Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రుల్ని చంపిందెవరు?

21 Aug, 2022 12:35 IST|Sakshi
ßోలీ హోలీ (ప్రస్తుతం) చేతిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటో

ఫ్లోరిడాలో ఇది 1980 నాటి కథ. డోనా కాసాసంటా అనే ఓ మహిళ.. తన కొడుకు, కోడలు, మనవరాలు కనిపించడం లేదంటూ టెక్సాస్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. ‘కొడుకు హెరాల్డ్‌ డీన్‌  క్లౌస్‌ జూనియర్‌.. టీనా గెయిల్‌ లిన్‌  క్లౌస్‌ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారని, వారికి ఓ పాప కూడా పుట్టిందని, పాప పేరు బేబీ హోలీ అని, కొన్ని వారాలుగా వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, తనకు చెప్పకుండా వాళ్లు ఎక్కడికీ వెళ్లరని.. ఇలా ఎన్నో విషయాలు చెబుతూ కేసు నమోదు చేయించింది.

పోలీసులు రంగంలోకి దిగారు. డీన్‌  క్లౌస్‌ టెక్సాస్‌లో వడ్రంగి పని చేసేవాడు. అతడికి మత ఆచారాలు ఎక్కువ. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో ఉన్నప్పుడు.. 1970లో ఒక మతఛాందస బృందంలో సభ్యుడిగా చేరాడు. ఆ బృందం ఆచార నియమాల ప్రకారం సర్వ భోగాలు, పెళ్లి, పిల్లలు, ఆస్తులు ఇలా అన్నింటినీ త్యజించాల్సిన డీన్‌ క్లౌస్‌.. టీనాని పెళ్లి చేసుకుని.. పాపని కని.. టెక్సాస్‌లోని లెవిస్‌విల్లేలోకి మకాం మార్చాడు.

తన జీవితాన్ని రంగుల ప్రపంచంగా మార్చుకున్నాడు. దాంతో మత సమూహం నుంచి కొన్ని బెదిరింపులొచ్చాయి. డీన్‌ వాటిని పట్టించుకోలేదు. అయితే ఉన్నట్టుండి అతడి కుటుంబం కనిపించకుండా పోయింది. ఆ జంట మిస్‌ అవ్వడానికి ముందు.. టూ–డోర్‌ రెడ్‌ బర్గండీ ఏఎంసీ కాంకార్డ్‌ కారుపై తిరిగే వారు. ఆ కారుతోనే వారు మిస్‌ అయ్యారు.

కీలకంగా ఫోన్‌ కాల్‌!
1981 జనవరిలో డోనా కుటుంబం.. ఓ ఫోన్‌ కాల్‌ అందుకుంది. అదేంటంటే.. ‘మేము లాస్‌ ఏంజెలెస్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం.. టీనా, డీన్‌లు మా మత బృందంలో చేరారు.. ఇకపై వారు కుటుంబాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరు. తమ ఆస్తుల్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పమన్నారు. వారి కారు మా వద్దే ఉంది. కావాలంటే దాన్ని మీకు అందిస్తాం.. కానీ కొంత ఖర్చు అవుతుంది’ అని సిస్టర్‌ సుసాన్‌ అనే మహిళ డోనా కుటుంబంతో డీల్‌ మాట్లాడింది.

అందుకు డోనా కుటుంబం సరేనంది. ‘ఫ్లోరిడాలోని డేటోనా రేస్ట్రాక్‌లో.. సిస్టర్‌ సుసాన్‌ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ముందు చేసుకున్న డీల్‌ ప్రకారం నలుగురు వ్యక్తులు కారు ఇవ్వడానికి వచ్చారు. అందులో ముగ్గురు ఆడవారు ఉన్నారని.. వారంతా తెల్లటి వస్త్రాలను ధరించి, చెప్పులు లేకుండా ఉన్నారని.. డోనా కుటుంబం అధికారులకు తెలిపింది. ఆ దిశగా దర్యాప్తు మొదలైంది. ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో 2021 వరకూ ఈ కేసు మిస్సింగ్‌ కేసుగానే మిగిలిపోయింది. కోల్డ్‌ కేసుల సరసన చేరిపోయింది. 

టీనా, డీన్‌ల శవాలు సరే..  బేబీ హోలీ ఎక్కడా?
2021 అక్టోబర్‌లో ఓ షాకింగ్‌ విషయం బయటపడింది. 1981 జనవరిలో హారిస్‌ కౌంటీలోని వాలిస్‌విల్లే రోడ్‌ సమీపంలో హ్యూస్టన్‌ లోని అటవీ ప్రాంతంలో లభించిన ఓ జంట శవాలు.. టీనా, డీన్‌లవని తేలడంతో డోనా కుటుంబం అల్లాడిపోయింది. మరి పసికందు బేబీ హోలీ ఎక్కడా? అనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేకపోయింది. ఆ పాపకు సంబంధించి.. ఒక్క ఆధారం కూడా ఘటనా స్థలంలో దొరకలేదు.

దాంతో ఆనాడు గుర్తుతెలియని నూతన దంపతుల హత్య అని మాత్రమే కేసు నమోదు చేసుకున్నారు. భర్తని కొట్టి, భార్యని పీక కోసి చంపేశారని అప్పుడే తేలింది. కానీ వాళ్లు ఎవరు అనేది అంతుపట్టలేదు. ఏది ఏమైనా బేబీ హోలీ ఏమైంది? ఇదే ప్రశ్నతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మీడియా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించింది. పాప ఫొటోతో ఊహాచిత్రాలు బయటికి వచ్చాయి.

పోలీసులు.. అనాథ పిల్లలు, దత్తత వెళ్లిన పిల్లలు ఇలా 1980–81 చరిత్రను తిరగేశారు. డీఎన్‌ఏ పరీక్షలు విస్తృతంగా నిర్వహించారు. ఈ క్రమంలో 2022 జూన్‌లో.. ఓక్లహోమాలో నివసిస్తున్న 42 ఏళ్ల మహిళే ఈ బేబీ హోలీ అని తేలింది. ప్రపంచం నివ్వెరపోయింది. ఇదెలా సాధ్యం? అని ఆరా తీశారు అధికారులు.

1981లో తెల్లవస్త్రాలు ధరించిన ఓ మత సమూహం.. ఆ పాపని అరిజోనాలోని ఒక చర్చ్‌లో ఇచ్చి వెళ్లారని.. లాండ్రోమాట్‌ దగ్గర పాప దొరికిందని వారు చెప్పారని.. వారంతా సర్వం త్యజించిన శాకాహారులని.. విచారణలో తేలింది. చర్చ్‌ నుంచి ఓ కుటుంబం బేబీ హోలీని దత్తత తీసుకుని పెంచింది. బేబీ హోలీ ప్రస్తుతం అత్తింటితో, పెంచిన కుటుంబంతో మంచి సంబంధాలే కలిగి ఉంది.

అలాగే డోనా కుటుంబాన్ని కలుసుకుంది. అయితే తమ వివరాలు గోప్యంగా ఉంచమంటూ హోలీ కుటుంబం అధికారులని కోరింది. అలాగే దత్తత తీసుకున్న కుటుంబానికీ, ఈ మర్డర్‌ కేసులకి ఏ సంబంధం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికీ డీన్‌ పుట్టిన రోజు నాడే హోలీ దొరకడంతో డోనా కుటుంబం చాలా సంతోషంగా ఉంది.

అయితే టీనా, డీన్‌లను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేదానికి నేటికీ సరైన సమాధానం దొరకలేదు. దాంతో ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలి ఉంది. అరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్‌తో సహా నైరుతి యునైటెడ్‌ స్టేట్స్‌లో ఆ మత సమూహం బిక్షాటన చేసేదని.. ఆ దిశగా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఏది ఏమైనా.. నలభై దశాబ్దాల క్రితం ఒక పసికందుగా మాయమైన బేబీ హోలీ.. ఐదుగురు పిల్లల తల్లిగా తిరిగి ప్రపంచానికి పరిచయం కావడం గమ్మత్తైన విషయం.
-సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు