అమ్మాయి పేరులోనే ఉన్నది గుర్తింపు

4 Dec, 2020 00:31 IST|Sakshi
తన పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్‌ ఎదుట ఆర్తి

మన సమాజాలలో కూతురి పేరును ఇంటి బయట నేమ్‌ప్లేట్‌గా బిగించడం ఎంత విస్తృతంగా చూస్తాం? చాలా కొన్ని ఇళ్లకి భార్య పేరుతో ఇంటి పేరు పెట్టడం కనిపిస్తుంది. కాని ఎక్కువ ఇళ్లకు భర్త ఉద్యోగాన్ని, హోదాని, ఆ ఇంటి యజమాని ఎవరో తెలిపే వివరాన్ని చెప్పే నేమ్‌ప్లేట్‌లే ఉంటాయి. న్యాయమూర్తులైనా, పోలీస్‌ ఆఫీసర్లైనా, ఐ.ఏ.ఎస్‌లైనా, టీచర్లైనా, వ్యాపారవేత్తలైనా ఎవరైనా సరే వారి పేరు ఇంటి బయట నేమ్‌ప్లేట్‌గా పెట్టుకుంటారు. ఆ ఇళ్లలో భార్య మంచి ఉద్యోగంలో ఉన్నా ఆమె నేమ్‌ప్లేట్‌ కనిపించదు. ఇక ఇంట్లో కూతురు ఉంటే ఆ కూతురికి ఆ ఇల్లు ఎప్పటికీ చెందదనే వారసత్వ భావజాలం తరతరాల్లో ఉంది.

‘ఇలా ఉంటే అమ్మాయి పుడితే బెంబేలు పడే రోజులు ఎలా పోతాయి’ అనుకున్నారు ఉత్తరాంచల్‌ పౌరి గర్వాల్‌ జిల్లా అధికారులు. దానికి కారణం ఉంది. పౌరి గర్వాల్‌ జిల్లా కొండ ప్రాంతం. ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడా పెద్దగా అంటని ప్రాంతమే అయినా మెల్లగా పరిస్థితులు మారాయి. అక్కడ 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1103 మంది స్త్రీలు ఉండేవారు. కాని తాజాగా 0–6 ఏళ్ల వయసు పిల్లల లెక్కలు తీసినప్పుడు వెయ్యి మంది అబ్బాయిలకు 904 మంది అమ్మాయిలే తేలారు. అమ్మాయిల వల్ల ‘పెళ్లి ఖర్చు’ అనేది తల్లిదండ్రుల సమస్య. అమ్మాయి ఏ ఇంట్లో పుట్టినా పెళ్లి తర్వాత ఆమెకు ఆ ఇంటి మీద ఏ హక్కు ఉండదు కదా అని ఆ అమ్మాయిని చేసుకుని వెళ్లేవారి సమస్య. అంటే ఇరువైపుల నుంచి ఆర్థిక విషయంగానే అమ్మాయిని చూసి ఆమె జననాన్ని నిరాకరించే పరిస్థి్థతులు ఏర్పడుతున్నాయి.

నేమ్‌ప్లేట్‌లను పంచుతున్న జిల్లా యంత్రాంగం

‘అమ్మాయి చదవగలదు. మంచి ఉద్యోగం చేయగలదు. తాను స్వావలంబన పొందడమే కాదు... ఇంటిని, సమాజాన్ని కూడా ముందుకు నడపగలదు. ఆమెకు ఆస్తిలో హక్కు ఉంటుంది. అమ్మాయికి ఇంటిలో సమాన వాటా ఉంటుంది అని పదే పదే చెప్తే తప్ప మనుషులు గ్రహించరు’ అని పౌరి గర్వాల్‌ యంత్రాంగం గ్రహించింది. వెంటనే వారొక ఉద్యమాన్ని మొదలెట్టారు. ఆ ఉద్యమం పేరు ‘ఘౌర్‌ కి పచయన్‌... నౌని కి నౌ’. అంటే ‘ఇంటి కూతురిని బట్టి.. ఇంటిని గుర్తించు’ అని అర్థం.

అధికారులు ఈ ఉద్యమం ప్రకారం జిల్లాలోని పల్లెలకు వెళ్లి సొంత ఇల్లు ఉన్న అన్ని కుటుంబాలతో మాట్లాడటం మొదలెట్టారు. ‘మీ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్‌ చేసిస్తాం. మీ ఇంటి బయట తగిలించండి’ అని కోరసాగారు. ఆశ్చర్యకరంగా ముందుగా ఈ ప్రతిపాదనకు తల్లులే స్పందించారు. ‘మా పెద్దమ్మాయి పేరు పెట్టండి’, ‘మా చిన్నమ్మాయి పేరు పెట్టండి’ అని సూచించసాగారు. ఇందుకు తండ్రులు, ఇళ్లల్లో ఉన్న కుమారులు పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు.

‘నా పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్‌ దగ్గర నిలబడి నా ఇంటి ఫొటో దిగడం నాకు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చింది’ మథనా గ్రామానికి చెందిన ఆర్తి చెప్పింది. ఆమె సోషియాలజీలో మాస్టర్స్‌ చేస్తోంది. ‘ఇక మీదట మా ఇంటిని మా నాన్న పేరుతో కాకుండా ఇది ఆర్తీ ఇల్లేనా అని ఎవరైనా అడగాల్సిందే’ అని ఆ అమ్మాయి సంతోషపడింది. ఆర్తికి ఇంటర్‌ చదువుతో మానేసిన తమ్ముడు ఉన్నాడు. ఇంకో చెల్లెలు కూడా ఉంది. ‘ఇది మా ముగ్గురి ఇల్లు అనే భావం ఆ కుర్రాడి మనసులో మొదలయ్యేందుకు ఇలాంటి పనులు తోడ్పడతాయి’ అని ఒక ప్రభుత్వ అధికారి అన్నారు.

మల్లి అనే ఊళ్లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ముకేష్‌ కుమార్‌ ఈ ఉద్యమంలో భాగంగా తన ఇంటికి తన 14 ఏళ్ల కూతురు ‘సిమ్రన్‌’ నేమ్‌ప్లేట్‌ బిగించాడు. ‘పూర్వపు రోజులు పోయాయి. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే’ అని అతడు సంతోషంగా అన్నాడు. అతను ఆ మాట అనడంతోటే పక్కనే ఉన్న సిమ్రన్‌ ‘ఇక నాకు దిగులు పోయింది. నా తల్లిదండ్రులు నన్ను పై చదువులు చదివిస్తారనే భావిస్తున్నా’ అని అంది.

ఉత్తరాంచల్‌లో ఆడపిల్లలకు చదువు, ఉపాధి, కెరీర్‌ను ఎంపికను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఘర్షణతో సాధించుకోవాలి. కాని ప్రభుత్వం చేసే ఇలాంటి పనులు, ఆయా సంస్థలు చేసే చైతన్య కార్యక్రమాలు, మీడియా మార్పును తీసుకురాగలవు. ఇప్పుడు ఉత్తరాంచల్‌లో ఇంటింటా వెలుస్తున్న కూతురి పేర్ల నేమ్‌ప్లేట్లు ఆ సంగతినే చెబుతున్నాయి.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు