బైక్‌ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు

5 May, 2021 11:26 IST|Sakshi

అబ్బాయిలకు తామేమీ తీసిపోమంటున్నారు నేటి యువతులు. ఈ కోవలోనే ముంబైకి చెందిన విశాఖ మరో అడుగు ముందుకేసి బైక్‌ రైడింగ్‌లో అబ్బాయిలతో పోటీపడుతోంది. దీంతో ఆమెను అందరూ ‘రైడర్‌గర్ల్ విశాఖ’ అని ముద్దుగా పిలుస్తున్నారు. దేశంలోనే తొలి మహిళ ‘మోటో వ్లాగర్‌’ అయిన విశాఖ కొత్త కొత్త ప్రదేశాలకు బైక్‌మీద వెళ్తూ వీడియోలు తీసి తన యూ ట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో లక్షలమంది ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది. 

రైడర్‌ గార్ల్‌ విశాఖ అసలు పేరు విశాఖ ఫుల్‌సుంగి. ముంబైలో పుట్టి పెరిగిన 27 ఏళ్ల విశాఖ పదేళ్లకే సైకిల్‌ తొక్కడం నేర్చుకుంది. 12 ఏళ్లకు స్కూటర్‌ నడిపింది. తన స్నేహితుల్లో ఎక్కువమంది అబ్బాయిలే ఉండడంతో వాళ్లతో కలిసి తిరుగుతూ బైక్‌ నడపడం కూడా నేర్చుకుంది. పద్నాలుగేళ్లు వచ్చేటప్పటికి హీరో హోండా ప్యాషన్‌ బైక్‌ను నడిపింది.

చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూనే...
 కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో.. పదోతరగతి పాసైన తరువాత విశాఖ ముంబైలోని ఓ బేకరీలో నెలకు రెండు వేల రూపాయలు జీతంతో క్యాషియర్‌గా చేరింది. కారణాంతరాల వల్ల 15 రోజులకే ఆ జాబ్‌ మానేసింది. తరువాత షాపింగ్‌ మాల్స్‌ దగ్గర ఉండి, పాంప్లెట్స్‌ పంచటం, వివిధ రకాల ఈవెంట్స్‌లో రోజువారి కూలీగా పనిచేయటం వంటి వాటితో సంపాదించిన దాన్లోనే కొద్ది డబ్బు దాచుకుంది. వాటికి పుస్తెలతాడు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులు జతచేసి, 2015లో బైక్‌ కొనుక్కుంది. ఆ బైక్‌కు కాశిష్‌ అని పేరుపెట్టుకుంది.

A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha)

చిన్నచిన్న జాబ్‌లు చేస్తూనే ఇంటర్నేషనల్‌ బిజినెస్, మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. ఆ తరువాత నుంచి తనెంతో ఇష్టమైన బైక్‌ రేసింగ్‌లలో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఇండియాలో మోటోవ్లాగింగ్‌ చేసేవారు ఎవరూ లేరని లె లుసుకుని మోటో వ్లాగింగ్‌ చేయాలనుకుంది. 2017లో సొంత యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. రోజూ ఏదోఒక ప్రాంతానికి తన బైక్‌ మీద వెళ్తూ.. వీడియోలు తీసి, తరువాత వాటిని ఎడిట్‌ చేసి యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ చేసేది. తొలిసారి అమ్మాయి రైడింగ్‌ వీడియోలు పోస్టుచేయడంతో చాలామంది నెటిజన్లు ఆమె వీడియోలను ఆసక్తిగా చూసేవారు. క్రమంగా వీడియోలు పెరగడంతో ఫాలోవర్స్‌ సంఖ్య ఎనిమిదిన్నర లక్షలకు చేరింది.  

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులు
 బంగాళాఖాతం దాటి అండమాన్‌ దీవుల వరకు ప్రయాణించిన విశాఖ.. మూడుసార్లు లడఖ్, స్పితి, రాజస్థాన్, కన్యాకుమారి, కేరళ, రామేశ్వరం, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలలోని పలుప్రాంతాలను పర్యటించింది. నర్మదా నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఎనిమిదిరోజుల్లో చుట్టి వచ్చింది. రైడర్‌ గార్ల్‌ విశాఖ అని సరిపెట్టుకోకుండా, రెండు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులను సొంతం చేసుకుంది.

విశాఖ మాట్లాడుతూ..‘‘అబ్బాయిలు మాత్రమే నడిపే బైక్‌లను అమ్మాయి నడపడం చూస్తే.. ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు. అటువంటి పరిస్థితుల నుంచి ‘రైడర్‌గర్ల్‌ విశాఖ’గా ఎదిగాను. లడఖ్‌ వెళ్లిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. రైడింగ్‌ చేసేటప్పుడు వివిధ రకాల వాతావరణాలను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఒంటరిగా బైక్‌ నడిపే నాకు కొన్నిసార్లు వసతి సదుపాయం కూడా దొరికేది కాదు.

నేను ప్రయాణించే రహదారులు, కొండలలో టాయిలెట్స్‌ ఉండవు. రాత్రిపూట రైడింగ్‌ అంత సురక్షితం కాదు, అందుకే రైడింగ్‌ చేసే సమయంలో కండీషన్‌లో ఉన్న రైడింగ్‌ గేర్, కొద్దిపాటి ఎమర్జన్సీ మనీ, నా బ్లడ్‌ గ్రూపును బైక్‌ మీద రాయడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబరును మొబైల్‌ స్క్రీన్‌ మీద ఉంచుకోవడం, ట్రాకింగ్‌ యాక్సిడెంట్‌ డివైజ్‌ను నాతో ఉంచుకుంటూ.. నాలుగేళ్లుగా మోటోవ్లాగర్‌గా కొనసాగుతున్నాను’’ అని చెప్పింది. ఆమె మాటలు వింటుంటే అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని అర్థం అవుతోంది.
చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్‌             

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు