Mystery Room No 1046 Story: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన రోలాండ్‌! అసలేం జరిగింది?

22 May, 2022 12:54 IST|Sakshi

ప్రతీకారమో పశ్చాత్తాపమో కానీ.. ఓ జీవితం ముగిసింది. హత్యనో.. ఆత్మహత్యనో తేలకుండా అనుమానాస్పద కథనంగా మిగిలిపోయింది.

అది 1935 జనవరి 4. అమెరికాలోని కేంజస్‌ సిటీలో నిత్యం అతిథులతో కళకళలాడే ‘ప్రెసిడెంట్‌ హోటల్‌’లో ఊహించని కలకలం మొదలైంది. అంతకు రెండు రోజుల క్రితం రూమ్‌ నం. 1046లో దిగిన రోలాండ్‌ టి. ఓవెన్‌ అనే యువకుడు చావుబతుకుల మధ్య నెత్తురోడుతున్నాడు. గమనించిన హోటల్‌ సిబ్బంది.. మొదటి కాల్‌ అంబులెన్స్‌కి, రెండో కాల్‌ పోలీస్‌ స్టేషన్‌కి చేశారు.

ఆ రూమ్‌ మొత్తంలో ఒక సిగరెట్‌ పెట్టె, పగిలిన గ్లాస్, టెలిఫోన్‌ స్టాండ్‌ మీద దొరికిన ఒక మహిళ వేలిముద్రలు కీలక ఆధారంగా మారాయి. పోలీస్‌ విచారణలో వింత విషయాలు చాలానే బయట పడ్డాయి. రోలాండ్‌ చూడటానికి కాస్త బాడీ బిల్డర్‌లా ఉన్నాడని, బ్లాక్‌ కోట్‌ ధరించిన అతడికి సుమారు 20 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని.. జుట్టు బ్రౌన్‌ కలర్‌లో ఉందని, అతడి తల మీద చాలా గాయాల తాలూక ఆనవాళ్లు ఉన్నాయని, అతడి చెవులు కాస్త భిన్నంగా కిందకు వంగినట్లుగా ఉన్నాయని.. చెప్పుకొచ్చారు అక్కడి సిబ్బంది.

అయితే అతడ్ని మొదటిసారి రూమ్‌కి తీసుకుని వెళ్లిన బెల్‌బాయ్‌ రాండమ్‌ క్రాఫ్ట్‌.. మరో విచిత్రమైన విషయాన్ని చెప్పాడు. రోలాండ్‌ జనవరి 2న మధ్యాహ్న సమయంలో హోటల్‌కి వచ్చాడని, తన వెంట కేవలం ఒక బ్రష్, ఒక పేస్ట్, ఒక దువ్వెన మాత్రమే తెచ్చుకున్నాడని, పైగా రూమ్‌ కావాలని కాకుండా.. కిటికీలు కూడా లేని ఇంటీరియర్‌ రూమ్‌ కావాలని.. ప్రైవసీ ఎక్కువగా ఉండాలని కోరడంతో మేనేజర్‌.. అలాంటి రూమ్‌నే కేటాయించాడని చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగింది?
రోలాండ్‌.. హోటల్‌లో దిగిన రోజు సాయంత్రం రూమ్‌ క్లీన్‌  చేసేందుకు మేరీ సోప్టిక్‌ అతడి రూమ్‌కి వెళ్లింది. అప్పుడు రోలాండ్‌.. డిమ్‌ లైట్‌లో చైర్‌పై కూర్చుని కాస్త భయపడుతున్నట్లుగా కనిపించాడట. రూమ్‌ క్లీన్‌ చేసిన తర్వాత బయటికి రాబోతున్న సోప్టిక్‌తో రోలాండ్‌.. ‘కాసేపట్లో నా స్నేహితుడు వస్తాడు, డోర్‌ లాక్‌ చేయొద్దు’ అని చెప్పాడట.

దాంతో ఆమె డోర్‌ లాక్‌ చేయకుండానే వెళ్లింది. కొద్దిసేపటికి టవల్స్‌ తీసుకుని సోప్టిక్‌ మళ్లీ రోలాండ్‌ రూమ్‌కి వచ్చింది. అప్పుడు రోలాండ్‌ ఒంటినిండా దుప్పటి కప్పుకుని మంచంపై పడుకుని కనిపించాడట. అయితే బల్ల మీద ‘డాన్, నేను పావుగంటలో వస్తా, వెయిట్‌ చేయండి’ అని నోట్‌ రాసిపెట్టాడట. అది చదవిన సోప్టిక్‌ టవల్స్‌ రూమ్‌లో పెట్టి, బయటికి వచ్చేసింది.

ఆ మరునాడు సోప్టిక్‌ మళ్లీ రోలాండ్‌ రూమ్‌ని క్లీన్‌ చేయడానికి వెళ్లినప్పుడు.. తలుపు బయట నుంచి లాక్‌ చేసి ఉండటంతో తన దగ్గరున్న డూప్లికేట్‌ కీ సాయంతో తలుపు తెరిచింది సోప్టిక్‌. రూమ్‌ అంతా చీకటిగా ఉండటంతో, లైట్‌ వేసింది. ఎదురుగా రోలాండ్‌ దిగులుగా కూర్చుని ఉండటం చూసి షాక్‌ అయ్యింది. బయట తలుపు ఎవరు పెట్టారు? అనేది ఆమెకు అర్థం కాలేదు.

షాక్‌ నుంచి తేరుకుని క్లీనింగ్‌ చేస్తున్నప్పుడు రోలాండ్‌ ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతూ.. ‘వద్దు డాన్, నాకు తినాలని లేదు. నేను ఇప్పుడే బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాను’ అని చెప్పాడట. మరునాడు మళ్లీ దుప్పట్లు మార్చేందుకు రోలాండ్‌ రూమ్‌ బెల్‌ కొట్టింది సోప్టిక్‌. అయితే ఈ సారి ఆ రూమ్‌లో రోలాండ్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా ఆమె గమనించింది. ‘మాకు ఏం అవసరం లేదు.. నువ్వు వెళ్లొచ్చు’ అనే గంభీరమైన స్వరం ఒకటి సోఫ్టిక్‌కి వినిపించింది.

అది కచ్చితంగా రోలాండ్‌ స్వరం కాదు అనేది సోఫ్టిక్‌కి తెలుసు. మరోవైపు జనవరి 4 తెల్లవారు జామున రూమ్‌ నంబర్‌ 1048లో ఉంటున్న ఒక మహిళ నుంచి రిసెష్షన్‌కి ఓ కంప్లైంట్‌ వచ్చింది. ‘1046లో ఉంటున్న వాళ్లతో చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. అందులో ఓ మహిళ పెద్దపెద్దగా అరుస్తోంది’ అని ఆమె రిసెప్షన్‌కి కాల్‌ చేసి చెప్పింది. దాంతో వెంటనే రోలాండ్‌ ఉండే రూమ్‌కి ఫోన్‌ ట్రై చేశారు రిసెష్షన్లో‌ పని చేసే సిబ్బంది.

ఫోన్‌ కలవకపోవడంతో టెలిఫోన్‌ కనెక్షన్‌ పోయి ఉంటుందనుకుని.. బెల్‌ బాయ్‌ని రోలాండ్‌ రూమ్‌కి పంపించారు. ఎంత సేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో వెనుదిరిగాడు బెల్‌ బాయ్‌. కొన్ని గంటల తర్వాత మరో బెల్‌ బాయ్‌ రోలాండ్‌ రూమ్‌ దగ్గరకు వచ్చాడు. అతడు ఈసారి బలవంతంగా తలుపు తెరిచి చూశాడు. డోర్‌కి రెండు అడుగుల దూరంలో రోలాండ్‌ మోకాళ్లపై కూర్చుని తలను చేతులతో పట్టుకుని ఉన్నాడు.

ఒంటి నిండా రక్తం కారుతోంది. లైట్‌ ఆన్‌  చేసిన బెల్‌ బాయ్‌.. మంచం మీద, బాత్‌ రూమ్‌లో, గోడలపైనా ఉన్న రక్తం మరకల్ని చూసి భయపడ్డాడు. పరుగున వెళ్లి మేనేజర్‌కి విషయం చెప్పాడు. రోలాండ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్‌లు.. అతడ్ని ఎవరో తీవ్రంగా హింసించారని, ఛాతీలో, ఊపిరితిత్తుల్లో కత్తితో గట్టిగా పొడిచారని.. కుడివైపు మెదడు బాగా దెబ్బతిందని.. కొన్ని గంటల వరకూ ఏం చెప్పలేమని అన్నారు.

దాంతో రోలాండ్‌పై హత్యాయత్నం చేసింది ఎవరంటూ పోలీసులు గట్టిగానే విచారణ మొదలుపెట్టారు. ఇక్కడే మరో ట్విస్ట్‌ కథను ఉత్కంఠగా మార్చింది. రోలాండ్‌ సృహలోకి వచ్చాడు. వెంటనే రోలాండ్‌పై డిటెక్టివ్, పోలీసులు  కలసి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు?’ అని రోలాండ్‌ని అడిగితే.. ‘నన్ను ఎవరూ చంపాలనుకోలేదు.. నేను బాత్‌ రూమ్‌ టబ్‌లో పడిపోయాను. అందుకే దెబ్బలు తగిలాయి’ అని షాకిచ్చాడు రోలాండ్‌.

‘నిజం చెప్పు.. ఎవరూ నీపై దాడి చేయకుంటే.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నావా?’ అనీ ప్రశ్నించారు. ‘లేదు.. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమే’ అని సమాధానమిచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ మరునాడు జనవరి 5న అదే ఆసుపత్రిలో చనిపోయాడు. దాంతో పోలీసులు కేసుని సవాలుగా తీసుకున్నారు. అప్పుడే మరో కీలక సాక్ష్యం బయటపడింది.

ఆ హోటల్‌ ఎలివేటర్‌ ఆపరేటర్‌ చార్ల్స్‌ బ్లాషర్‌.. ‘ఒక మహిళ రూమ్‌ నంబర్‌ 1026 ఎక్కడా? అని నన్ను అడిగింది, తర్వాత ఆమె రోలాండ్‌ రూమ్‌ ముందు తచ్చాడుతూ కనిపించింది, నన్ను చూడగానే కాస్త కంగారుపడి పొరపాటుగా ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి ఆమె మరో వ్యక్తితో కలసి మాట్లాడటం నేను చూశాను’ అని చెప్పాడు. అంతే కాదు ఆ వ్యక్తే డాన్‌ అయి ఉండొచ్చని చార్ల్స్‌ అభిప్రాయపడ్డాడు.

చార్ల్స్‌ చెప్పిందంతా విన్నాక.. రోలాండ్‌ గదిలో దొరికిన మహిళ వేలిముద్రలు ఆమెవే కావచ్చనీ పోలీసులు భావించారు. ఇక పోలీసులు రోలాండ్‌ శవాన్ని ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఊహించిన ఒక ఫోన్‌ కాల్‌.. అతడి మరణం హత్యేనని బలపరచింది. ‘కావాల్సినంత డబ్బు పంపిస్తాను. అతడి అంత్యక్రియలు మాత్రం కేంజస్‌ సిటీ మెమోరియల్‌ పార్క్‌ శ్మశాన వాటికలోనే ఘనంగా జరిపించండి. అక్కడైతే అతడు మా చెల్లెలికి దగ్గరలో ఉంటాడు’ అని ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్పాడు.

అతడు చెప్పినట్లే మార్చి 23న ఒక అజ్ఞాత సెంటర్‌ నుంచి పెద్ద డబ్బు కట్ట  పోలీస్‌ స్టేషన్‌కి వచ్చింది. డబ్బుతో పాటు రాక్‌ ఫ్లవర్‌ కంపెనీ నుంచి కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. వాటి మధ్యలో ‘లవ్‌ ఫరెవర్‌ లూయీ’ అనే నోట్‌ ఉంది. రాక్‌ కంపెనీలో ఆరా తీస్తే.. అక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. ఇక ఈ విషయాన్ని వార్తాపత్రికలు కథలు కథలుగా ప్రచురించాయి.

అలాంటి ఓ కథనాన్ని చదివిన రూబీ ఓగ్లెట్రీ అనే మహిళ.. కేంజస్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ వెతుక్కుంటూ వచ్చింది. రోలాండ్‌ తన కన్నకొడుకు అని.. అతడి అసలు పేరు ఆర్టెమస్‌ ఓగ్లెట్రీ అని చెబుతూ తన కొడుకు తనకు రాసిన లెటర్లు కొన్ని సాక్ష్యంగా చూపించింది. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. రూబీకి వచ్చిన లెటర్స్‌లో కొన్ని రోలాండ్‌ చనిపోయిన తర్వాత తేదీతో ఉన్నాయి. అవన్నీ హ్యాండ్‌ రైటింగ్‌తో కాకుండా టైప్‌ చేసి ఉన్నాయి.

ఇంకో  వార్త పత్రికకు మరో మహిళ ఫోన్‌ చేసి.. ‘వాడు చేసిన తప్పుకు వాడికి తగిన శిక్షే పడింది’ అని చెప్పిందట. ‘ మీరు మాట్లాడేది రోలాండ్‌ గురించేనా అంటే.. ‘అవును’ అని ఫోన్‌ పెట్టేసిందట. అయితే పోలీసులకు ఆ ఫోన్‌ కాల్స్‌పై కూడా ఏ ఆధారం దొరకలేదు. ఆ ఫోన్‌ కాల్స్‌ ఎపిసోడ్‌ తర్వాత..  రోలాండ్‌ అలియాస్‌ ఆర్టెమస్‌ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని, అది తట్టుకోలేక ఆమె చనిపోతే.. ఆమె బంధువులే అతడ్ని మట్టుపెట్టి ఉంటారనే కథా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

మొత్తానికీ రూబీకి లెటర్లు ఎవరు పంపారు? డాన్‌ ఎవరు? 1048 రూమ్‌ నుంచి కంప్లైంట్‌ చేసిన మహిళ చెప్పినట్లు రోలాండ్‌ రూమ్‌లో పెద్దపెద్దగా అరిచిన మహిళ ఎవరు? చనిపోయాక అతడి కోసం డబ్బులు, పువ్వులు ఎవరు పంపిచారు? అసలు లూయీ అంటే ఎవరు? రోలాండ్‌ అసలు పేరు నిజంగానే ఆర్టెమస్సేనా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య అతడి కథ ముగిసింది అనుమానాస్పదంగా!  
-సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు