కరోనా ఉందని మర్చేపోయాను!

7 Oct, 2020 08:25 IST|Sakshi
మార్గరెట్‌ ఫెరియర్‌

లండన్‌:  ఆరు నెలలు దాటిపోయినా ప్రపంచ ప్రజలకు నేటికింకా కరోనాకు భయపడటం పూర్తిగా అలవాటు కాలేదు! బ్రిటన్‌ దిగువసభలో ఎంపీగా ఉన్న 60 ఏళ్ల మార్గరెట్‌ ఫెరియర్‌ అనే ప్రపంచ పౌరురాలైతే మరీ నిర్భయంగా.. లండన్‌ నుంచి ఏడింబరో, ఏడింబరో నుంచి లండన్‌.. ప్రజా రవాణా వాహనాలలో పదిమందితో కలిసి ప్రయాణించి వచ్చి సభలో కూర్చున్నారు. అయితే ఆ సంగతి ఆమె మళ్లీ సభ నుంచి వెలుపలకి వచ్చి మరొకసారి పదిమందితో కలిసి ప్రయాణించినప్పుడు గానీ సభకు తెలియలేదు. కరోనా కాలంలో మార్గరెట్‌ నిర్భయంగా తిరగడం అన్నది ఆమెకు కరోనా లేనట్లయితే తప్పకుండా ఒక విశేషం అయి ఉండేదే. తనకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యాక కూడా ఆమె సభకు రావడం, మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించడంతో అది నిర్భీతి కాక నిర్బాధ్యత అయింది.

బ్రిటన్‌ చట్టం ఇలాంటి బాధ్యతా రాహిత్యాన్ని అస్సలు సహించదు. చట్టం సహించనప్పుడు చట్టసభ సహిస్తుందా?! స్పీకర్‌ ఆమెను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ ఆమెను సస్పెండ్‌ చేసింది. ఆమెది స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ. ఆ పార్టీ ఆమెను తన ఎంపీ పదవికి రాజీనామా చేయమని కూడా కోరింది! ‘సారీ’ చెప్పారు మార్గరెట్‌. సభకు, పార్టీకి, నియోజకవర్గ ప్రజలకీ. నాలుగు వేల పౌండ్‌ల అపరాధ రుసుము చెల్లించారు. ‘నేనిలా చేయకుండా ఉండాల్సింది. కరోనా ఉందని మర్చేపోయాను’ అన్నారు.  ఇంతగా తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా ఆమెపై కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు అవకుండా ఏం పోలేదు. బ్రిటన్‌లో శిక్షలు మెత్తగా ఉన్నా శిక్షల అమలు కఠినంగా ఉంటుంది. మార్గరెట్‌ ఇప్పుడు ఆ కఠినత్వానికి, మృదుత్వానికీ మధ్య కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు