తింటూ కూడా నిద్రలోకి జారుకుంటున్నారా?

23 Feb, 2021 08:12 IST|Sakshi

కొందరు కూర్చుని పనిచేస్తూ, కూర్చుని తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. నార్కొలెప్సీ అనే సమస్య ఉన్నవారు పట్టపగలు తాము ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్‌సైకిల్స్‌ కొనసాగుతాయి. కనుపాపలు వేగంగా కదిలే దశను ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఆర్‌ఈఎమ్‌) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్‌ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్‌ తప్ప మిగతా అన్ని కండరాలూ అచేతన స్థితిలో ఉంటాయి.

నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇదమిత్థంగా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనమైపోతాయి. మాటకూడా ముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్‌ స్పెషలిస్టులు  కొన్ని యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్‌ మందులతో దీనికి చికిత్స చే స్తారు.
చదవండి: మొటిమల సమస్యా? మీ కోసమే..

మరిన్ని వార్తలు