‘నిప్పు’లాంటి మనిషి ఒక్క నేస్తం చాలంటాను

13 May, 2021 05:39 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం, ఆయేషా

ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే. హర్షళ పెద్దమ్మాయి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయినప్పుడు తనే అంత్యక్రియలు నిర్వహించింది. ఇప్పుడు తండ్రి! కరోనా తో మే 9 న ఆయన హాస్పిటల్లో చనిపోయారు. హర్షళకు, చెల్లెళ్లకు కరోనా! లేచే పరిస్థితి లేదు. హర్షళ తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి తన తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగలవా అని అడిగింది. ఆయేషా ఆ సమయంలో రంజాన్‌ ఉపవాసాల్లో ఉంది. ‘అలాగే హర్షా..’ అంది. మరి ఆ ‘తుది’ కార్యం?! హర్షళకు ఒక మాట చెప్పి ఆ కార్యాన్నీ తనే సంప్రదాయబద్ధంగా పూర్తి చేసింది! మతాల అంతరాలను చితాభస్మం చేసిన ఆయేషా ఇప్పుడు స్నేహమయిగా సర్వమత దీవెనలకు పాత్రమవుతోంది.

కొల్హాపూర్‌లోని ఆస్టర్‌ ఆధార్‌ హాస్పిటల్‌లో సీనియర్‌ మేనేజర్‌ ఆయేషా. మహారాష్ట్ర ఇప్పుడు ఎలా ఉందో ఎవరూ వినంది కాదు. ఆస్టర్‌ ఆసుపత్రి కూడా అలానే ఉంది! డాక్టర్‌లు, నర్సులతో సమానంగా ఆసుపత్రి సీనియర్‌ మేనేజర్‌గా ఆయేషా మీద పడుతున్న ఒత్తిడి కూడా సాధారణంగా ఏమీ లేదు. ఆప్తుల్ని కోల్పోయిన వారికి ఓదార్పు నివ్వడం, కొన్నిసార్లు ఆ ఆప్తులకు ‘చివరి’ ఏర్పాట్లు చూడటం కూడా ఆమె పనే అవుతోంది. ప్రస్తుతం ఆమె రంజాన్‌ ఉపవాసంలో కూడా ఉన్నారు. నిజానికి ఈ పవిత్ర మాసం ప్రారంభం అయిన నాటినుంచే ఆయేషా, ఆమె కుటుంబ సభ్యులు కొల్హాపూర్‌ నగరంలోని సమాధిస్థలులు, దహన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నవారికి  ఉచితంగా పి.పి.ఇ. కిట్లు పంచి పెడుతున్నారు. ఆ పని మీదే ఈ నెల 9న ఆయేషా పంచగంగ శవ దహనశాలలో ఉన్నప్పుడు డాక్టర్‌ హర్షళావేదక్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.

‘‘ఆయేషా.. నాన్నగారు పోయారు’’ అని చెప్పారు హర్షళ. ఆయన పోయింది ఆయేషా పని చేస్తున్న ఆస్టర్‌ ఆధార్‌ ఆసుపత్రిలోనే. ఆ ముందు రోజే ఆయన్ని కరోనాకు చికిత్సకోసం అక్కడ చేర్పించారు.
ఆయేషా, హర్షళ స్నేహితులు. ఒకే వృత్తిలో ఉన్నవారు. హర్షళ కొల్హాపూర్‌లోనే ఛత్రపతి ప్రమీలారాజే ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్‌ మెడికల్‌ డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయేషాకు ఆమె ఫోన్‌ చేసే సమయానికి హర్షళ కూడా కరోనాతో బాధపడుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా. పైకి లేచే పరిస్థితి లేదు. ఆ సంగతి ఆయేషాకు తెలుసు.
‘‘ఆయేషా.. నాన్నగారికి ఏర్పాట్లు చేయించగలవా?’’ అని అడిగారు హర్షళ.
‘‘తప్పకుండా’’ అని చెప్పారు ఆయేషా.

చనిపోయిన హర్ష తండ్రి సుధాకర్‌ వేదక్‌ వయసు 81 ఏళ్లు. మూడేళ్ల క్రితమే ఆయన భార్య కన్ను మూశారు. ఇక ఆయనకున్నది ముగ్గురు కూతుళ్లు. ఆ సంగతీ ఆయేషాకు తెలుసు. తనే ఆయన భౌతికకాయాన్ని ‘పంచగంగ’కు తెప్పించి దగ్గరుండి మరీ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయించారు. అయితే మరింత దగ్గరగా ఉండవలసిన ప్రధాన కార్యం ఒకటి ఉంటుంది కదా. అక్కడ ఆమె ఆగిపోయారు. అది చేయించవలసిన కార్యం కాదు. చేయవలసిన కార్యం. చితికి నిప్పు పెట్టడం. పెడితే కొడుకు పెట్టాలి. కొడుకు లేకుంటే కూతురు. కానీ ఆయన ముగ్గురు కూతుళ్లు కరోనా బెడ్‌ మీద ఉన్నారు.
హర్షళకు ఫోన్‌ చేశారు ఆయేషా. ‘‘హర్షా, ఎలా?’’ అని.

‘‘నీ చేతుల మీదే కానివ్వు’’ అని హర్షళ అన్నారు.
ఆయేషా అప్పటికప్పుడు పి.పి.ఇ. గౌన్‌ ధరించారు. పురోహితుడు దూరంగా ఉండి.. ఆమె చేతుల మీదుగా ‘జరగవలసిన పని’ని జరిపించారు.
‘‘ఇలా చేసినందుకు మీ ‘వాళ్లు’ , మీ ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?!’ అనే ప్రశ్న ఆయేషాకు..
‘‘అలా ఎలా చేయించావ్, మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందా?!’’ అనే ప్రశ్న హర్షళకు.. ఎదురైంది!
‘‘మేము చేయలేని స్థితిలో ఆయేషాను మా తోబుట్టువనే అనుకున్నాం’’ అని చెప్పారు హర్షళ.
‘‘ఇందులో అనడానికి, అనుకోడానికి ఏముంది?! మనిషికి మనిషి సాయపడటం అన్నది దేవుని ఆదేశమే కదా..’’ అని అన్నారు ఆయేషా.
మూడేళ్ల క్రితం ముంబైలో హర్షళ తల్లి క్యాన్సర్‌తో చనిపోయినప్పుడు హర్షళే ఆమెకు అంతిమ సంస్కారాలు జరిపారు. తండ్రి విషయంలో ఆ అవకాశం లేకుండా పోయింది.
‘‘మా అమ్మానాన్న మమ్మల్ని ఆడపిల్లలమన్న వివక్షతో, పాతకాలపు కట్టుబాట్లతో పెంచలేదు. ఆయేషా మా నాన్నగారికి  దహన క్రియలు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆత్మకు శాంతి కలగకుండా పోదు’’ అని హర్షళ అంటుంటే.. ‘‘నేను స్వీకరించిన నా స్నేహితురాలి బాధ్యతను ఎవరూ హర్షించకుండా లేరు. అలాగైతే మరి కొల్హాపూర్‌ చరిత్రలో ఎన్ని సామాజిక సంస్కరణల ఉద్యమాలు జరగలేదూ..’’ అంటున్నారు ఆయేషా.

మరిన్ని వార్తలు