Neelakurinji: ఆ పువ్వులు మళ్లీ 2030లో పూస్తాయి!

8 May, 2021 11:38 IST|Sakshi

మున్నార్‌ అంటే మూడు నదుల సమ్మేళనం. పశ్చిమ కనుమలలో విస్తరించిన ఈ ప్రదేశం ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్‌. ఈ కొండలకు నీలగిరులు అనే పేరు రావడానికి ‘నీలకురింజి’ పూలే కారణం. 

కేరళలో ఏ ప్రదేశానికి ట్రిప్‌ అయినా సరే ట్రైన్‌ పాలక్కాడ్‌ సమీపించగానే మరోలోకంలోకి వెళ్తున్న భావన కలుగుతుంది. పచ్చని పొలాలు, లెక్కపెట్టటానికి సాధ్యం కానన్ని కొబ్బరిచెట్లు కనువిందు చేస్తాయి. రైల్లోకి కనిపించే చిన్న చిన్న గ్రామాలు, ఇళ్లు ముచ్చటగా ఉంటాయి. చాలా వరకు పెంకుటిళ్లే. పెంకులను అమర్చడంలో నైపుణ్యం సీనియర్‌ ఆర్కిటెక్ట్‌ను కూడా మురిపించేటట్లు, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేటట్లు ఉంటుంది. ఇటీవల ఆర్కిటెక్ట్‌లు ఎర్ర పెంకు కప్పు నిర్మాణాల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు కూడా. 

పుష్కరకాలం ఎదురు చూపు
నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి ప్రకృతి వరం వికసిస్తుంది. కొండల మీద ఎటు చూసినా నీలకురింజి చెట్లే. ఈ చెట్లు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తాయి. పూసిన పువ్వు ఏడాది వరకు ఉంటుంది. ఒక చెట్టు ఒక్కపువ్వును మాత్రమే పూసి వాడిపోతుంది. ఆ పువ్వు పేరు నీలకురింజి. నీల అంటే నీలిరంగు, కురింజి అంటే మళయాళంలో పువ్వు అని అర్థం. ఆ నీలిపువ్వునుంచి  రాలిన గింజలు మొలకెత్తి పన్నెండేళ్లకు పూతకు వస్తాయి. నీలకురింజి పూలు పూసిన ఏడాది పర్యటించగలగడం అదృష్టమనే చెప్పాలి.

2006లో ఈ పూలు పూశాయి, ఆ తర్వాత 2018లో పూశాయి. ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి తన ప్రసంగంలో పశ్చిమ కనుమల్లో విరిసే నీలకురింజి గురించి ప్రస్తావించారు. అయితే ఆ ఏడాది ప్రకృతి వరం ఇవ్వడంతోపాటు కన్నెర్ర కూడా చేసింది. పూలు కొండల నిండుగా విరిసిన జూలై, ఆగస్టుల్లో కుంభవృష్టి కురిసింది. కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వే మీద కూడా నీళ్లు నిలిచాయి. విమాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు నడవడం కూడా కష్టమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా టూరిజం గాడిన పడడానికి కొద్ది నెలలు పట్టింది. పర్యాటకుల పుష్కర కాలపు ఎదురు చూపు వృథా అయింది. 

ఒకటి కాదు... యాభై రకాలు!
కురింజి పూసినప్పుడు కొండలన్నీ నీలిరంగు దుప్పటి పరిచినట్లు ఉంటాయి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్‌లను మామూలు రోజుల్లో చూసిన వాళ్లు కూడా కురింజి కోసం ఆ పువ్వు పూసే ఏడాది మళ్లీ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటారు. బొటానికల్‌గా వీటిని 50 రకాల జాతులుగా చెప్తారు కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్‌లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్‌ చేయలేనంత లలితంగా ఉంటాయి. ఈ పూలు మళ్లీ 2030లో పూస్తాయి. ఆ ఏడాది కోసం ఎదురు చూద్దాం.

ట్రావెల్‌ టిప్స్‌: జాగ్రత్తగా వెళ్లి వద్దాం!
కేరళలో ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఎక్కువ. కాబట్టి టూర్‌లో తేలికపాటి దుస్తులు ధరించాలి. ఈ వాతావరణంలో పాదాలకు కూడా చెమట పడుతుంది. రెయినీ షూస్‌ అయితే తడి నేల మీద అడుగు వేసినప్పుడు జారదు. బురద అంటినా శుభ్రం చేసుకోవడం సులభం.

  • కేరళ ఆహారంలో మసాలాలు ఉండవు కాబట్టి, జీర్ణాశయ సమస్యలు ఎదురుకావు. జలుబు, జ్వరం మందులు మాత్రం దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది.
  • కేరళ టూర్‌లో రోజూ తలస్నానం చేయాలి, ఒక కొబ్బరి బోండాం తాగడం కూడా మంచిది. 
  • కేరళలో దొరికే అరటికాయ చిప్స్‌ రుచి చూడాలి. కొబ్బరి నూనెలో వేయించిన అరటికాయ చిప్స్‌ నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీలయితే కొన్ని ప్యాకెట్‌లు తెచ్చుకోవచ్చు. ∙టీ ఆకులతో మరిగించిన టీ రుచి చూడాలి. టీ పొడులు రకరకాల ఫ్లేవర్‌లు దొరుకుతాయి. 
  • చదవండి: కొండల రాణి.. మేఘాల్లో తేలినట్లుగా ఉంటుంది!
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు