ఆ ఊళ్లో అడుగడుగునా బొమ్మలే కనిపిస్తాయ్‌!..ఎందుకో తెలుసా?

29 Oct, 2023 08:58 IST|Sakshi

జపాన్‌లోని షికోకు దీవి ఇయా లోయ ప్రాంతంలో నగోరో గ్రామం బొమ్మల గ్రామంగా పేరుమోసింది. ఇదేదో బొమ్మల తయారీకి ప్రసిద్ధి పొందిన మన కొండపల్లిలాంటి గ్రామం అనుకుంటే పొరపాటే! ఈ ఊళ్లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండల నడుమ పచ్చని లోయ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న గ్రామంలో ఒకప్పుడు దాదాపు మూడువందల మంది ఉండేవారు. స్థానిక పరిస్థితుల కారణంగా ఇక్కడి జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టి, ఇప్పుడు కేవలం ముప్పయిమంది మాత్రమే మిగిలారు. ఊళ్లో ఉన్నవాళ్లందరూ పెద్దలే! పిల్లలు, యువకులు చాలాకాలం కిందటే ఊరు విడిచి వెళ్లిపోయారు.

పిల్లలెవరూ లేకపోవడంతో ఈ ఊళ్లోని బడి 2012లో మూతబడింది. మరి ఈ ఊళ్లో అడుగడుగునా బొమ్మలెందుకు కనిపిస్తున్నాయంటే, దాని వెనుక ఒక కథ ఉంది. దాదాపు ఇరవయ్యేళ్ల కిందట సుకుమి అయానో తన చిన్నప్పుడే చదువుల కోసం ఊరిని విడిచిపెట్టి వెళ్లింది. కొన్నాళ్లకు ఊళ్లో ఒంటరిగా ఉంటున్న తన తండ్రిని చూడటానికి వచ్చింది. ఇంట్లో ఒక దిష్టిబొమ్మను తయారు చేసి, దానికి తన చిన్నప్పటి దుస్తులు తొడిగి ఇంట్లో పెట్టింది. ఊరి నుంచి వెళ్లిపోయిన మరికొందరి పిల్లల బొమ్మలను, వాళ్ల తల్లిదండ్రులవి కూడా తయారుచేసి, వాళ్ల ఇళ్లల్లో ఉంచింది.

ఇలా ఆమె దాదాపు నాలుగువందల బొమ్మలను తయారుచేసింది. చిన్నప్పుడే ఊరు విడిచి, కొంతకాలానికి ఊరికి వచ్చిన మరికొందరు కూడా ఆమె పద్ధతిలోనే బొమ్మలు తయారు చేసి, తమ గుర్తులుగా గ్రామంలో విడిచిపెట్టారు. మూతబడిన బడిలో కూడా పిల్లల బొమ్మలు, టీచర్‌ బొమ్మలు ఏర్పాటు చేశారు. ఊరి బస్టాండు వద్ద, నది ఒడ్డున కూడా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. జనాభా కంటే ఎక్కువగా బొమ్మలే ఉండటంతో నగోరో గ్రామానికి బొమ్మల గ్రామంగా పేరు వచ్చింది. అప్పుడప్పుడు కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి, ఊరిని చూసి పోతుంటారు. 

(చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం!)

మరిన్ని వార్తలు