Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి

14 May, 2021 06:07 IST|Sakshi
అజ్ఞాత ప్రదేశంలో సైనిక శిక్షణ పొందుతున్న ‘మిస్‌’ మయన్మార్‌ హటటున్‌; మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ విజేతగా హటటున్‌

మిస్‌ మయన్మార్‌

మయన్మార్‌ బ్యూటీ క్వీన్‌ హటటున్‌.. జుంటా సైనిక నియంత పాలకులపై సమర శంఖాన్ని పూరించారు! జన్మభూమి విముక్తి కోసం మరణానికైనా తను సిద్ధమేనని ప్రకటించారు. మూడున్నర నెలల క్రితం మయన్మార్‌ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాక మొదలైన తిరుగుబాటు ప్రదర్శనల్లో ఇప్పటివరకు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాకూదని అంటూ.. సైన్యంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధం కమ్మని యువతకు పిలుపునిస్తున్నారు హటటున్‌.

మయన్మార్‌ బ్యూటీ క్వీన్‌ హటటున్‌ 1992లో పుట్టే నాటికే ముప్పై ఏళ్లుగా ఆ దేశం సైనిక పాలనలో ఉంది. పుట్టాక కూడా మరో ఇరవై ఏళ్లు మయన్మార్‌ సైనిక పాలనలోనే ఉంది. మధ్యలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలన తర్వాత మళ్లీ ఇప్పుడు సైనిక పాలన! ఈ మధ్యలోని పదేళ్లలో హటటున్‌ బి.టెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. మోడల్‌ అయ్యారు. సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్‌లో కనిపించారు. మిస్‌ మయన్మార్‌ అయ్యారు. మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ గెలిచారు. జిమ్నాస్టిక్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ‘మిలిటెంట్‌’ అయ్యారు! దేశమాత స్వేచ్ఛ కోసం తుపాకీని చేతికి అందుకున్నారు.

ఇందుకు ఆమెను ప్రేరేపించిన పరిణామాలు ప్రపంచం అంతటికీ తెలిసినవే. నిత్యం ప్రపంచం కళ్లబడుతున్నవే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్‌ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలెన్నుకున్న నేత ఆంగ్‌సాంగ్‌ సూకీని అరెస్ట్‌ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజలెవరూ  ప్రశ్నించడానికి, నిరసన ప్రదర్శనలు చేయడానికి వీధుల్లోకి రాకుండా యుద్ధట్యాంకుల్ని కవాతు చేయించింది. గగనతలంపై నుంచి బాంబులు జారవిడిచింది. సైన్యం కుట్రకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసింది. గర్జించిన గళాలను అణిచివేసింది. ఇప్పటికి 800 మందికి పైగా ప్రదర్శనకారులు నియంత సైన్యం ‘జుంటా’ కాల్పుల్లో అమరులయ్యారు. బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తూ తదిశ్వాస విడిచారు.

ఈ ఘటనలన్నీ హటటున్‌ను కలచివేశాయి. ఆగ్రహోదగ్రురాలిని చేశాయి. అందాలరాణి కిరీటాన్ని పక్కనపెట్టి తుపాకీని చేతబట్టేలా ఆమెను ప్రేరేపించాయి. తనకు జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేకపోతే తన జన్మే వృథా అనే ఆలోచనను ఆమెలో కలిగించాయి.

ఇన్నాళ్లూ హటటున్‌ను ఒక అందాలరాణిగా మాత్రమే చూసిన మయన్మార్‌ యువత అత్యవసర సమయంలో ఆమెనొక పీపుల్స్‌ సోల్జర్‌గా చూసి సైనిక నియంతలపై తమ తిరుగుబాటుకు ఒక దివ్యాస్త్రం దొరికినట్లుగా భావిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న యుద్ధంలో హటటున్‌ ఇచ్చిన పిలుపు వారిలో ధైర్యాన్ని, సమరోత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘తిప్పికొట్టేందుకు సమయం ఆసన్నమైంది. మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఏమిటన్నది కాదు. కలం, కీబోర్డు, ప్రజాస్వామ్య ఉద్యమానికి విరాళాలు ఇవ్వడం.. ఏదైనా సరే. అది ఆయుధమే. విప్లవం విజయం సాధించడానికి ఎవరి వంతుగా వారు పోరాడాలి’’ అని హటటున్‌ సోషల్‌ మీడియాలో విప్లవ నినాదం చేశారు.

ఆ వెంటనే మయన్మార్‌ సైనిక ప్రభుత్వం ఆమెపై నిఘాపెట్టింది. ఆమె ఏ ప్రదేశం నుంచి తిరుగుబాటును రాజేస్తున్నదీ ఇప్పటికే సైన్యం కనిపెట్టిందనీ, ఏ క్షణమైనా ఆమెను రహస్య నిర్బంధంలోకి తీసుకోవచ్చనీ ఐక్యరాజ్యసమితికి వర్తమానం అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి! అయితే సైన్యం బూట్లచప్పుడుకు బెదిరేది లేదని హటటున్‌ అంటున్నారు. ‘‘నా దేశం కోసం నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించడానికైనా నేను సిద్ధమే. ‘విప్లవం అనేది చెట్టుపైనే మగ్గి రాలిపడే ఆపిల్‌ పండు కాదు. ఆ పండును నువ్వే చెట్టుపై నుంచి రాలిపడేలా చెయ్యాలి’ అని చే గువేరా అన్నారు. ఆయన మాటల్ని మదిలో ఉంచుకుంటే మనం విజయం సాధించినట్లే..’’ అని మే 11న ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ఇచ్చిన ఒక పోస్టుతో యువతరంలో విప్లవస్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు హటటున్‌.
∙∙
మయన్మార్‌లోని ప్రధాన నగరం యాంగూన్‌లో ఉండేవారు హటటున్‌. గత ఏప్రిల్‌లో అక్కడి నుంచి తన ఫ్రెండ్‌తో కలిసి అజ్ఞాత ప్రదేశానికి తరలి వెళ్లారు. అక్కడ కారెన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్, యునైటెడ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌లతో కలిసి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. నెలా పదిరోజులు ఆమె ఆ శిక్షణలో ఉన్నట్లు సోషల్‌ మీడియా పోస్ట్‌లను బట్టి తెలుస్తోంది.

మరిన్ని వార్తలు