క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా?

7 Nov, 2022 07:53 IST|Sakshi

గుంటూరు మెడికల్‌:   పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్‌ వ్యాధి వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు ఉండేవి. అయితే ప్రస్తుతం ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రజల్లో వ్యాధిపై అవగాహన కలి్పంచేందుకు 2014లో నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం ప్రకటించారు. క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియంను పోలాండ్‌ దేశానికి చెందిన మేడం క్యూరీ కనిపెట్టారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా న్యూక్లియర్‌ ఎనర్జీ, రేడియోథెరపీ క్యాన్సర్‌ వైద్య సేవలను ఆమె వృద్ధి చేశారు. ఆమె పుట్టన రోజు నవంబర్‌ 7. దీంతో ప్రతి ఏడాది నవంబర్‌ 7న నేషనల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.  

క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా?  
మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగడం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణ వ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.   

క్యాన్సర్‌ కారకాలు..   
సిగరెట్‌ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటి ద్వారా నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్‌లు వస్తాయి. గుట్కా, పాన్‌పరాగ్‌ వల్ల నోటి క్యాన్సర్, ప్రేగు సంబంధిత క్యాన్సర్‌లు వస్తాయి. మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తింటే నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్‌లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లు వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగలవల్ల క్యాన్సర్‌ రిస్క్‌ 3 నుంచి 4 శాతం ఉంటుంది.   

క్యాన్సర్‌ రాకుండా..  
తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్‌ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్‌ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్‌ లేదా ఫ్రూట్‌ సలాడ్‌ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్‌ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్‌ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును ప్రతి రోజూ తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి.  

జిల్లాలో బాధితులు..   
నాన్‌కమ్యూనకబుల్‌ డిసీజ్‌ ప్రోగ్రామ్‌లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ముక్యాన్సర్, సర్వైకల్‌ క్యాన్సర్, ఓరల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాలో 40 మంది క్యాన్సర్‌ వైద్య నిపుణులు ఉండగా ప్రతి రోజూ వీరి వద్ద 20 నుంచి 30 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. 

అందుబాటులో ఆధునిక వైద్యం  
క్యాన్సర్‌ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా వ్యాక్సిన్‌లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌  నుంచి రక్షణ పొందవచ్చు. వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారు (హైరిస్క్‌) ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లిక్విడ్‌ బయాప్సీ, పెట్‌స్కాన్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రి వంటి అత్యాధునిక వైద్య పద్ధతుల ద్వారా అతి తక్కువ సమయంలో, ప్రాథమిక స్థాయిలోనే పలు రకాల క్యాన్సర్‌లను గుర్తించి నివారించవచ్చు.  
 డాక్టర్‌ ఎంజీ నాగకిషోర్, 
సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్, గుంటూరు   

మరిన్ని వార్తలు