బలమైన కుటుంబంతో బలమైన సమాజం

15 Feb, 2021 06:58 IST|Sakshi

మానవజాతి మనుగడకు కుటుంబం పునాది. భార్యాభర్తల అనుబంధం ద్వారా కుటుంబం ఉనికిలోకొస్తుంది. ఈ అనుబంధమే కౌటుంబిక వ్యవస్థ పునాదులను పటిష్ట పరుస్తుంది. దానిద్వారా సమాజం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలి. ఆ బంధం పటిష్టంగా లేకపోతే సంసార నావ ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల బంధమే దీన్ని సురక్షితంగా కాపాడగలుగుతుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. సర్దుకు పోవడమే సంసార రహస్యం.

అలకలు, గిల్లికజ్జాలు, బతిమాల్పులు సహజం. ఐక్యత, ప్రేమ, అనురాగం, సహనం, త్యాగం తదితర సుగుణాల మేళవింపే కుటుంబం, సంసారం. కాని, నేడు అన్ని రంగాలూ కలుషితమైనట్లుగానే కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయింది. తద్వారా సమాజం ప్రభావితమై, సామాజిక అసమానతలకు, విచ్చిన్నతకు దారితీస్తోంది. బంధాలు అనుబంధాలు అపహాస్యం పాలవుతున్నాయి. ఈ విధంగా కుటుంబంలో, సమాజంలో ఆత్మీయత, మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి.

‘తల్లిదండ్రుల పట్ల సత్‌ ప్రవర్తనతో మెలగమని, వారి సేవచేయాలని మేము మానవుణ్ణి ఆదేశించాము. అతని తల్లి బాధపై బాధను భరిస్తూ అతణ్ణి కడుపులో పెట్టుకొని మోసింది. అతణ్ణి పాలు మరిపించడానికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. కనుక నాపట్ల కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతగా మసలుకో. చివరికి నువ్వు నావద్దకే మరలి రావలసి ఉంది.’ (దివ్యఖురాన్‌ 31 – 14)

హజ్రత్‌ ఆయిషా (రజి) ఉల్లేఖనం ప్రకారం: ‘మీలో ఎవరైతే మీ కుటుంబంతో మంచిగా మసలుకుంటారో వారే ఉత్తములు.’ అన్నారు ప్రవక్త మహనీయులు. కుటుంబ సభ్యులు, బంధుగణంతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే బంధాలు బలపడతాయి. కుటుంబ వ్యవస్థ, తద్వారా సమాజం బలోపేతమవుతుంది.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు