Most Famous Afghanistan Refugee: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి

28 Nov, 2021 03:59 IST|Sakshi
షర్బత్‌ గుల్‌ – నాడు షర్బత్‌ గుల్‌ – నేడు

Nat Geo Green-Eyed Girl, "Most Famous Afghanistan Refugee": పాలనా సంక్షోభం ఏర్పడితే దేశ పౌరుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతుంది. ఇటువంటి నిస్సహాయ పరిస్థితులను 30 ఏళ్ల క్రితం ఎదుర్కొని శరణార్థిగా మారింది అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్‌ గుల్‌. గత నలభై ఏళ్లలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అఫ్గానిస్తాన్‌ మరోసారి తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో..49 ఏళ్ల వయసులో షర్బత్‌ మరోసారి శరణార్థిగా మారింది.

అది అఫ్గానిస్తాన్‌ను జాహీర్‌ షా అనే రాజు పరిపాలించే రోజులు. నలభై ఏళ్లపాటు ఒకే రాజు పరిపాలించడంతో.. విసిగిపోయిన ప్రజలు, అధికారులు.. జాహీర్‌ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్‌ దావుద్‌ ఖాన్‌కు పట్టంగట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త సంస్కరణలు దావూద్‌ అమలు చేసేవాడు. అవి నచ్చని ప్రతిపక్షం రకరకాల కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంది.

ఈ పార్టీ పాలనలో కొన్ని నిర్ణయాలు సొంత సభ్యులకే నచ్చకపోవడంతో.. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అధికారం కోసం కుమ్ములాటలు, కుతంత్రాలతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చతిలో ఎంతో మంది అఫ్గాన్‌లు, సోవియట్‌ సైనికులు మరణించగా, లక్షలాదిమంది దేశం విడిచి వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో షర్బత్‌ కూడా ఒకరు.  
 
80వ దశకంలో పాపులర్‌ ఫోటో..
దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు షర్బత్‌ కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. అప్పుడు షర్బత్‌ వయసు పన్నెండేళ్లు. అఫ్గాన్‌––పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఓ శరణార్థి శిబిరంలో షర్బత్‌ను స్టీవ్‌ మెకెర్రీ అనే అమెరికన్‌ ఫోటోగ్రాఫర్‌ 1984లో చూశాడు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు మెకెర్రీని ఆకర్షించడంతో వెంటనే ఆమె ఫోటో తీశాడు. అప్పటి భీకర యుద్ధవాతావరణ పరిస్థితులన్నీ షర్బత్‌ పచ్చని కళ్లలో ప్రతిబింబించాయి.

దీంతో ఆ ఫోటోను నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజీన్‌ కవర్‌ పేజీపైన 1985లో ప్రచురించారు. ‘‘అఫ్ఘన్‌ గర్ల్‌’’గా షర్బత్‌ ప్రపంచమంతా పాపులర్‌ అయ్యింది. 1980 – 1990 దశకంలో బాగా పాపులర్‌ అయిన ఫోటోలలో అఫ్గాన్‌ గర్ల్‌ ఒకటిగా నిలిచింది. తనకు పాపులారిటి వచ్చిందని షర్బత్‌కు ఏమాత్రం తెలీదు.పెళ్లి తరువాతే తను ఎంత పాపులర్‌ అయ్యిందో తెలుసుకుని ఆ ఫోటోను తీసుకుంది. 2002 వరకు షర్బత్‌ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. మెకెర్రీ మళ్లీ షర్బత్‌ ఆచూకీ తెలుసుకుని..ఎఫ్‌బీఐ అనలిస్టు, ఫోరెన్సిక్‌ విభాగానికి ఇవ్వడంతో.. వారు షర్బత్‌గా నిర్ధారించారు.  
 
పాకిస్థాన్‌లో తలదాచుకుంటోన్న సమయంలోనే 16 ఏళ్ల వయసులో రహ్మత్‌ గుల్‌ను పెళ్లిచేసుకుంది. షర్బత్‌ దంపతులకు నలుగురు పిల్లలు. పాకిస్థాన్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తోన్న షర్బత్‌కు ముఫ్పై ఏళ్ల తరువాత అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అది 2016 షర్బత్‌కు నలభై ఏళ్లు. “తమ దేశంలో నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమంగా నివసిస్తోందన్న ఆరోపణతో షర్బత్‌కు పాక్‌ ప్రభుత్వం.. పదిహేను రోజుల జైలుశిక్ష, లక్షాపదివేల రూపాయల రుసుమును కట్టించి స్వదేశానికి పంపించేసింది.

ఆ సమయంలో అఫ్ఘన్‌ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్‌ ఘనీ... షర్బత్‌ పరిస్థితి తెలుసుకుని, కాబూల్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి అక్కడే కుటుంబంతో నివసిస్తోంది షర్బత్‌. హెపటైటీస్‌ సీతో 2012లో షర్బత్‌ భర్త మరణించడం, ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ అధికారం చేపట్టడంతో ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది.

తాలిబన్‌ల పాలనలో జీవించలేక, ముందుముందు జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించి ఆశ్రయం ఇవ్వాలని ఇటలీ ప్రభుతాన్ని కోరింది. షర్బత్‌ పరిస్థితి అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి షర్బత్‌కు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ ఇప్పుడూ ఆఫ్ఘన్‌ అమ్మాయిలకు భద్రత లేదని, తాజాగా షర్బత్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.  

చదవండి: Mother Shipton Cave Facts: భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..!

మరిన్ని వార్తలు