయాలే. ఆమె ఒక సామాన్య దళిత మహిళ. దళిత మహిళ అనే కన్నా.. బిడ్డల్ని కోల్పోయిన తల్లి అనాలి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. నాలుగేళ్ల క్రితం ఆ  ఇద్దరు మైనరు కూతుళ్లపై అత్యాచారం జరిగింది. తర్వాత వాళ్లిద్దరూ వాళ్లింట్లోనే దూలాలకు ఉరి వేసుకున్నట్లుగా వేలాడుతూ కనిపించారు. పాలక్కాడ్‌ జిల్లా వాయలూర్‌లో ఉంటుంది ఆ తల్లీకూతుళ్ల కుటుంబం. 2017 జనవరి 13న పెద్ద కూతురు (13), అదే ఏడాది మార్చి 4న చిన్న కూతురు (9) ఆ పెంకుటింటి పైకప్పును అవమానపడిన తమ ముఖాలపై మృత్యువస్త్రంలా కప్పుకున్నట్లుగా కనిపించారు. కానీ అది వాళ్లకై వాళ్లు తీసుకున్న నిర్ణయం, చేసుకున్న పనైతే కాదని తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుస్తోంది.


విషాద స్మృతులు : కూతుళ్ల చెప్పులు, గజ్జెలు

దుఃఖానికి విరామం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ. ఆ తల్లి విలవిల్లాడింది. ఇప్పటికీ ఇంటి పైకప్పును చూసుకుంటూ తల్లడిల్లిపోతూనే ఉంది. రెండు బొమ్మలు ఇంటి పైకప్పులో చిక్కుకున్నట్లుగా ఆమె ఇద్దరు కూతుళ్లు అనుదినం కళ్లకు కనిపిస్తూనే ఉన్నారు. వాళ్లపై అత్యాచారం చేసి, ఉరి వేసి వెళ్లినవారికి శిక్ష పడేలా చేసేందుకు నాలుగేళ్లుగా ఆమె నిద్రాహారాలు మాని, అదే జీవితావసరంగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉంది. అనేక విధాలుగా తన నిస్సహాయ నిరసనలను వ్యక్తం చేసింది. ఆక్రోశంతో శిరోముండనం చేయించుకుంది. ఆఖరి అస్త్రంగా ఇప్పుడు అసెంబ్లీఎన్నికల్లో ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అప్పుడైనా ముఖ్యమంత్రికి తనొకరంటూ ఉన్నట్లు తెలుస్తుందని, తను తెలిస్తే తన కూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుందనీ, దోషుల్ని తప్పించేందుకు పోలీసులు చేసిన అక్రమాల గురించి తెలుస్తుందని ఆమె ఆశ. అంతే తప్ప అధికారం కోసం కాదు. 
 
వలయార్‌ సిస్టర్స్‌కి న్యాయం జరిపించాలని కోరుతూ కొచ్చిలో ప్రదర్శనలు 

మైనర్లు కనుక ఆమె కూతుళ్ల పేర్లు బయటికి చెప్పడానికి లేదు. బాధితురాలు కనుక ఆమె పేరునూ ప్రస్తావించకూడదు. నిర్భయ తల్లిలా విజయం సాధించిప్పుడు, దోషులకు శిక్షపడి వలయార్‌ సిస్టర్స్‌కి న్యాయం జరిగినప్పుడు విజయం సాధించిన తల్లిలా ఆమె పేరు ప్రతిధ్వనించవచ్చు. అప్పటి వరకు ఆమె పేరు ‘అమె’. ఆమె కూతుళ్ల పేర్లు ‘వలయార్‌ సిస్టర్స్‌’. 

‘‘నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాను. ‘దోషులకు శిక్ష పడి తీరుతుంది’ అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకోలేదు. ఒక తల్లిగా ఇప్పటి వరకు న్యాయపోరాటం చేశాను. ఇక రాజకీయ పోరాటం చేస్తాను’’ అని ఆమె అంటున్నారు. పోస్ట్‌మార్టంలో ఇద్దరు పిల్లలూ చనిపోవడానికి ముందు వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. ‘‘మా బంగారు తల్లులను పాడుచేసి, చంపేశారు. వాళ్లది ఆత్మహత్య కాదు’’ అని ఆమె ఫిర్యాదు చేసినట్లే, శవ పరీక్ష నివేదిక కూడా సరిగ్గా వచ్చింది. ఆ తల్లిదండ్రుల తరఫున కేరళ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. అప్పటికప్పుడు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు గత ఏడాది పోలీసు విచారణలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు.

‘‘కొంతమంది పోలీసులు నేరస్థులతో కుమ్మక్కయి కేసును బలహీనపరిచి ప్రమోషన్‌లు పొందారు. సీఎం చూస్తూ ఊరుకున్నారు. ఈ సంగతి ప్రజలకు తెలియాలి. ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లికి ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయలేకపోయారని ప్రజలందరికీ తెలియాలి’’ అని తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆమె అన్నారు. నేరస్థులలో కొందరికి అధికార పార్టీలోని వారితో సంబంధాలు ఉండటంతో కేసు నీరు కారిపోయిందని ప్రతిపక్షాలు మొదట్నుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె.. తన వెనుక ఏ పార్టీవారూ లేరని, తల్లిగా తనకు తాను మాత్రమే ఉన్నానని, అందరు తల్లుల తరఫున ఎన్నికల్లో నిలబడుతున్నానని కూడా ప్రకటించవలసి వచ్చింది. ఎన్నికల్లో తను నిలబడుతున్న కారణాన్ని ఆమె వెల్లడించగానే అధికార పార్టీ తక్షణం స్పందించవలసి వచ్చింది. ‘‘ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలం. ఈ కేసులో ఆమెకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం చేయవలసినదంతా చేసింది. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది’’ అని  న్యాయశాఖ మంత్రి ఎ.కె.బాలన్‌ వివరణ ఇచ్చారు. 

కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులిద్దరూ భవన  నిర్మాణ కార్మికులు. వాళ్లిద్దరూ పనికి వెళ్లినప్పుడు పెద్దకూతురు ఇంట్లో పై కప్పు కొక్కేనికి వేలాడుతూ కనిపించడాన్ని మొదట చూసింది వాళ్ల చిన్న కూతురు. ఇద్దరు మనుషులు ముసుగులు వేసుకుని ఇంట్లోంచి పరుగున వెళ్లడాన్ని కూడా ఆ చిన్నారి చూసింది. తర్వాత చిన్న కూతురు కూడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే దర్యాప్తు బృందానికి సారథ్యం వహించిన పోలీస్‌ ఆఫీసర్‌ ప్రత్యేక పదోన్నతిపై బదలీ అయి వెళ్లారు. ఐదుగురు నిందితులలో ఒకరి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అధ్యక్షులు అయ్యారు. ఆ వరుసలోనే 2019 అక్టోబర్‌లో పోక్సో కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లారు. ఈ జనవరిలో హై కోర్టు.. పోక్సో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి కేసు పునర్విచారణను సీబీఐకి అప్పగించింది. చంపేశారు మొర్రో అంటున్నా వినకుండా ‘అసహజ మరణాలు’ గా పోలీసులు కేసు నమోదు చేసినప్పుడే తమకు న్యాయం జరగదని అర్థమైపోయిందని అంటున్న ఆ తల్లి.. ‘‘ప్రభుత్వం అసహాయుల తరఫున ఉండాలి తప్ప, అధికారం, బలం ఉన్న వారివైపు కాదు’’ అని చేతులు జోడించి చెబుతున్నారు.

మరిన్ని వార్తలు