జైళ్ల గోడు: మగ్గుతున్న బతుకులు

12 Sep, 2020 08:41 IST|Sakshi

భారతీయ జైళ్లల్లో 20 వేల మంది మహిళా ఖైదీలు

ప్రతి రాష్ట్రంలో మహిళా జైలు తప్పని సరైనా 15 రాష్ట్రాల్లోనే నిర్వహణ

మొత్తం 1300 జైళ్లలో 31 మహిళా జైళ్లు

పిల్లలతో ఉంటున్న తల్లుల సంఖ్య 1543

ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన సంరక్షణ  

‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ (ఎన్‌సిఆర్‌బి) 2019 నివేదిక

కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘మోడల్‌ ప్రిజన్‌ మాన్యువల్‌ 2016’ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక మహిళా జైలు తప్పనిసరిగా ఉండాలి. కాని దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని కేవలం 15 రాష్ట్రాల్లోనే మహిళా జైళ్లు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల వివిధ స్థాయిల జైళ్లలోనే మహిళా విభాగాలను నిర్వహిస్తున్నారు. దేశంలోని జైళ్ల నిర్వహణను, ఖైదీల స్థితిగతులను తెలియ చేసే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2019 నివేదిక అనేక విషయాలను వెల్లడి చేస్తోంది.

మొత్తం ఖైదీలలో
స్త్రీలు నేరానికి దూరంగా ఉంటారు. నేర స్వభావాన్ని దగ్గరకు రానీయరు. కాని దురదృష్టవశాత్తు నేరాల్లో చిక్కుకునేవారు, తెలిసీ తెలియక నేరాలు చేసినవారు ఉంటారు. ఇలాంటివారు ఇప్పుడు దేశంలో దాదాపు ఇరవై వేల మంది జైళ్లల్లో ఉన్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలియచేస్తోంది. దేశంలో మొత్తం ఖైదీలు 4,78,600 మంది ఉండగా వీరిలో 19,913 మంది మహిళా ఖైదీలు. నిజానికి వీరంతా మహిళా జైళ్లలోనే ఉండాల్సి ఉన్నా అన్నిచోట్లా మహిళా జైళ్లు లేవు. దేశం మొత్తం మీద 1300 జైళ్లు ఉంటే వీటిలో 31 మాత్రమే మహిళా జైళ్లు. వీటిలో నాలుగు వేల మంది మాత్రమే మహిళా ఖైదీలు ఉన్నారు. అంటే మూడింతల మంది సాధారణ జైళ్లలోని ప్రత్యేక విభాగాలలో శిక్ష అనుభవిస్తున్నారన్న మాట. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కువమంది మహిళా ఖైదీలు ఉన్నారు. అక్కడ వారి ప్రస్తుత సంఖ్య 4,174.

పెరిగిన మహిళా ఖైదీలు
గత ఐదేళ్లలో దేశంలో మహిళా ఖైదీలు దాదాపు 15 శాతం పెరిగారని ఈ నివేదిక చెబుతోంది. అంటే ఈ ఐదేళ్లలో సుమారు రెండున్నర వేల మంది మహిళా ఖైదీలు జైళ్లకు తీసుకురాబడ్డారు. వీరిలో శిక్ష ఖరారైన వారు, అండర్‌ట్రయల్స్, డిటెన్యూలు ఉన్నారు. శిక్ష ఖరారైన వారి కంటే అండర్‌ట్రయల్సే ఎక్కువ ఉండటం గమనార్హం. పిల్లలతో పాటు ఉన్న తల్లులు 1543 మంది ఉన్నారు. వీరితో ఉంటున్న పిల్లల సంఖ్య 1779. జైలు మాన్యువల్‌ ప్రకారం మహిళా ఖైదీలు ఆరేళ్లలోపు పిల్లలను తమతో ఉంచుకోవచ్చు. ఆరేళ్ల తర్వాత కోరిన బంధువులకు అప్పజెబుతారు. లేదా ప్రభుత్వ నిర్వహణలో ఉండే బాలల గృహాలకు తరలిస్తారు.

సవాళ్లు
దేశంలో పురుష ఖైదీలకు జైళ్లలో సవాళ్లు ఉన్నట్టే మహిళా ఖైదీలకు కూడా సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా శుభ్రత, భద్రత ముఖ్యమైనవి. స్త్రీల దైహిక పరిస్థితులను గమనించి వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళా సిబ్బంది పర్యవేక్షణ లో వీరంతా ఉండాల్సి ఉంటుంది. కాని మహిళా సిబ్బంది సమస్య అధికం. పది మంది స్త్రీలకు ఒక బాత్‌రూమ్, టాయిలెట్‌ ఉండాల్సి ఉండగా అలాంటి ఏర్పాటు ఉన్న జైళ్లు బహు తక్కువ. నీళ్ల కొరత వల్ల శుభ్రత కరువై అనారోగ్యం బారిన పడే వారు ఎందరో ఉంటారు. ఒక మహిళా ఖైదీకి రోజుకు 133 లీటర్ల నీరు వాడకానికి ఇవ్వాలి అని నియమం. కాని అన్ని నీళ్లు ఇచ్చే ఏర్పాటు కూడా బహుతక్కువ. పురుషుడు నేరం చేసి జైలుకు వెళితే అతడు మాత్రమే జైలులో ఉంటాడు. కాని స్త్రీ జైలుకు రావలసి వస్తే కుటుంబమే చెదిరిపోతుంది. పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు.

