డియర్‌ పేరెంట్స్‌

17 Jan, 2021 12:15 IST|Sakshi

కొడుకును, కూతురుని సమానంగా పెంచితే రేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకుంటారు. 

‘ఏంటా ఏడుపు ఆడపిల్లలా?’
‘యెస్‌.. నేను అబ్బాయిని అయితే ఏంటి? నాకూ ఏడ్వాలని ఉంటుంది’
‘అమ్మాయిలు కార్లు, బైక్‌ల గురించి  ఆలోచించరు’
‘తప్పు.. కార్లు, బైకుల బొమ్మలతో నాకూ ఆడుకోవాలనుంటుంది’
‘పింక్‌ మా ఇద్దరికీ ఫేవరెట్‌ కలర్‌ అవచ్చు కదా! చిల్‌ ఇట్స్‌ జస్ట్‌ ఏ కలర్‌!’
‘మా ఇద్దరికీ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం.
 ఓడిపోయినా.. కిందపడి కాళ్లు కొట్టుకుపోయినా!’

‘ఇంటి పని నేనూ నేర్చుకోగలను’
‘మా ఇద్దరికీ ఒకే రకమైన కలలు ఉండొచ్చు కదా.. ఆకాశంలో పైపైకి ఎగరాలని.. నడుము తిప్పుతూ డాన్స్‌ చేయాలని.. సూపర్‌ హీరో కావాలని.. స్టయిల్‌గా ఉండాలని..!’
‘మేమిద్దరం ఒకరితో ఒకరం పోటీ పడగలం.. గెలవచ్చు.. ఓడిపోనూవచ్చు. అయితే మాత్రం ఇద్దరిలో ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ కాదు కదా.. ఇద్దరం సమానమే!’
డియర్‌ పేరెంట్స్‌.. ఇవన్నీ ఒప్పుకోవడం మీక్కొంచెం కష్టంగా ఉండొచ్చు. కాని మా మనసులో మాటలవి. కాబట్టి మీరు రూల్స్‌ పెట్టాలనుకుంటే మా ఇద్దరికీ సమానమైన రూల్స్‌ పెట్టండి. మీరు పెరిగినట్టుగా కాకుండా మేం పుట్టినట్టుగా మమ్మల్ని సమంగా పెంచండి.’ ఇది పిల్లల (కూతురు, కొడుకు) వినతి పెద్దలకు. జెండర్‌ ఈక్వాలిటీ మీద ‘ఫ్లిప్‌కార్ట్‌’ యాడ్‌ అది. 

‘జాతీయ బాలికా దినోత్సవం’ అంటే పరోక్షంగా లింగ వివక్షను రూపుమాపే కార్యక్రమం. అబ్బాయిని అమ్మాయి సరసన నిలబెట్టడం. అన్నింట్లో ముందు ఉండాలనే స్ఫూర్తి అమ్మాయికి సహజం. వెసులుబాటు దొరకాలేగానీ అబ్బాయిల అచీవ్‌మెంట్స్‌ను అమ్మాయిలు అలవోకగా అందుకోగలరు. వ్యోమగామిగా రోదసీ యాత్రలో పాలుపంచుకోవడాన్ని ఉదహరించుకోవచ్చు. కాని అమ్మాయిలు చేసే పనులనే అబ్బాయిలు అందుకోవడం లేదు. ఇది అలవాటు చేసి, వాళ్లకు ఆ వెసులుబాటు కల్పించే అవగాహన కోసమే ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ అయినా ‘జాతీయ బాలికా దినోత్సవం’ అయినా! మగపిల్లాడు ఏడ్వాలి.. ఆడపిల్ల విరగబడి నవ్వాలి. వంట పని అమ్మ పేటెంట్‌ కాదు అని అబ్బాయి గ్రహించగలడు. నాన్న సహాయంతో ఇంటి పనీ నేర్చుకోగలడు. సైకిల్‌ వేసుకొని అమ్మాయి బయటి పనులు చక్కదిద్దుకొస్తుంది. నీటి వసతిలేని చోట కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోయడానికి అమ్మాయి చదువును కట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కండబలం ఉన్న కొడుకు ఆ నీళ్లు తేగలడు. కోడిగుడ్లు వంటి పౌష్టికాహారం అమ్మాయికీ కావాలి. ఇంటి పనిలో అబ్బాయికి, ఆస్తిలో అమ్మాయికి వాటాలు ఉండాలి. 

వీటన్నిటి సాధనకు దశాబ్దాలు వేచే సమయం లేదు. గంటలు సెకన్లుగా పరిగెడుతున్న కాలం. ‘తెలియదు’, ‘మా వరకు రాలేదు’ అని తప్పించుకునే వీలున్న వర్తమానం కాదు. సమస్త సమాచారాన్ని,  కనీస అవగాహనను అందరికీ సమంగా పంచుతున్న టెక్నాలజీ యుగం. ఈ నాగరికతలో కుల, మత, వర్ణ, ప్రాంత భేదాలతోపాటు లింగ వివక్షా తీవ్రమైన నేరం, అనాగరికం. ఆ జ్ఞానాన్ని లెక్కచేయక ఛాందసాన్ని అనుసరిస్తూ ఆడపిల్లను అడుగున పెడితే  చక్కదిద్దే బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది. కరోనా బాధితుల్లో మగవాళ్లే ఎక్కువ ఉన్నట్టుగా. మానవజాతి మనుగడకు ప్రాణం పోసేది మహిళే కాబట్టి.. ఆ మహిళలను రక్షించుకోవడం ప్రకృతికి బాగా తెలుసు. అపోహ కాదు ఇది శాస్త్రీయ అధ్యయనాలు రుజువు చేసిన సత్యం. దీన్ని గ్రహించి కొడుకును, కూతురుని సమానంగా పెంచితే రేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకుంటారు.

మరిన్ని వార్తలు