డేటింగ్‌ యాప్‌లో నా ఫొటో యాక్షన్‌ తీస్కోండి

24 Sep, 2020 08:31 IST|Sakshi

కూర్చోవచ్చా? కుర్చీని అడగం. ఆన్‌ చేయొచ్చా? టీవీని అడగం. వేస్కోవచ్చా? బట్టల్ని అడగం. చూస్కోవచ్చా? అద్దాన్ని అడగం. వస్తువుల్ని అడిగేదేముంటుంది? నాన్‌–లింగ్‌ థింగ్స్‌ కదా! రైట్, అడగక్కర్లేదు చెప్పక్కర్లేదు. మరి.. ఆడవాళ్లని?! వాళ్ల పర్మిషన్‌ ఎందుకు తీస్కోం? అడిగేందుకైనా, చెప్పేందుకైనా!

గుండె గుభేల్మనే వయసులో ఏమీ లేరు నుస్రత్‌ జహాన్‌ రూహీ. ముప్పై ఏళ్లు ఉన్నాయి. వయసును పక్కన పెట్టినా, ఆమె ఉన్న స్థాయికి దేనికీ కంగారు పడక్కర్లేదు. లోక్‌సభ ఎంపీ తను. పీఏలు ఉంటారు. పార్టీ పరివారం ఉంటుంది. ఒక్క ఫోన్‌ కొట్టి, ‘అదేంటో చూడు’ అని చెబితే అంతటితో అయిపోతుంది ఎంతటి ఇష్యూ అయినా! కానీ నుస్రత్‌  కలవరపడ్డారు. ఆందోళన చెందారు. ఒక మామూలు ఆడపిల్లలా కలతకు, కోపానికీ గురయ్యారు. డేటింగ్‌ యాప్‌లో తన ఫొటో కనిపించడం అందుకు కారణం. మొదట స్త్రీ. ఆ తర్వాతే ఆమె శక్తిమంతమైన ఒక రాజకీయ నాయకురాలు. నుస్రత్‌కు పెళ్లయింది. భర్తకు ఆ సంగతి తెలిస్తే తన కాపురం కూలిపోతుందని కాదు. పెద్ద బంధుగణం ఉంది. వారికి తెలిస్తే పరువు పోతుందని కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన లీడర్‌గా పేరుంది.

ఆ పేరు పోతుందని కాదు. యువతీయువకుల్లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. వాళ్లలో ఇమేజ్‌ తగ్గుతుందని కాదు. ఒకానొక డేటింగ్‌ యాప్‌లో ఆమె ఫొటో రావడంలో వింత కూడా ఏమీ లేదు. ముక్కూమొహం లేని వ్యాపారులు ఇలా చక్కటి ముక్కూమొహం కలిగిన ప్రముఖుల ఫొటోలతో నలుగురి కంట్లో పడేందుకు ప్రయత్నించడం సాధారణమైన విషయమే. పైగా నుస్రత్‌ సినీతార. గత ఏడాది రాజకీయాల్లోకి రాకముందు వరకు దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు. బెంగాలీ. సామాజిక స్పృహ ఉన్న అమ్మాయి. మమతాబెనర్జీ పిలిచి మరీ సీటిస్తే బసిర్హాట్‌ లోక్‌సభ నియోజవర్గానికి పోటీ చేసి బీజేపీ ప్రత్యర్థి మీద మూడున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. (నా ఫొటో వాడారు: పోలీసులకు నటి ఫిర్యాదు)

సినీ గ్లామర్, పొలిటికల్‌ గ్లామర్‌ రెండూ ఉన్న యువ పార్లమెంటేరియన్‌ నుస్రత్‌. కనుక ఆమె ఫొటోను వాడుకోవడంలో ప్రయోజనమే తప్ప ప్రమాదం ఏమీ ఉండదని ఆ డేటింగ్‌ యాప్‌ భావించినట్లుంది. కానీ అనుమతి తీసుకోకుండా ఫొటోను వాడటం.. అది ఆగ్రహం తెప్పించింది నుస్రత్‌కు. ఫొటో వాడుకుంటున్నాం అని చెప్పాలి. లేదా వాడుకుంటాం అని అడగాలి. రెండూ చేయలేదు!

‘ఫ్యాన్సీ యు’ అనేది వీడియో చాట్‌ యాప్‌. ‘లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చునే కొత్త ఫ్రెండ్స్‌తో కనెక్ట్‌ అవండి’ అనే స్లోగన్‌కు నుస్రత్‌ ఫొటోను వాడింది ఆ యాప్‌. అలా చేసినందుకు వల్ల యాప్‌కి రెండు విధాలైన ప్రయోజనం ఉంటుంది. కొత్తఫ్రెండ్స్‌ని కలుసుకోండి అని స్వయంగా నుస్రత్‌ చెప్పినట్లుగా ఉంటుంది. నుస్రత్‌ వంటి ఆహ్లాదకరమైన యువతులు పరిచయం అవుతారు అని యాప్‌ చెప్పినట్లుగానూ ఉంటుంది. మొత్తానికైతే నుస్రత్‌ కనిపించగానే కళ్లు కాసేపు అక్కడ ఆగిపోతాయి. అయితే, యాప్‌ ఆశించే ఆ ప్రయోజనాలపై నుస్రత్‌ కంప్లయింట్‌ చెయ్యడంలేదు. తన అనుమతి తీసుకోకుండా ఫొటోను వాడినందుకు చర్య తీసుకోవాలని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు కూడా ఒక కంప్లయింట్‌ ఇచ్చారు. దీనికి ఇంత చెయ్యాలా.. అంత స్థాయిలోని మనిషి అని అప్పుడే రాగాలు కూడా మొదలయ్యాయి. కానీ నుస్రత్‌ చేసింది కేవలం ఫిర్యాదు కాదు. ‘చిన్న అభ్యంతరాన్నయినా చూసీ చూడనట్లు వదిలేయొద్దు..’’ అని ఆడపిల్లలకు, మహిళలకు చెప్పడం కూడా! 

కాలేజ్‌లలో కనిపించే దృశ్యమే. అమ్మాయి చేతిలోంచి అబ్బాయి చొరవగా ఫోన్‌ లాగేసుకుంటాడు. ‘టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’ అన్నట్లు. ఆమె అనుమతి లేకుండానే ఆమె తరఫున   నిర్ణయాలు కూడా తీసేసుకుంటాడు. ఆమెకు మాటైనా చెప్పకుండానే సినిమా టికెట్స్‌ తెచ్చేస్తాడు. రావడం వీలవదు అంటే అలుగుతాడు. మళ్లీ అదో టార్చర్‌. ఆడపిల్లను నాన్‌–లివింగ్‌ థింగ్‌గా చూడటమే అది! ఆఫీస్‌లలో కూడా ఈ ధోరణి ఉంటుంది.

పర్సనల్‌ విషయాలలో అడగకుండానే సలహాలు ఇస్తుంటారు. జాగ్రత్తలు చెబుతుంటారు. ‘డూ ఇట్‌’ అని ఆజ్ఞాపిస్తుంటారు. అడగడం, చెప్పడం లేకుండా కొందరైతే ఫుడ్‌ కూడా ఆర్డర్‌ చేసేస్తుంటారు. అమ్మాయిలైనా, ఉద్యోగినులైనా.. వారిని అడగకనే, వారికి చెప్పకనే జరిగేవన్నీ స్నేహం కారణంగానే, సహోద్యోగి అయిన కారణంగానే జరిగేవి అయినా.. అనుమతించదగినవి మాత్రమైతే కాదని నుస్రత్‌ ఫిర్యాదు మేల్కొలుపుతోంది.

మరిన్ని వార్తలు