చెడ్డవాడిగా బతకడం భలే సరదాగా ఉంటుంది.. ఓ ముసుగు మనిషి కథ

11 Dec, 2022 19:01 IST|Sakshi

మిస్టరీ

‘చెడ్డవాడిగా బతకడం భలే సరదాగా ఉంటుంది’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి మరీ మారిన ఓ ముసుగు మనిషి కథ ఇది.జపాన్‌లో హ్యోగో ప్రిఫెక్చర్‌లోని ఆషియా సిటీ మధ్యలో చిన్న కొండపై తమ పాత ఇంటిని కలుపుకుంటూ.. రెండతస్తుల మేడ కట్టుకున్నాడు కట్సుహిసా ఎజాకి(42). గ్లికో ఫుడ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌గా అతడికి మంచి పేరుతో పాటు శత్రువులూ ఎక్కువే. అందుకే ఇంటి తలుపులకు హైటెక్‌ సెకామ్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ని అమర్చుకున్నాడు. పాతింట్లో.. తల్లి యోషీ ఉండేది. కొత్త ఇంటి తాళాల్లో ఒకటి తల్లి దగ్గర మరొకటి భార్య దగ్గర ఉండేవి.

1984 మార్చి 18, రాత్రి ఎనిమిదిన్నర దాటాక వర్షం పడుతుంటే.. ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు యోషీ ఇంట్లోకి చొరబడ్డారు. వాళ్ల చేతుల్లో తుపాకీలు, కత్తులు ఉన్నాయి. టీవీలో మునిగిపోయిన యోషీని.. బెదిరించి.. టెలిఫోన్‌  వైర్స్‌ కట్‌ చేసి.. వాటితోనే కట్టేశారు. నోటికి, కళ్లకి టేప్‌ వేసి.. ఆమె దగ్గరున్న కొత్తింటి తాళం తీసుకుని పరుగుతీశారు.

అప్పటికి కట్సుహిసా.. తన నాలుగేళ్ల కూతురు యుకికోకి, 11 ఏళ్ల కొడుకు ఎట్సురోకి స్నానం చేయిస్తూ బాత్‌రూమ్‌లో ఉన్నాడు. భార్య మికీకో.. మరో ఏడేళ్ల కూతురు మారికోతో కలసి టీవీ చూస్తోంది. బయట నుంచి తాళం తీసి.. మికీకో ఉన్న గదిలోకి వెళ్లి తుపాకీలు గురిపెట్టారు. క్షణాల్లో అక్కడున్న టెలిఫోన్‌  వైర్స్‌ని కట్‌ చేసి.. వాళ్ల కాళ్లు చేతులు కట్టి.. నోటికి ప్లాస్టర్స్‌ వేసి.. కట్సుహిసాని వెతుక్కుంటూ వెళ్లారు.

బాత్‌రూమ్‌లో ఉన్న కట్సుహిసా గుండెకు గన్‌  గురిపెట్టి.. ‘అరవద్దు కాల్చేస్తాను’ అని పిల్లల్ని బెదిరించారు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురి నోటికి, కళ్లకి ప్లాస్టర్స్‌ వేసి.. పిల్లల్ని అక్కడే కట్టిపడేసి.. కట్సుహిసాను లాక్కుపోయారు. ‘త్వరగా కారు తియ్‌’ అనగానే కారు ముందుకు కదలడంతో మరో దుండగుడూ కారులో ఉన్నట్టుగా కట్సుహిసాకి అర్థమైంది. సరిగ్గా పది నిమిషాలకి మికీకో కష్టపడి తనకున్న కట్లు విప్పుకుని, కూతురు మారికోని కూడా విడిపించి.. డైనింగ్‌ హాల్లో ఉన్న ఫోన్‌  నుంచి పోలీసులకు ఫోన్‌  చేసింది. వెంటనే చెక్‌పోస్టుల్లో  క్షుణ్ణంగా తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు.