ఇవన్నీ స్త్రీల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాని మహిళా ఖైదీల మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలకు తక్కువ పట్టింపు ఉంది. వారి డిప్రెషన్‌ జైలు గది గోడల మధ్య రెట్టింపు అవుతోంది. జైళ్లలో ఉన్న చాలామందికి తాము న్యాయ సహాయం పొందవచ్చు అని తెలియడం లేదు. ప్రతి జైలుకు ప్రభుత్వం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి. అడ్వొకేట్లను ఏర్పాటు చేయాలి. కాని దీనిని పట్టించుకునే ప్రభుత్వాలు కూడా తక్కువ. ఇక జైళ్లలో మహిళా సిబ్బంది సంఖ్య కూడా అరకొరగా ఉంటోంది. ఇప్పుడు దేశంలో ఉన్న 20 వేల మంది మహిళా ఖైదీలకు కేవలం 7,794 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన వీరిని మూడు షిఫ్టులుగా విభజిస్తే ప్రతి నిర్దిష్ట డ్యూటీలో ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు.

ప్రభుత్వాల సంరక్షణ
మహిళా ఖైదీల సంరక్షణ, చదువు, చైతన్యం, పరివర్తన, ఉపాధి విషయాలలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ఖైదీలకు కంప్యూటర్‌ శిక్షణ ఇస్తోందని, వారి కోసం హెల్త్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తోందని, చంటి పిల్లల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారని, మూడేళ్లు దాటిన పిల్లలను వారి బాల్యం సాధారణంగా ఉండేందుకు జైలు బయటి స్కూళ్లకు పంపుతున్నారని నివేదిక తెలిపింది. ఇవి కాకుండా టైలరింగ్, బేకరి పనులు కూడా నేర్పిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళా ఖైదీలు తమవారితో మాట్లాడటానికి మూడు మహిళా జైళ్లలో 65 టెలిఫోన్‌ బూత్‌లు ఏర్పాటు చేసింది. సైకాలజిస్ట్‌లను నియమించింది. గుజరాత్‌లో మహిళా ఖైదీలకు స్పోకెన్‌ ఇంగ్లిష్, బ్యూటీషియన్‌ కోర్సులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ జైళ్లలో ఆర్టిఫీషియల్‌ జువెలరీ, ఆర్టిఫీషియల్‌ ఫ్లవర్స్‌ తయారీని నేర్పిస్తున్నారు.

తరవాతి జీవితం
శిక్ష పూర్తయిన వారు తిరిగి తమ జీవితాల్లో నిలబడటానికి, కుటుంబం నుంచి సమాజం నుంచి ఒప్పుకోలు పొందడానికి సుదీర్ఘ ప్రయత్నాలు జరగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి తోడ్పాటు అందినప్పుడే ఇలాంటి వారి కొత్త జీవితం మొదలవుతుంది.

  • చాలా జైళ్లలో మహిళా ఖైదీలు కోరే కోరిక ఏమిటంటే కడుపు నిండా భోజనం పెట్టమని. పురుష ఖైదీల కంటే మహిళా ఖైదీలకు రేషన్‌ తక్కువగా దొరుకుతుంది. జైళ్లల్లో అనారోగ్యం పాలైన మహిళా ఖైదీలు విడుదలయ్యాక మందులకు డబ్బు లేక చనిపోవడం నాకు తెలుసు.  – వర్తికా నంద, సామాజిక కార్యకర్త, ఢిల్లీ
  • భర్త జైలులో ఉంటే భార్య అనేక అవస్థలు పడైనా డబ్బు సేకరించి బెయిల్‌కు ప్రయత్నిస్తుంది. కాని చాలా కేసుల్లో భార్య జైలులో ఉంటే భర్త ఆమెను ఆమె ఖర్మానికి వదిలేస్తాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆ స్త్రీలను పిల్లలు ఇంట్లోకి రానివ్వకపోవడం నాకు తెలుసు. కాబట్టి మహిళా ఖైదీలు విడుదలయ్యాక వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టాలి. – షీరిన్‌ సాదిక్,  సోషియాలజీ ప్రొఫెసర్, అలిగర్‌ యూనివర్సిటీ

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు