ఇక్కడితో ఆగిపోవడం లేదు

10 Dec, 2020 00:41 IST|Sakshi

యూఎస్‌లో యాష్లీ జూడ్‌. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్‌ అష్రాఫ్‌! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్‌. ముగ్గుర్లో చిన్న.. నదీన్‌. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది.

నాలుగేళ్ల క్రితం నదీన్‌ అష్రాఫ్‌ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్‌ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్‌కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు.

ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్‌ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు.

లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్‌మెంట్‌. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్‌ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్‌ నటి యాష్లీ జూడ్‌ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్‌ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్‌ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్‌కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే.
∙∙
యూఎస్‌లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అసాల్ట్‌ పోలీస్‌’ అనే పేజ్‌ని నడుపుతూ ఉంది. హాలీవుడ్‌లో హార్వీ వైన్‌స్టీన్‌లా ఈజిప్టులో అహ్మద్‌ బస్సమ్‌ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్‌ పోలీస్‌’లో షేర్‌ చేసుకున్నారు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ని కూడా నదీన్‌ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్‌బుక్‌లో చురుగ్గా ఉండేది.

నదీన్‌ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్‌ బస్సమ్‌ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్‌ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్‌ అప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ,  లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్‌తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్‌లో వైన్‌స్టీన్‌ అరెస్ట్‌ అయినట్లే ఈజిప్టులో అహ్మద్‌ కూడా అరెస్ట్‌ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్‌ గుర్తింపు పొందారు.

నదీన్‌ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్‌ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్‌ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్‌ స్ట్రీట్స్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్‌ అష్రాఫ్‌. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్‌ ఆన్‌లైన్‌ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు.  


తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్‌

మరిన్ని వార్తలు