అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది

27 Aug, 2021 01:20 IST|Sakshi
నదియా గులామ్‌; అబ్బాయిలా..

తాలిబన్లు చెప్పే మాటలు న మ్మకండి. వాళ్లు చేసే ప్రమాణాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీరు మీ కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్‌ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌లో నివసిస్తోన్న అఫ్గాన్‌ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్‌. ప్రస్తుతం నదియా అఫ్గాన్‌లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది.

‘‘నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ మాతృదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు.గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు’’ అని వణికిపోతోంది. నదియా ఇంతగా భయపడడానికి... గతంలో తాలిబన్ల అరాచకాల వల్ల తను అనుభవించిన నరకయాతనలే.  


 తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తున్న రోజులవి. అప్పుడు నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. ఒక బాంబు దాడి కుటుంబాన్నే నాశనం చేసింది. ఇది ఇలా ఉండగా... అదే సమయంలో ‘‘మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు’’ అని తాలిబన్లు హుకుం జారీ చేశారు.

ఒకపక్క అన్నయ్య లేడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా కాదు కదా! అనుకుని బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇలా పదేళ్ల పాటు తన బాల్యాన్ని, గుర్తింపును కోల్పోయి బతికింది.

పదేళ్ల తరవాత ఓ ఎన్జీవో సాయంతో స్పెయిన్‌కు శరణార్థిగా వెళ్లింది. స్పెయిన్‌ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం ‘‘పాంట్స్‌ పర్‌ లా పావ్‌’’ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. అంతేగాక చిన్నతనంలోనే అనేక కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన నదియా అనుభవాలతో ‘‘ద సీక్రెట్‌ ఆఫ్‌ మై టర్బన్‌’’, టేల్స్‌ దట్‌ హీల్డ్‌ మీ’’, ‘‘ద ఫస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది నైట్‌’’ పుస్తకాలను రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది.

తనలా ఇంకెంతమందో...
ఇన్ని కష్టాలు పడిన నదియా ఇప్పటికీ ఆ చీకటిరోజులను మర్చిపోలేక పోతోంది. తాజాగా తాలిబన్లు మరోసారి పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎంతటిదారుణమైన చర్యలకు పాల్పడతారోనని వణికి పోతుంది. తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘‘ప్లీజ్‌ మా దేశానికి గన్స్‌ సరఫరా చేయకండి. నా దేశం గత యాభై ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. అఫ్గాన్‌లో 85 శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నిజంగా మీరు మాకు సాయం చేయాలంటే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మహిళలు చదువుకునేందుకు సహకరించండి’’ అని అంతర్జాతీయ సమాజాన్ని అర్థిస్తోంది. అంతేగాదు, గత పదిరోజులుగా అఫ్గాన్‌ నుంచి ప్రజలను తరలించేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. నిజంగా కష్టాలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుంది అనడానికి నదియా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.  

నదియా గులామ్‌

మరిన్ని వార్తలు