తెల్లవారుజామున ఒంటి గంటకు, గ్లికో కంపెనీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌.. ఫుజీ ఇంటికి ఒక ఫోన్‌  వచ్చింది. ‘తకాట్సుకిలోని పబ్లిక్‌ టెలిఫోన్‌  బాక్స్‌లోని టెలిఫోన్‌  డైరెక్టరీలో ఓ లేఖ ఉంది, చూడండి’ అని చెప్పి ఫోన్‌  కట్‌ చేశారు. మొదట అంతగా పట్టించుకోని ఫుజీ.. ఎందుకో ఆ వాయిస్‌ తమ యజమాని కట్సుహిసాలాగా అనిపించి.. వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ నిజంగానే ఓ లేఖ ఉంది. ‘కట్సుహిసా ప్రాణాలతో దక్కాలంటే 1 బిలియన్‌ యెన్‌ (రూ. 60 కోట్లు), 100 కిలోల బంగారం సిద్ధం చేసుకోండి. వాటిని ఫుజీ ఇంటి ముందు తెల్లటి కారులో ఉంచి వెళ్లాలి. మేము మళ్లీ ఫుజీకే కాల్‌ చేస్తాం. మీరు ఏ ప్రయత్నం చేసినా మాకు తెలిసిపోతుంది. పోలీసుల్లో మాకు స్నేహితులున్నారు’ అనేది ఆ లేఖ సారాంశం. అది చదవగానే ఫుజీ పోలీసుల దగ్గరకే పరుగుతీశాడు.

తీరా కట్సుహిసా.. అతడి కంపెనీకి చెందిన గిడ్డంగిలోనే బందీ అయ్యాడు. ‘నీ కూతురు మారికో కూడా మా దగ్గరే ఉంది. నువ్వు తప్పించుకుంటే ఆమెను చంపేస్తాం’ అని అబద్ధం చెప్పి బెదిరించారు కూడా. అయితే మార్చి 21 మధ్యాహ్నం గిడ్డంగిలో దుండగులు లేని సమయంలో కట్సుహిసా.. తుప్పుపట్టిన వెనుక డోర్‌ని బలంగా తన్ని దానిలోంచి బయటపడ్డాడు. పోలీసుల సాయంతో సురక్షితంగా కుటుంబాన్ని చేరుకున్నాడు. నేరస్థులు దొరక్కున్నా.. కథ సుఖాంతం అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ కాలేదు.

ఎవరో ఏప్రిల్‌ 10న.. గ్లికో కార్పొరేట్‌ కార్‌ పార్కింగ్‌లోని 3 కార్లకు నిప్పు పెట్టారు. 3 రోజుల తర్వాత ‘ది మాన్‌స్టర్‌ విత్‌ 21 ఫేసెస్‌’ అనే పేరుతో ‘అది మా పనే’ అంటూ ఓ లేఖ వచ్చింది. మే 10న, అదే పేరుతో ‘గ్లికో ఉత్పత్తులను పొటాషియం సైనైడ్‌తో విషపూరితం చేశాం’ అనే మరో బెదిరింపు లేఖ ఫుడ్‌ కార్పొరేషన్‌ కి అందింది. దాంతో ఆ కంపెనీ 21 మిలియన్‌  యెన్‌ లను నష్టపోయింది. మరికొన్ని రోజులకు.. విషపూరిత ఉత్పత్తులను గ్లికో స్టోర్‌ షెల్ఫ్‌లలో ఉంచుతామంటూ లేఖ వచ్చింది. చెప్పినట్లే స్టోర్‌ షెల్ఫ్‌ ముందు ఓ వ్యక్తి సీసీటీవీలో అనుమానస్పదంగా కనిపించాడు.

అతడే మాన్‌ స్టర్‌ అని అంతా నమ్మారు. కానీ ఫుటేజ్‌లో అతడి ముఖం స్పష్టంగా కనిపించలేదు. అలాగే అతడు వచ్చివెళ్లిన ర్యాక్‌లో ఎలాంటి విషపూరిత ఆహారం దొరకలేదు. ‘నేనొక అసంతృప్తితో ఉన్న  గ్లికో ఉద్యోగిని’ అంటూ పోలీసులకూ లేఖలొచ్చాయి. ఆ దిశగానూ విచారణ ఫలించలేదు. జూన్‌  26న ‘మాన్‌ స్టర్‌.. గ్లికోను క్షమిస్తున్నాడు!’ అంటూ వచ్చిన లేఖతో.. ఆ కంపెనీపై వేధింపులు ఆగిపోయాయి. ఆ తర్వాత నుంచి మోరినాగా అనే మరో ఆహార సంస్థకు అలాంటి లేఖల రాక మొదలైంది.

గ్లికో విచారణ తర్వాత మాన్‌ స్టర్‌ ఊరికే బెదిరిస్తున్నాడని ఆ లేఖలను లైట్‌గా తీసుకుంది మోరినాగా సంస్థ. అయితే ‘మోరినాగా ఉత్పత్తుల్లో మేము ప్రత్యేక మసాలా సోడియం సైనైడ్‌ను కలిపాం.. కాబట్టి అది కొంచెం చేదుగా ఉంటుంది’ అంటూ దేశంలోని పిల్లల తల్లులను ఉద్దేశిస్తూ.. మాన్‌స్టర్‌ నుంచి మీడియాకి ఓ లేఖ వచ్చింది. వెంటనే ఫుడ్‌ కార్పొరేషన్‌  రంగంలోకి దిగి.. మోరినాగాకు చెందిన 29 విషపూరిత ఉత్పత్తులను గుర్తించింది. దాంతో వణికిన మోరినాగా.. 50 మిలియన్‌  యెన్‌ లు చెల్లిస్తామని.. వేధింపులు ఆపాలని మాన్‌ స్టర్‌ని వేడుకుంది. ఆ ఆఫర్‌ని అంగీకరించాడు మాన్‌స్టర్‌.

జూన్‌  28న ఆ డబ్బు అందుకోబోతూ.. పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌  చేస్తున్నారని గుర్తించి తప్పించుకున్నాడు. అప్పుడే మాన్‌ స్టర్‌ కళ్లను ఓ అధికారి చూశాడట. అతడి కళ్లు నక్క కళ్లలా ఉండటంతో.. మాన్‌ స్టర్‌.. ఫాక్స్‌–ఐడ్‌ మ్యాన్‌ గా మారాడు. మాన్‌ స్టర్‌ వేధింపులు పెరగడంతో పోలీసుల మీద పై అధికారుల ఒత్తిడి పెరిగిపోయింది. 1985 ఆగస్ట్‌లో షోజీ యమమోటో అనే పోలీస్‌.. మాన్‌ స్టర్‌ని పట్టుకోలేకపోతున్నాననే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మా¯న్‌స్టర్‌ నుంచి చివరిగా ఒకే ఒక్క లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘పోలీసుల్లో మాకు స్నేహితులు ఎవరూ లేరు. యమమోటో ఓ మనిషిలా చనిపోయాడు.

దానికి మేము సానుభూతి తెలుపుతున్నాం. ఇక నుంచి మా వేధింపులను నిలిపేస్తున్నాం. మా పేరుతో మరెవరైనా ఈ నేరాలకు పాల్పడితే అది మేము కాదని గుర్తించండి. మేం చెడ్డవాళ్లం. చెడ్డ వ్యక్తిగా జీవితాన్ని గడపడం సరదాగా ఉంటుంది. ఇట్లు.. 21 ముఖాల రాక్షసుడు’ అనేది అందులోని భావం. అప్పటి నుంచి మాన్‌ స్టర్‌ కనుమరుగు అయిపోయాడు. మాన్‌ స్టర్‌ ఒక గ్రూప్‌కి లీడరా? లేక నిజంగానే 21 మంది కలిసే ఇదంతా చేశారా? అనేది నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు