Ghost Ship Shocking Facts: నిజమే.. ఇది ఓడ కాదు ప్రాణాలు తీసే దెయ్యం! భయంలేని కెప్టెన్‌ కూడా ఆఖరికి..

27 Mar, 2022 11:40 IST|Sakshi

అది సముద్రంపై సాగే సుదూరప్రయాణం. అలల ఉధృతిలో మొదలైన అంతుపట్టని రహస్యం. వింత ఆకారాలు, పిచ్చి చేష్టలతో అనుక్షణం భయానకం. రోజుకో ఆత్మహత్యతో మోగిన మరణమృదంగం.. ఇదే ‘ఇవాన్‌ వాసిలీ షిప్‌’ వణుకుపుట్టించే చరిత్ర. ఇది ఓడ కాదు ప్రాణాలు తీసే దెయ్యం. నిజమే, హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఘోస్ట్‌ షిప్‌ గురించి చరిత్ర కథలు కథలుగా చెబుతోంది.

అందంగా, ఆకర్షణీయంగా
1897లో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో.. తయారుచేసిన ఇవాన్‌ వాసిలీ అనే నౌక.. చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. ఇది బాల్టిక్‌ సముద్రం నుంచి ఫిన్లాండ్‌ గల్ఫ్‌ వరకూ సరుకులను మోసుకెళ్లేది. గంటకు 8 నాటికల్‌ మైళ్ల వేగంతో నడిచే ఈ నౌక.. బొగ్గు సాయంతో 4వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించేది. జోరుగా కదిలే సముద్ర కెరటాల ధాటికి తట్టుకుని ఆరేళ్ల పాటు సరుకులు రవాణా చేస్తూ ఏ సమస్య లేకుండా నడిచింది.

1903లో రష్యా–జపాన్‌ యుద్ధం మొదలైంది. దాంతో అత్యవసర పరిస్థితుల్లో రాత్రికి రాత్రి.. వాసిలీలో సాధారణ సరుకుల్ని తొలగించి.. యుద్ధ సామగ్రిని నింపారు అధికారులు. వ్లాదివోస్తోక్‌లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామగ్రిని అందించేందుకు వాసిలీని రంగంలోకి దింపారు. నాటి నుంచే మొదలైంది అసలైన సమస్య. రాత్రివేళల్లో ఓడలోని సిబ్బందిని ఏవేవో పీడకలలు భయపెట్టేవి.

నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని
యుద్ధ ఆదేశాల ప్రకారం వాసిలీ.. నార్త్‌ సీ నుంచి అట్లాంటిక్‌కు, ఆఫ్రికాలోని వెస్ట్‌ కోస్ట్‌కు.. అటు నుంచి కేప్‌టౌన్‌కు.. అక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలో ఉన్న జాంజిబార్‌కు వెళ్లింది. అప్పటికి నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని గమనించిన సిబ్బంది వెంటనే బొగ్గు నింపారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం వైపు కదిలింది నౌక. అయితే ఉన్నట్టుండి అందులో ప్రయాణిస్తున్న వారికి ఓ అనుమానం వచ్చింది. ఆ నౌక బొగ్గుతో కాకుండా ఏదో అసాధారణ శక్తితో నడుస్తోందని. ఆ అనుమానం వాళ్లను కుదురుగా ఉండనివ్వలేదు.

వారికి వింత అనుభవాలు
చీకటిపడితే చాలు.. నౌకలోని వారంతా ఎవరో తమని గమనిస్తున్నట్లు భయపడేవారు. కళ్లకు కనిపించని శక్తి ఏదో వేగంగా తమ దగ్గరకు వచ్చినట్లు.. ఆ సమయంలో మంచు కొండ పక్కనే ఉన్నట్లుగా చలిపెడుతున్నట్లు ఫీలయ్యేవారు. ఇలా కొన్ని రోజులు నౌకలోని వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు నౌక డెక్‌ దగ్గర్లో ఉన్న వారికి ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడటానికి మనిషిలాగే ఉంది కానీ ధగధగా మెరిసిపోతుంది. క్షణాల్లో అది డెక్‌ అంతటా తిరిగి లైఫ్‌ బోట్‌ వెనక్కి వెళ్లి కనిపించకుండా మాయమైపోయింది. దాంతో వారి భయం రెట్టింపు అయ్యింది.

ఇంతలో నౌక చైనాలోని పోర్ట్‌ అర్థర్‌ మిలిటరీ బేస్‌ చేరింది. అక్కడ నౌకలో సామాగ్రి ఎక్కించుకుని, ప్రయాణం కొనసాగించారు. నాటి నుంచే మొదలైంది మరణమృదంగం. ఆ రాత్రి ఓడలోని వాళ్లంతా ఉన్నట్టుండి, పిచ్చి పట్టినట్లు ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక.. వాళ్లలో ఒకడైన అలెక్‌ గోవిన్స్కీ‌ అనే వ్యక్తి.. తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు.

నౌకను వదిలి పరుగుతీశారు
అది చూసిన మిగిలినవారంతా కళ్లు తిరిగి పడిపోయారు. లేచి చూసేసరికి వ్లాదివోస్తోక్‌ వైపు ప్రశాంతంగా ప్రయణిస్తోంది ఆ నౌక. రెండురోజుల తర్వాత వారంతా మళ్లీ అరవడం, కొట్టుకోవడం, వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కాసేపటికి అంతా కళ్లు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచి చూస్తే వారిలో మరో వ్యక్తి మిస్సయ్యాడు. అదే రోజు నౌక వ్లాదివోస్తోక్‌ చేరింది. అప్పటి దాకా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న నౌకలోని సిబ్బంది నౌకను వదిలి పరుగుతీశారు.

కానీ ఆ పోర్టులో సెక్యూరిటీ రూల్స్‌ పేరుతో వాళ్లను బయటికి పోనీలేదు. వణుకుతున్న ప్రతి వ్యక్తికి స్వాగతం పలికింది వాసిలీ. అందరినీ తీసుకుని హాంకాంగ్‌ వైపు కదిలింది. ఆ రాత్రి మళ్లీ పీడకలలు మొదలయ్యాయి. అరవడం, కొట్టుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం.. ఒకరు మిస్‌ అవ్వడం.. సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఏం జరుగుతుందోనన్న భయంతో ఒక సిబ్బంది గుండె ఆగిపోయింది. నౌక హాంకాంగ్‌ చేరుకునే సరికి కెప్టెన్‌ స్వెన్‌ ఆండ్రిస్ట్‌ సముద్రంలో దూకి చనిపోయాడు.

చివరికి ఓ రాత్రి హాన్సెన్‌ కూడా
దాంతో దెయ్యాలంటే భయం లేని క్రైస్ట్‌ హాన్సెన్‌ అనే సెకండ్‌ ఆఫీసర్‌ని కెప్టెన్‌గా నియమించారు పైఅధికారులు. పారిపోయిన వారిని పారిపోనిచ్చి.. కొత్త సిబ్బందితో కెప్టెన్‌ హాన్సెన్‌ ప్రయాణం సాగించారు. చివరికి ఓ రాత్రి హాన్సెన్‌ తన రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. నౌక సిడ్నీ చేరగానే కొత్త సిబ్బంది కూడా పారిపోయారు. ఆ బోట్‌లో మొదటి నుంచి ఉన్న మరో ధైర్యవంతుడు బోట్స్‌ వాయన్‌ హారీ నెల్సన్‌ మాత్రం పారిపోలేదు. మరో కెప్టెన్‌ను వెతికే పనిలో పడ్డాడు. కెప్టెన్‌ దొరక్క 4 నెలల వరకూ నౌక సిడ్నీలోనే ఉండిపోయింది. 

నాలుగు నెలలకి కొత్త కెప్టెన్‌ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకి బయలుదేరింది. మళ్లీ మరణమృదంగం మోగింది. ఇదేదో తేడాగా ఉందనుకున్న నెల్సన్‌.. నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాదివోస్తోక్‌కి నౌకను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నౌక ఆ నగరాన్ని చేరగానే నెల్సన్‌ సహా అంతా ఆ నౌక నుంచి బయటపడ్డారు. మళ్లీ దాన్లోకి ఎవ్వరూ ఎక్కలేదు. కొన్నినెలల పాటు అది అక్కడే ఉండిపోయింది.

ఆ నౌక అలా ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరమని భావించిన కొందరు ఔత్సాహికులు 1907లో దానికి నిప్పు అంటించారు. కాలి బూడిదై సముద్రంలో మునిగిపోయింది. అయితే మునిగే సమయంలో ఓ భయంకరమైన ఏడుపును విన్నామని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగింది? నిజంగానే ఇదంతా జరిగిందా? అనేదానికి పూర్తి ఆధారాలు లేవు. ఆ మిస్టరీ ఏంటో నేటికీ తేలలేదు.
-సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు