Mystery: న్యోస్‌ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి!

19 Sep, 2021 11:15 IST|Sakshi

కిల్లర్‌ లేక్‌

టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని వసతులొచ్చినా.. నేటికీ ఏదో ఒక నదినో, సరస్సునో, వాగునో ఆధారంగా చేసుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. సస్యశ్యామలమైన, అహ్లాదకరమైన వాతావరణం కోసం తాపత్రయపడే మనుషులు సాధారణంగా నీరు పుష్కలంగా లభించే పరిసరప్రాంతాలనే ఇష్టపడుతుంటారు. అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరపడాలని కోరుకుంటారు. ఆ కోరికే మధ్య ఆఫ్రికాలోని కామెరూన్‌ వాసుల పాలిట శాపం అయ్యింది. 

మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్‌లో న్యోస్‌ సరస్సు చుట్టూ పల్లెలు పచ్చగా అల్లుకున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు, సమూహాలకు సమూహాలు గుమిగూడి గ్రామాలుగా మారాయి. కానీ ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రి ఊహించని విధంగా శ్మశానాలైపోయాయి. సరస్సు పొంగి ఊళ్ల మీదకు వరదై రాలేదు.. ఎండిపోయి కరువు ఎద్దడులూ తేలేదు. కానీ.. 5,246 ప్రాణాలను బలిగొంది. అసలు ఏం జరిగింది? ఈ వారం మిస్టరీలో..

‘న్యోస్‌ సరస్సు’.. ఉనికిలో లేని అగ్నిపర్వత ముఖద్వారంలో ఏర్పడింది. ఆవాసానికి అనువుగా ఉండటంతో.. చా, న్యోస్, సుబుమ్‌ అనే గ్రామాలు సరసు చుట్టూ ఏర్పడ్డాయి. నీరు పుష్కలంగా ఉండటంతో అక్కడ జనం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 1986లో ఆగస్టు 21న గాఢ నిద్రలో ఉన్న ఆ మూడు గ్రామాల ప్రజలు.. ఇక నిద్రలేవలేదు. మరునాడు ఎక్కడ చూసినా శవాలే. మంచం మీద ఉన్నవారు మంచం మీదే.. బయట ఉన్నవారు బయటే నిర్జీవంగా మారిపోయారు.

పశుపక్ష్యాదులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు మాత్రం.. ‘ఆ రాత్రి తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా గాలి స్తంభించింది. ఏదో ఘాటైన వాసన వచ్చింది. ఆ తర్వాత స్పృహ లేదు’ అని చెప్పుకొచ్చారు. చనిపోయినవారి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కథను మిస్టరీగా మార్చాయి. ఈ విపత్తులో 1,746 మంది ప్రజలతో పాటు.. 3,500 జంతువులు, పక్షులు చనిపోయాయని, రాత్రికి రాత్రి ప్రాణాలు తీసేసిన ఆ గాలి అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యోస్‌ సరస్సు నుంచే వచ్చిందని తేల్చారు.

అసలేం జరిగింది?
ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండి సరస్సుగా మారింది. నీరు చేరినా బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు. ఆ రాత్రి 9 గంటలకు.. రసాయనిక చర్యల్లో భారీ మార్పులు జరిగి.. ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్‌ డై ఆక్సైడ్‌ సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించింది. కొన్ని క్షణాల్లోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది. 25 కిలోమీటర్లుకు పైగా గాలిలో ఆక్సిజన్‌ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ పీల్చిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు.

దీనిపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపిన పరిశోధకుడు డెవిడ్‌ బ్రెస్సెన్‌ నాటి పరిస్థితిని వివరిస్తూ.. ‘నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. న్యోస్‌ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది. కదలిక చోటుచేసుకోవడంవల్లే ఇంత పెద్ద విపత్తు ఏర్పడింది’ అన్నారు. అయితే ఇలాంటì  ఘటనే 1984లో కూడా జరిగింది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో గల మొనౌన్‌ సరస్సు  కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలై 37 మంది మరణించారని చరిత్ర చెబుతోంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే.. న్యోస్‌ ఘటన జరిగుండేది కాదనే విమర్శలూ వెల్లువెత్తాయి. మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు. మొత్తానికి న్యోస్‌ సరస్సు ఓ విషాదంగా మిగిలిపోయింది.
-సంహిత నిమ్మన
చదవండి: బస్‌ నెంబర్‌ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా?

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు