ఇస్లామ్‌ ధర్మంలో జిల్‌ హజ్‌ నెల ప్రాముఖ్యం..

16 Jul, 2021 07:33 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఇస్లామ్‌ ధర్మంలో జిల్‌ హజ్‌ నెలకు చాలా ప్రాముఖ్యం ఉంది. మొదటి పదిరోజులు ఇంకా  ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడురోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో రమజాన్‌ నెలకు, రమజాన్‌ లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందో అదే విధంగా దైవం జిల్‌ హజ్‌ నెలలోని మొదటి దశకానికి.. అంటే, మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. దైవ కారుణ్యం అపారంగా వర్షించే ఈ రోజులలో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యత కలిగి దైవ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈ దశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు.

అంటే, జిల్‌ హజ్‌ నెల మొదటి పది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు దైవానికి మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే ఎక్కువ ప్రీతికరం అన్నమాట. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం) సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఇందులోని ప్రతిరాత్రి ఆచరించే నఫిల్‌ లు షబేఖద్ర్‌ లో ఆచరించే నఫిల్‌లతో సమానం. అందుకని ఈ రోజుల్లో సత్కార్యాలు ఎక్కువగా ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’, ‘అల్లాహుఅక్బర్‌ ’, ‘అల్‌ హందులిల్లాహ్‌ ’ వచనాలు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి.

నిజానికి ఇవి హజ్‌ ఆరాధన కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగినవారు తప్ప అందరూ హజ్‌ చేయలేరు. కాని అల్లాహ్‌ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం  పొందగలిగే అవకాశాన్ని అందరికీ ప్రసాదించాడు. జిల్‌ హజ్‌ నెల ప్రారంభమవుతూనే, తమ తమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళవద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్‌ ఖుర్బానీలోని రహస్యం. హజ్‌ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్‌ హజ్‌ మాసం పదవ తేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు.

స్థోమత లేని కారణంగా హజ్‌ యాత్రకోసం మక్కా వెళ్ళలేకపోయిన ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్‌’ ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో.. అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోరు, క్షవరం చేయించుకోరు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరించాలన్నమాట. ఈ విధంగా జిల్‌ హజ్‌ నెల మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన కారుణ్యాన్ని పొందడానికి శక్తివంచనలేని కృషి చేయాలి. మక్కావెళ్ళి హజ్‌ ఆచరించే అంతటి స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్‌ అజ్‌ హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే దైవం తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. కనుక హజ్‌ పరమార్ధాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్‌ అజ్‌ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహ పరలోకాలలో సాఫల్యం పొందవచ్చు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు