మిస్టర్‌ క్రూయెల్‌.. 10 నుంచి 15 ఏళ్ల అమ్మాయిలు మాత్రమే టార్గెట్‌

5 Jun, 2022 14:10 IST|Sakshi
కార్మీన్, మిస్టర్‌ క్రూయెల్‌

ఉన్మాదపు కోరల్లో చిక్కి, అన్యాయంగా ముగిసిన జీవితాలను చదివినప్పుడు.. అప్రయత్నంగానే కళ్లు చెమరుస్తాయి. ఏళ్లు గడిచినా.. నాటి ఆక్రందనలు నేటికీ.. నిస్సహాయస్వరంతో స్పష్టంగా వినిపిస్తాయి. కొన్ని ఛాయాచిత్రాలు వాటిని కళ్లకు కడుతుంటాయి. ఆస్ట్రేలియన్‌ విషాదగాథల్లో ఒకటైన కార్మీన్‌ చాన్‌ అనే 13 ఏళ్ల అమ్మాయి కథ అలాంటిదే.

అది 1991 ఏప్రిల్‌ 13. అర్ధరాత్రి కావస్తోంది.. రాత్రి అయితే చాలు.. పది నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలున్న కుటుంబానికి నిద్ర కరువయ్యే రోజులవి. ఆస్ట్రేలియా, టెంపుల్‌స్టోవ్‌లోని ఓ ఇంట్లో అలికిడి మొదలైంది. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఎమర్జెన్సీ డోర్‌ నుంచి లోపలికి చొరబడ్డాడు.  ఆ రోజు ఆ ఇంట్లో జాన్‌ చాన్, ఫిలిస్‌ చాన్‌ దంపతులు.. వారి ముగ్గురు ఆడపిల్లలు నిద్రిస్తున్నారు. నిశబ్దంగా బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టిన ఆ ఆగంతుకుడు.. కావాలనే అలికిడి చేశాడు. ఉలిక్కిపడి లేచిన వాళ్లపై తుపాకీ గురిపెట్టాడు. క్షణాల్లో అందరినీ రాగి తీగలతో కట్టి బంధించాడు. ముగ్గురిలో ఒక బాలికను ఎత్తుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ అమ్మాయి పేరే కార్మీన్‌ చాన్‌.


కార్మీన్‌ తల్లి, సోదరీమణులు 

రోజులు గడుస్తున్నాయి. కార్మీన్‌ చాన్‌ ఆచూకీ మాత్రం దొరకలేదు. కార్మీన్‌ ఫొటోలతో పోస్టర్లు, రివార్డులు అంటూ గాలింపు తీవ్రమైంది. బాలికని ఎత్తుకుని వెళ్లినవాడు మీడియాకి, పోలీసులకి ముసుగు వ్యక్తిగా, ఆస్ట్రేలియన్‌ బూగీమ్యాన్‌ (boogeyman)గా సుపరిచితుడే. అప్పటికే అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయి. పత్రికల్లో, టీవీల్లో.. అప్పటికే అతడిపై ఎన్నో కథనాలు వచ్చాయి. దాంతో ‘నా బిడ్డను దయచేసి విడిచిపెట్టు’ అంటూ మీడియా సమక్షంలో కార్మీన్‌ తల్లి ఫిలిస్‌ చాన్‌.. బూగీమ్యాన్‌ని ప్రాధేయపడింది. ఆ రోజు ఆ తల్లి ఏడ్చిన ఏడుపు చూస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. అప్పుడు ఆమెకు చాలా మంది ఒకే మాట చెప్పారు.. ‘బూగీమ్యాన్‌ తప్పకుండా నీ బిడ్డను విడిచిపెట్టేస్తాడు.. ఎందుకంటే గతంలో ఎంతో మంది పిల్లల్ని అలానే వదిలిపెట్టాడు కదా’ అంటూ జరిగిన కథలను గుర్తుచేశారు.

సరిగ్గా ఏడాది తర్వాత.. 1992 ఏప్రిల్‌ 9న.. థామస్‌టౌన్, పల్లపు ప్రాంతంలోని డంపింగ్‌ యార్డులో కుళ్లిన దేహాన్ని కుక్కలు పీకుతుంటే.. కొందరు గుర్తించారు. అది కార్మీన్‌ మృతదేహమని పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులు తేల్చాయి. ఫిలిస్‌ చాన్‌ రోదనలు మిన్నంటాయి. ఏ ఒక్కరూ ఆమెని ఓదార్చలేకపోయారు. కార్మీన్‌ సమాధి వద్ద మిగిలిన ఇద్దరు ఆడపిల్లలతో.. కూలబడి ఏడ్చే ఫొటో నాటి విషాదాన్ని కళ్లకు కడుతుంది. కార్మిన్‌ తలపై మూడుసార్లు కాల్చినట్లు తేలింది. కానీ ఆ క్రూరుడు మాత్రం దొరకలేదు. నాటి నుంచి ఆ ఆగంతుకుడికి మిస్టర్‌ క్రూయెల్‌ అని పేరు పెట్టింది మీడియా.

మిస్టర్‌ క్రూయెల్‌పైన 1987 ఆగస్ట్‌ 22న మెల్‌బోర్న్‌ ఈశాన్య శివార్లలోని లోయర్‌ ప్లెంటీలోని ఒక ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి, లైంగికదాడి చేసినట్లు తొలిసారి కేసు నమోదైంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలికను విడిచిపెట్టేశాడు. అయితే అతడి చేతిలో కత్తితో పాటు, ముఖానికి నల్ల ముసుగు ఉందని ఆ బాధితురాలు చెప్పింది. దాంతో అప్పట్లో పోలీసులు అతడ్ని పట్టుకోలేకపోయారు. గతంలో అతడు వృద్ధ సన్యాసినులపై లైంగికదాడులకు పాల్పడినట్లూ పలు కేసులున్నాయి.


కార్మీన్‌ తల్లిదండ్రులు 

1988, డిసెంబర్‌లో ఈస్ట్‌ రింగ్‌వుడ్‌లో నివసిస్తున్న 10 ఏళ్ల బాలికను మిస్టర్‌ క్రూయెల్‌ అపహరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్లిన చిన్నారి చీకటిపడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 18 గంటల తర్వాత ఆ చిన్నారి ఆచూకీ లభించింది. అయితే, నిందితుడు అప్పటికే జారుకున్నాడు. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజుల్లోనే మిస్టర్‌ క్రూయెల్‌ మరో బాలికను అపహరించాడు. క్యాంట్‌బ్యరీలో నివసిస్తున్న 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన మిస్టర్‌ క్రూయెల్‌.. రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. సుమారు 50 గంటల తర్వాత ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టాడు. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టిన మిస్టర్‌ క్రూయెల్‌.. కార్మీన్‌ని చంపడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించి ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బహుశా కార్మీన్‌ అతడి ముఖం చూసి ఉంటుంది.. గుర్తు పడుతుందనే భయంతోనే కార్మీన్‌ని చంపేసి ఉంటాడు అనే అంచనాకు వచ్చారు చాలామంది. మొత్తానికి ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన మిస్టర్‌ క్రూయెల్‌ ఎవరు అన్నది నేటికీ తేలలేదు.  ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు కానీ ఫలితం లేదు. అసలు ఈ మిస్టర్‌ క్రూయెల్‌ ఎవరు? అంత ధైర్యంగా ఇళ్లల్లోకి జొరబడి పిల్లల్ని ఎత్తుకుని వెళ్లే సాహసం ఎలా చేయగలిగాడు? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అసలు ఆ ముసుగు మనిషి ఒక్కడేనా? లేక ఒక ముఠాసభ్యులంతా ఇలా ముసుగులేసుకుని నేరాలకు పాల్పడేవారా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు