మహిళల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలో నేర్పండి 

27 Mar, 2021 11:29 IST|Sakshi

మ్యాన్స్‌ప్లెయినింగ్‌!

మీరొక మహిళ అయుండి, మీ పేరో లేక మీకు తెలిసిన మహిళ పేరో ‘నవనీత’ అయుండి.. ఆ పేరును అలానే పలకాలా లేక నవ్‌నీత అని పలకాలా లేక ఇంకోలా పలకాలా అని సందేహం వచ్చినప్పుడు మీ దరిదాపుల్లో ఉన్న ఏ పురుషుడినైనా అడిగి డౌట్‌ క్లియర్‌ చేసుకోవచ్చు. పేరు ఒక్కటే కాదు, మీ తీరు ఎలా ఉండాలో కూడా ఎనీ గన్నాయిని అడిగినా వారు చెప్పేస్తారు. అడగకున్నా చెప్పే జ్ఞానధనులు పురుషులు. బై బర్త్‌ ఎందుకనో వాళ్లు అలా నాలెడ్జిబుల్‌ గా ఉంటారు! ‘తిక్కల్‌’ అని మృదువుగా చేతిలోని నాలుగు వేళ్లతో స్త్రీ తలను తడితే చాలు ఇక ఏ మాత్రపు పురుషుడైనా ఆమెకు విషయ దిగ్దర్శనం చేసేయొచ్చు. అలా తనకు మాన్స్‌ప్లెయినింగ్‌ చేయబోయిన అరవింద్‌ అనే ఎంపీకి, నవనీత అనే ఎంపీ తగిన రీతిలోనే సమాధానం ఇచ్చారు. ‘‘సీఎంతో అలాగేనా మాట్లాడేది! నీ బాడీ లాంగ్వేజ్‌ మార్చుకో’’ అని ఆయన. ‘‘ఆడవాళ్ల బాడీల పై ధ్యాస తగ్గించి, నీ లాంగ్వేజ్‌ సరి చేసుకో’ అని నవనీత. చెప్పడానికి అలవాటు పడిన పురుషులు వినడానికి ఇష్టపడతారా! నవనీత పూర్తి ప్రొఫైల్‌ తెలిస్తే అరవింద్‌ సావంతే కాదు, ఎవరైనా వింటారు.  

నవనీత్‌ కౌర్‌ లోక్‌సభ సభ్యురాలు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. స్వతంత్ర భావాలున్న వ్యక్తి కూడా. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌. నటిగా, మోడల్‌గా రాణించారు. పంజాబీ అమ్మాయి. ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎక్కువ సినిమాలు తెలుగువే. ‘‘సీఎంతో మాట్లాడేటప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్‌ సరిగా లేదు’’ అని తన గురించి మహారాష్ట్ర అధికార పార్టీ ఎంపీ అరవింద్‌ సావంత్‌ అన్నట్లు ఆమె దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు. ‘‘సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడేటప్పుడు మహిళల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలో నేర్పితే నేర్చుకుంటాం’’ అని ఆమె అన్నారు.

మహిళల బాడీ మీద ధ్యాస తగ్గించి, లాంగ్వేజ్‌ని అదుపులో పెట్టుకోవాలని కూడా ఆమె సావంత్‌కు సలహా ఇచ్చారు. అతడి మీద నవనీత్‌ చేసిన ఆరోపణ లు ఇంకా ఉన్నాయి. మనుషుల చేత ఫోన్‌ చేయించి బెదిరిస్తున్నాడు. జైల్లో తోయిస్తానని అంటున్నాడు. ఆసిడ్‌ దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నాడు. వీటన్నిటి పై ఇప్పుడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. సస్పెండ్‌ అయిన ముంబై అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజెను అవినీతి కేసు నుంచి తప్పించడానికి  జరుగుతున్న ప్రయత్నాలను తను లోక్‌సభలో ప్రస్తావించినందుకే సావంత్‌ తనను బెదరిస్తున్నారని ఆమె లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో మొదలైన వివాదం ఇది. 

సినిమా, రాజకీయాలు, వ్యక్తిగత జీవితం.. ఈ మూడింటిలో నవనీత్‌ వ్యక్తిగతం జీవితం మరింత స్ఫూర్తిదాయమైనది. ఆమె భర్త రవి రాణా కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన బద్నేరా నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడోసారి కొనసాగుతున్నారు. ఆయనా స్వతంత్ర పార్టీ అభ్యర్థే. 2004 నుంచీ సినిమాల్లో నటిస్తున్న నవనీత 2011లో రాణాను వివాహం చేసుకున్నాక సినిమాలు మానేశారు. వాళ్ల పెళ్లి ఆదర్శవంతంగా జరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరి 3 న ముంబైలో 3720 మంది వధూవరులతో ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ మహోత్సవంలో వీళ్లదీ ఒక జంట! నాటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్, బాబా రామ్‌ దేవ్‌ వంటి ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. అప్పటికే రవి రాణా ఎమ్మెల్యే.

తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నవనీత్‌ ఎన్‌.సి.పి. తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ముప్పై ఐదేళ్ల నవనీత్‌ ముక్కుసూటిగా ఉంటారు. ఆ స్వభావం వల్లనే మహారాష్ట్ర రాజకీయాలలో బలమైన మహిళా శక్తిగా రాణిస్తున్నారు. అంతటి మహిళను బాడీ లాంగ్వేజ్‌ బాగోలేదని సావంత్‌ అనడంపై సాధికా సెహ్‌గల్‌ అనే కాలమిస్ట్‌ ‘అవుటర్‌ఫ్లై’ అనే వెబ్‌సైట్‌లో రాస్తూ.. ‘‘పేరు ఎలా పలకాలో పురుషులే నేర్పిస్తారు. ఏ బ్రాండ్‌ టాంపన్‌లు మంచివో పురుషులే సూచిస్తారు. ఆఖరి కి కరెక్ట్‌ బ్రా సైజ్‌ ఏదో కూడా వాళ్లే చెప్పడానికి వస్తారు. ఈ మాన్స్‌ప్లెయినింగ్‌ ఎంతకాలం సాగుతుంది’’ అని ప్రశ్నించారు. మ్యాన్స్‌ప్లెయినింగ్‌ అంటే మగవాళ్లు ఆడవాళ్లకు నిరంతరం సలహాలు ఇస్తూ ఉండటం.                         

మరిన్ని వార్తలు