Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్‌ బ్రాండ్‌’..

16 Aug, 2022 03:52 IST|Sakshi

ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్‌ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్‌ డిమాండ్‌ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్‌ చేసేందుకు స్వయానా ఐఏఎస్‌ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్‌ మీడియా ద్వారా వివరిస్తున్నారు.

నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్‌ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్‌ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్‌. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ఛాలెంజ్‌ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్‌ అకౌంట్‌లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది.

సై ్టలిష్‌ లుక్‌లో ఛాలెంజ్‌ చేసిన స్మిత సబర్వాల్‌
చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్‌ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్‌ లుక్‌లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్‌ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్‌ ద్వారా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్‌ విసిరారు. ఇలా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్‌ మీడియాలో సందడి చేశారు.

దేశం మొత్తం ఫిదా
స్మిత సబర్వాల్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్‌ రంజన్, నారాయణఖేడ్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ ప్రమీలా సత్పతి, ఐపీఎస్‌ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్‌ను విసరడం విశేషం.

వీరి ఛాలెంజ్‌లు, డ్రస్సింగ్‌ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైక్‌లు కొడుతూ కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు స్వదేశీ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్‌ను సృష్టించడం అభినందనీయం.

– చైతన్య వంపుగాని, సాక్షి

మరిన్ని వార్తలు