బస్‌ నెంబర్‌ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా?

13 Sep, 2021 17:03 IST|Sakshi

సంహిత నిమ్మన

అపరిష్కృతమైన ప్రతీది మిస్టరీనే కానీ.. కొన్ని మిస్టరీలు వణుకుపుట్టిస్తాయి. నిజమా? అబద్ధమా? అని సందేహించేలోపు ఎన్నో సాక్ష్యాలను ముందుంచి.. నోరువెళ్లబెట్టేలా చేస్తాయి. ఈ స్టోరీ కూడా అలాంటిదే. సుమారు 26 ఏళ్ల కిందట చైనాలో జరిగిన ఈ దుర్ఘటన గురించి.. 

అది 1995 నవంబర్‌ 14 అర్ధరాత్రి. చైనా రాజధాని బీజింగ్‌లోని టెర్మినల్‌ నుంచి ప్రాగ్రాంట్‌ హిల్స్‌కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్‌ 375. నిర్మారుష్యమెన రోడ్డుపైన.. చల్లటి ఈదురుగాలుల మధ్య.. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్‌ రయ్‌ మంటూ సాగిపోతోంది. ఆఖరి బస్సు కావడంతో పెద్దగా ప్రయాణికులు లేరు. డ్రైవర్, కండక్టర్‌తో పాటు బస్సు మొత్తంలో ఒక యువ జంట, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు మాత్రమే ఉన్నారు. కొంత దూరం పోయేసరికి.. కనీకనిపించని చీకటి దారిలో, మలుపుల మధ్యలో కాస్త దూరంగా డ్రైవర్‌కి రెండు నీడలు కనిపించాయి. ఆ ఇద్దరూ బస్‌ ఆపమన్నట్లు చెయ్యి ఊపుతున్నారు. డ్రైవర్‌ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. కారణం అది స్టాప్‌ కాదు. బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. కానీ అదంతా గమనించిన కండక్టర్‌.. ఇదే ఆఖరి బస్సు అని గుర్తు చేసింది. దాంతో డ్రైవర్‌ బ్రేక్‌ వేశాడు.

అయితే ఆ ఇద్దరూ బస్‌ ఎక్కేటప్పుడు మరో వ్యక్తిని భుజాన్నేసుకుని ఎక్కారు. ఆ మూడో వ్యక్తి తల వెంట్రుకలు ముఖాన్ని కప్పేయడంతో ఆ ముఖం కనిపించలేదు. పైగా ముగ్గురూ విచిత్ర వేషధారణలో ఉన్నారు. రాజుల కాలం నాటి బట్టలు వేసుకుని ఉన్నారు. వాళ్ల మొహాలు కూడా తెల్లగా పౌడర్‌ కొట్టినట్లుగా ఉన్నాయి. వారిని చూసిన మిగిలిన నలుగురు ప్యాసింజర్స్‌ భయపడ్డారు. కండక్టర్‌కి ఫిర్యాదూ చేశారు. అయితే కండక్టర్‌ కూల్‌గా.. ‘వాళ్లు ఏ సినిమా.. డ్రామా ఆర్టిస్టులో అయ్యుంటారు.  ఆలస్యం కావడంతో డ్రెస్‌ మార్చుకునే టైమ్‌ కూడా లేక అలానే వచ్చేసి ఉంటారు’ అని సర్ది చెప్పింది. అయినా సరే వాళ్ల వాలకం ప్యాసింజర్స్‌లోని ముసలావిడకు నమ్మశక్యంగా అనిపించలేదు. అనుమానంతో ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉంది. బస్సు వేగం పుంజుకుంది. డ్రైవర్, కండక్టర్‌ ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. 

నాలుగు స్టాప్‌ల తర్వాత ఆ యువజంట బస్‌ దిగిపోయారు. ఆ జంట దిగిన కాసేపటికే ముసలావిడ రచ్చచెయ్యడం మొదలుపెట్టింది. ఆమెకు దగ్గరలో కూర్చున్న యువకుడిపై అరవటం స్టార్ట్‌ చేసింది. ‘నువ్వు నా పర్సు దొంగలించావ్, నేను నీపై ఫిర్యాదు చేస్తాను’ అంటూ తిట్టసాగింది. డ్రైవర్, కండెక్టర్‌ ఎంత నచ్చజెప్పినా∙వినిపించు కోలేదు. ఆ యువకుడు మాత్రం ‘నేను నీ పర్సు తియ్యలేదు’ అని మొరపెట్టుకున్నాడు. అయినా ఆ వృద్ధురాలు ఒప్పుకోలేదు. ‘బస్సు ఆపాల్సిందే.. నువ్వు దిగాల్సిందే.. మనం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాల్సిందే’ అని పట్టుబట్టింది. ఇక లాభం లేదని డ్రైవర్‌ తర్వాత స్టాప్‌లో ఇద్దరినీ దింపేశాడు. వృద్ధురాలి నిందలతో అప్పటికే విసిగిపోయిన ఆ యువకుడు.. ‘పదా వెళ్దాం.. పోలీస్‌ స్టేషన్‌ ఎక్కడా?’ అని అడిగాడు.

బస్సు వాళ్లకు దూరంగా వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక ఆ ముసలావిడ  ‘నువ్వు ఏ దొంగతనం చెయ్యలేదు. నేనే కావాలని అబద్ధం చెప్పాను. నీ ప్రాణాలు కాపాడ్డానికే అలా చేశాను’ అంది. ‘ఏం అంటున్నావ్‌?’ అంటూ షాక్‌ అయ్యాడు యువకుడు. ‘అవును.. నేను నీ ప్రాణాలు కాపాడాను. ఆ ముగ్గురు.. మనుషులు కాదు దెయ్యాలు. గాలికి వాళ్ల బట్టలు పక్కకు జరిగినప్పుడు చూశాను వాళ్లకు కాళ్లు లేవు. అందుకే దొంగతనం నాటకం ఆడాల్సి వచ్చింద’ని అసలు సంగతి చెప్పింది. దాంతో ఆ ఇద్దరూ కలసి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశారు. అయితే పోలీసులు వాళ్లను నమ్మకపోగా పిచ్చివాళ్లని చూసినట్లు చూశారు. 

మరునాడు 375 బస్సు.. ప్రాగ్రాంట్‌ హిల్స్‌కు చేరుకోకపోవడంతో వెదకటం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆ ముసలావిడను, యువకుడ్ని ఆరా తీసింది. జరిగింది చెప్పారు వాళ్లు. రెండు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు ప్రాగ్రాంట్‌ హిల్స్‌కు వంద కిలోమీటర్ల దూరంలో మీయున్‌ రిజర్వాయరులో ఆ బస్సు ఆచూకీ దొరుకింది. అందులో మొత్తం మూడు శవాలు దొరికాయి. డ్రైవర్, కండక్టర్, మూడో శవం ఓ అజ్ఞాత వ్యక్తిది. అయితే ఆ శవాలు దారుణంగా కుళ్లిపోయున్నాయి. పోస్ట్‌మార్టం తర్వాత డాక్టర్లు చెప్పిందేంటంటే.. ‘కేవలం రెండు రోజుల్లో శవాలు అంతగా కుళ్లిపోవటం సాధ్యం కాదు, ఎవరో కావాలని చేశారు’ అని.

లాస్ట్‌ స్టాప్‌ అయిన ప్రాగ్రాంట్‌ హిల్స్‌ దాటి వంద కిలోమీటర్లు ఆ బస్సు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దిశగా విచారణ మొదలుపెట్టారు. అయితే బస్సులో కేవలం లాస్ట్‌ స్టాప్‌కి చేరేందుకు సరిపడే పెట్రోల్‌ మాత్రమే ఉండగా వంద కిలోమీటర్లు ఎలా వెళ్లగలిగిందని పెట్రోల్‌ ట్యాంక్‌ చెక్‌ చేయగా అందులో మొత్తం రక్తమే ఉంది. అది చూసిన పోలీసులు హతాశులయ్యారు. ‘అసలు ఏం జరిగుంటుంద’ని సెక్యూరిటీ కెమెరా టేప్స్‌ (సీసీటీవీ లాంటివి)లను చెక్‌ చేయగా ఏ ఒక్క ఫుటేజ్‌లోనూ బస్సు కనబడటం లేదు. ఈ మూడు మిస్టరీలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు.

ఈ ఘటన తర్వాత చాలా ఏళ్లు ఆ దారిలో వెళ్లాలంటేనే వణికిపోయేవారు అక్కడ జనం. నేటికీ ఈ మిస్టరీని కథలుకథలుగా చెప్పుకుంటూంటారు చైనీయులు. ఇదే నేపథ్యంతో పలు సినిమాలూ వచ్చాయి. అయితే సంప్రదాయ చైనీయుల నమ్మకం ప్రకారం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు ఘోస్ట్‌ మంత్‌ నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వర్గ–నరకాల ద్వారాలు తెరుచుకుంటాయని, ఆత్మలు, దెయ్యాలు తిరుగుతుంటాయని వారి నమ్మకం. వాటిని శాంతింపజేయడానికి ఘోస్ట్‌ ఫెస్టివల్‌ కూడా నిర్వహిస్తుంటారు.
-సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు