ఆమె బతుకును ఎంచుకుంది

13 Jul, 2021 01:10 IST|Sakshi
డాక్టర్‌ మహాలక్ష్మి

జీవించడంలో ఉన్న ఆనందం మరణించడంలో లేదు అంటుంది డాక్టర్‌ మహాలక్ష్మి. ఇటీవల గృహిణులు క్షణికావేశంలో ఆత్మహత్యలను ఎంచుకుంటున్నప్పుడు మహాలక్ష్మి వంటివారి జీవితం సరైన స్ఫూర్తి అనిపిస్తుంది. 26 ఏళ్ల వయసులో యాసిడ్‌ దాడికి లోనైన ఈ మైసూర్‌ వైద్యురాలు జీవించడాన్నే తన మార్గంగా ఎంచుకుంది. కోవిడ్‌ పేషెంట్స్‌కు వైద్యం చేస్తూ తను జీవించి ఉండటానికి ఒక అర్థాన్ని కూడా చెబుతోంది.

ఇంతకన్నా ఏం కావాలి?
మైసూర్‌ ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 50 నుంచి 60 మంది పేషెంట్స్‌ను ఓపిలో చూస్తుంది డాక్టర్‌ మహాలక్ష్మి. కోవిడ్‌ కాలం వచ్చాక ఆమె కోవిడ్‌ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరకాలంగా ప్రాణాలు కాపాడుతోంది. ‘నేను బతికి ఉండటం వల్లే వారిని బతికించగలుగుతున్నాను’ అంటుంది ఆమె. అవును... జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన అన్ని కారణాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాని ఆమె చావును కాకుండా బతుకును ఎంచుకుంది. బతుకులోనే అందం, ఆనందం, పరమార్థం ఉన్నాయని నిశ్చయించుకుంది. బతికి సాధించాలనేది ఆమె తత్త్వం. ఇవాళ కొంతమంది గృహిణులు చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలతో సహా విపరీతమైన నిర్ణయాలను తీసుకోవడం కనిపిస్తూ ఉంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ప్రతికూలతలను ఎదుర్కొనే మనోబలాన్ని పెంచుకోవాలని అంటుంది మహాలక్ష్మి.

2001లో యాసిడ్‌ దాడి
మైసూర్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ చేసిన మహాలక్ష్మి తన 26వ ఏట ఒక అద్దె ఇంటి లో క్లినిక్‌ మొదలెట్టింది. దాని యజమాని చిక్క బసవయ్య ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అది భరించలేని ఆమె పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చి క్లినిక్‌ ఖాళీ చేసి వేరే చోట ప్రారంభించింది. ఇది చూసి ఓర్వలేని చిక్కబసవయ్య జనవరి 11, 2001న ఆమె క్లినిక్‌ మూసి ఇంటికి వెళుతుండగా ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడు. ఆ యాసిడ్‌ దాడి సరిగ్గా ఒక 60 సెకన్లలో ముగిసి ఉంటుంది. కాని అది ఆమె జీవితాన్నే మార్చేసింది.

25 సర్జరీలు
‘ముఖం వికారంగా ఉంటే ఈ సమాజంలో ఆదరణ ఉండదు. అటువంటివారు నాలుగు గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. కాని నేనలా ఉండదలుచుకోలేదు. 25 సర్జరీలు చేయించుకుని ఎంతవరకు ముఖాన్ని సరి చేసుకోగలనో అంత చేయించుకున్నాను. ఆ సమయంలో డిప్రెషన్‌ చుట్టుముట్టింది. బతుకు మీద ఆశ సన్నగిల్లింది. కాని బతకాలనే నిశ్చయించుకున్నాను.

నేను నా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూ ఈ కష్టాన్ని మర్చిపోవాలని అనుకున్నాను. వైద్యవృత్తి అభ్యసించిన నేను నా మానసిక భౌతిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో గట్టిగా ఆలోచించాను. నిజానికి యాసిడ్‌ దాడిలో గాని ఇతర ఏ ఆరోగ్య సమస్యల్లోగాని జీవిత సమస్యల్లో గాని మానసిక బలమే ముఖ్యం అని గ్రహించాను. ఆ మనసును గట్టి చేసుకుంటే మనం కష్టాలు దాటొచ్చు. నేను అదే చేశాను’ అంటుంది మహాలక్ష్మి.

2001లో ఆమెపై దాడి జరిగితే 2005లో సెషన్స్‌ కోర్టు ఆధారాల్లేవని నిందితుణ్ణి వదిలిపెట్టింది. కాని మహాలక్ష్మి హైకోర్టులో పోరాడింది. 2012లో హైకోర్టు చిక్కబసవయ్యకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అంతవరకూ నేను కేసు ను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగింది’ అంటుంది మహాలక్ష్మి.

చదువే శరణ్యం
‘స్త్రీలు బాగా చదువుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదిరించాలంటే మన దగ్గర చదువు ఉండాలి. అప్పుడే మనం మరింత ధైర్యంగా ఉండగలం. అంతేకాదు మనకు జరిగే ఎటువంటి అన్యాయం పైన అయినా పోరాటం చేయగలం. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి’ అంటుంది మహాలక్ష్మి.

‘నేను జీవితంలో ఎన్నడూ నిరాశను దగ్గరకు రానిచ్చేలా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. ఆశతో ఉంటే అన్నీ మారుతాయి’ అంటుంది మహాలక్ష్మి. సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వస్తే మానసిక స్థయిర్యంతో ఎదుర్కొనాలి తప్ప మరణాన్ని ఆశ్రయించకూడదని మహాలక్ష్మి జీవితం గట్టిగా చెబుతోంది.
 
స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి.

మరిన్ని వార్తలు